Saturday, September 21, 2013

pulse,నాడి

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- pulse,నాడి -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

బ్రతికినంత కాలం నాడి కొట్టుకుంటుంది. నాడి ఆగడం అంటే చనిపోవడమే. మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్‌ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. చేతి మణికట్టు దగ్గర గుండె పంప్ చేయుటను సిరలలో ఫీలవడాన్ని నాడి లేదా పల్స్ అంటాము . ఈ వేగం (పల్స్‌) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.

  • నాడి  (Nerve) జంతువుల శరీరంలో నాడీ వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు.(బహువచనం నాడులు)--తెలుగు భాషలో నరము- A vein or artery, a nerve మూడింటికి కలిపి ఉపయోగిస్తారు. చేతి పల్స్ చూడడాన్ని నాడిచూడు  అని అంటారు. కపాల నాడులు : మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నాడులు.    కశేరు నాడులు : వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నాడులు.    నవనాడులు : ప్రాచీన వేదాలలో పేర్కొన్న తొమ్మిది నాడులు.

గుండె సాధారణ (నార్మల్‌) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన  పల్స్‌ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు  మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్‌ మందులు, గుండెలయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండెవేగంపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ఇలాంటివారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండెవేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండెవేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముటుంది.

వేగాన్ని పెంచే కారకాలు

* ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది.

* శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది.

* భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది.

* వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు.

వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?
వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.

ఆరోగ్యస్థితిని అంచనా వేసే మార్గాల్లో నాడి చూసుకోవటం చాలా తేలికైంది. సమర్థవంతమైంది కూడా. కేవలం 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకునే వీలుంటుంది. మణికట్టు వద్ద బొటనవేలు కిందిభాగంలో గానీ మెడకు ఒక పక్కన గానీ రెండు వేళ్లతో ఒకింత గట్టిగా అదిమిపడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవటాన్ని గమనించొచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి, దాన్ని రెట్టింపు చేస్తే ఒక నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటివారికి గుండెపోటు వంటి జబ్బుల ముప్పు తక్కువ. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటున్నకొద్దీ గుండె సమస్యల ముప్పూ పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎన్నిసార్లు కొట్టుకోవాలి?
పెద్దవాళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణంగా నిమిషానికి 60-100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కానీ అంతకన్నా తక్కువగా.. 50-70 సార్లు కొట్టుకోవటమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగా గలవారిలో శారీరక సామర్థ్యం తక్కువగానూ.. రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టూ తేలింది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81-90 సార్లు నాడి కొట్టుకునేవారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతున్నట్టు బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువసార్లు గుండె కొట్టుకునేవారిలో ఈ ముప్పు మూడింతలు అధికంగా ఉంటుండటం గమనార్హం.

వేర్వేరు సమయాల్లో..
గుండె వేగాన్ని ఒత్తిడి, ఆందోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతో పాటు రక్తపోటు, ఆందోళన తగ్గటానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించటానికి వారం మొత్తమ్మీద వేర్వేరు సమయాల్లో అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. చాలా సందర్భాల్లో 80 కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఎప్పుడు చూసుకోవాలి?
శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే 1-2 గంటల తర్వాత.. కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలి. ఉదయం పూట నిద్ర లేచాక మంచం మీది నుంచి దిగకముందే గుండె వేగాన్ని పరీక్షించుకోవటం ఉత్తమం.

కొలెస్ట్రాల్‌ అదుపుతో మేలు
కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, రక్త ప్రసారం తగ్గుతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుకోవటం, వ్యాయామం ద్వారా గుండె వేగం పెరగకుండా చూసుకోవచ్చు.
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.