Friday, January 11, 2013

Albumin in Urine - మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Albumin in Urine - మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 మూత్రం (Urine) జంతువుల శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే ద్రవం. ఇది రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. మన  శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది.

మూత్రాన్ని రకరకాల మూత్ర పరీక్షల ద్వారా దాని లోని వివిధ పదార్ధాలను గుర్తించి విశ్లేషించవచ్చును. సాధారణము గా మూత్రము లో ప్రోటీన్‌ పోవడము జరుగదు .

 మూత్రంలో అల్బుమిన్‌ : అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం  తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. శరీరాన్ని  ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శుద్ధి యంtraaలు కిడ్నీలు. అలాంటి కిడ్నీలు పనిచేయడం మానేస్తే.. మన శరీరమే విషతుల్యం అయిపోతుంది.

మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వీళ్లలో చాలామందికి తమ కిడ్నీలో సమస్య ఉందన్న  విషయమే తెలియదు. కిడ్నీ జబ్బులకి సవాలక్ష కారణాలు. కారణం తెలిస్తే కిడ్నీజబ్బులను ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు.

మూత్రంలో ఏమాత్రం ప్రోటీన్‌ పోతున్నా మధుమేహులు జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహుల్లో కిడ్నీ సమస్యలూ తలెత్తే అవకాశముంది. దీంతో మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ పోవటం కనిపిస్తుంది. ఇలాంటివారికి గుండెపోటు, పక్షవాతం, గుండెవైఫల్యం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా 90% మంది మధుమేహుల్లో మూత్రంలో అల్బుమిన్‌ స్థాయులు  మామూలు మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ వీరికి కూడా గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందా? అనేదానిపై ఇటలీ పరిశోధకులు  తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ ప్రోటీన్‌ మోతాదు కొద్దిగా పెరిగినా గుండె సమస్యల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఇక  దీని మోతాదు పెరుగుతున్నకొద్దీ ముప్పూ ఎక్కువవుతూ వస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహులు మూత్రంలో  అల్బుమిన్‌ పోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రము లో ప్రోటీన్‌ పోవడాన్ని ఈ క్రింది రకాలుగా చెప్పవచ్చు :
  • మైక్రోఆల్బుమినూరియా,
  • మాక్రో ఆల్బుమినూరియా,
  • ప్రొటినూరియా లేదా ఆల్బుమినూరియా
  • యూరిన్‌ - క్రియాటినిన్‌ రేషియో,

మూత్రములో ప్రోటీన్‌ పరీక్ష . . సుమారు 5-10 మి.లీ. మూత్రము ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని పై భాగము వేడిచేయగా ప్రోటీన్‌ కాగులేట్ అయి తెల్లని పొర(టర్బిడ్) గా యేర్పడును. ఇది మనకు ప్రోటీన్‌ ఉన్నదీ .. లేనిదీ తెలుసందే తప్ప ఖచ్చితముగా ఎంత మోతాదులో పోతుందో తెలియదు. 1+, 2+, 3+,4+ అని అంచనా పై రిపోర్ట్ చేయుదురు. నార్మల్ గా 0-8/100 మి.లీ. ఉంటుంది .

మూత్రము లో ప్రోటీన్‌ కనిపించే కొన్ని ముఖ్యమైన వ్యాధులు :
  •  మధుమేహము --diabetes
  •  రక్తపోటు --hypertension,
  • కాలేయ వ్యాధులు --liver cirrhosis,
  • గుండె జబ్బులు --heart failure ,
  • ఒకరకమైన చర్మ వ్యాది --systemic lupus erythematosus.
  • మూత్రపిండాల వ్యాధులు ..Glomerulo nephritis , nephrotic syndrome,
  • గర్భిణీ లలో మూత్రము లో ప్రోటీన్‌ ఉంటే గుర్రపు వాతవ (eclampsia) అనే సీరియస్ వ్యాధికి దారితీయును,
-----------------------------------------------------------------------------------------------


Albumin in Urine-మూత్రంలో అల్బుమిన్‌ - Ayurvedhic Treatment / Dr.chirumamilla muralimanohar

మన రక్తంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. రక్తం తాలూకు ద్రవాభిసరపీడనం (ఆస్మాటిక్ ప్రెషర్)ని నిర్దేశిత స్థితిలో ఉంచటం దీని ప్రధాన విధి. దీనికోసం శరీరంలో రక్తంతోపాటు ప్రొటీన్ కూడా సంచరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్‌తోకూడిన రక్తం మూత్ర పిండాలను చేరుకుంటుంది. కిడ్నీలు రక్తంలో అదనంగా ఉండే ప్రొటీన్‌ని వడపోత ద్వారా వేరుపరిచి వెలుపలకి విసర్జిస్తాయి. ఇది శారీరక క్రియలో భాగంగా కనిపించే సహజ ప్రక్రియ. అయితే ఏదైనా  కారణం చేత మూత్రపిండాలు విసర్జించాల్సిన స్థాయి కంటే ఎక్కువ ప్రొటీన్‌ని లేదా ఆల్బుమిన్‌ని మూత్రం ద్వారా వెలువరిస్తే దానిని ఆల్బుమినూరియా అంటారు. దీనినే  మైక్రోఆల్బిమునూరియా అని కూడా పిలుస్తారు. మామూలు డిప్‌స్టిక్ పద్ధతుల ద్వారా మూత్రంలో ఉండే ప్రొటీన్‌ని కొలవటం సాధ్యం కానప్పుడు మైక్రో ఆల్బిమునూరియా అంటారు. గ్లోమరూలర్ ప్రొటినూరియా, నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి పేర్లతో కూడా ఈ వ్యాధి స్థితిని వ్యవహరిస్తారు.

ఆల్బుమినూరియాను పోలిన వ్యాధి స్థితిని ఆయుర్వేదం ''లాలామేహం'' అనే పేరుతో వివరించింది. ఇది 10 రకాలైన కఫజ ప్రమేహాల్లో ఒక భేదం. జొల్లులాగా తీగలుగా, జిగటగా వెలువడే మూత్రాన్ని లాలామేహం అంటారు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో ప్రభావవంతమైన చికిత్స ఉంది. మన శరీరాల్లో ప్లాస్మా ప్రొటీన్లనేవి ఉండటం అవసరం. ఈ ప్రొటీన్లు వెలుపలకు  వెళ్లిపోకుండా చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. గ్లోమరూలర్ ఫిల్టరేషన్ బ్యారియర్ ద్వారా ప్రొటీన్లు వెళుతున్నప్పుడు కిడ్నీలలోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే నిర్మాణాలు
ఈ ప్రొటీన్లను తిరిగి శరీరంలోకి గ్రహిస్తాయి. ఆరోగ్యవంతుల్లో రోజు మొత్తం విసర్జించిన మూత్రంలో 150 మిల్లీ గ్రాముల వరకూ (లేదా 100 మిల్లీలీటర్ల మూత్రంలో 10 మిల్లీ గ్రాముల వరకూ) ప్రొటీన్ కనిపించడం సహజం. ఇంతకంటే ఎక్కువ మొత్తాల్లో ప్రొటీన్ మూత్రంతోపాటు వెళుతుంటే దానిని అసాధారణంగా భావించాలి. కిడ్నీ వ్యాధులుగాని లేదా ఇతర సాధారణ
సంస్థాగత (సిస్టమిక్) వ్యాధులు గాని దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. శారీరక శ్రమ, తీవ్రావస్థలో కనిపించే వ్యాధులు, హెచ్చు స్థాయి జ్వరాలు, నెలసరిలో అపక్రమం, గర్భధారణ,
అసాధారణమైన యోనిస్రావాలు, ఆహారంలో తేడాలు, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరగటం వంటి అనేక అంశాలు మైక్రో ఆల్బునూరియాకి కారణమవుతాయి రాత్రి మొత్తం కాలం పగటి మొత్తం కాలం రెంటినీ పోల్చి చూస్తే రాత్రి కంటే పగటిపూట ఆల్బుమిన్ విసర్జన 25 శాతం అధికంగా ఉంటుంది. టైప్ 1 మధుమేహం (ఇన్సులిన్ మీద ఆధారపడే
మధుమేహం)లో ఆల్బుమినూరియా కనిపిస్తే మూత్ర పిండాల వైఫల్యాన్ని పరిగణించాలి. కాగా టైప్ 2 మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటంవల్ల ఉత్పన్నమయ్యే ఇస్కీమిక్ గుండె జబ్బులను దృష్టిలో ఉంచుకోవాలి. రోగ వికృతి విధి విధానం త్రివిధమైన కారణాలవల్ల మూత్రంలో అసాధారణ స్థాయిలో ఆల్బుమిన్
కనిపించే అవకాశం ఉంది. మూత్రపిండాల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ ప్రొటీన్లను తిరిగి గ్రహించనివ్వకుండా చేసే వివిధ సంస్థాగత వ్యాధులవల్ల ఈ స్థితి రావచ్చు. ఇది మొదటి కారణం.
రక్తంలోని ప్లాస్మా ప్రొటీన్లు అధికంగా ఉత్పత్తి కావటమే కాకుండా మూత్రపిండాలు వడపోయగలిగే స్థాయిని మించిపోయి ప్రొటీన్లు మూత్రపిండాలను చేరుకోవటం రెండవ కారణం.
మూత్ర పిండాల్లోని గ్లొమరులర్ బ్యారియర్స్ అనే నిర్మాణాలు తమ పరిమితులను కోల్పోయి అసాధారణ స్థాయిలో మధ్యమ స్థాయి అణుభారం కలిగిన ప్రొటీన్లను అనుమతించటం అనేది
ఆల్బూమినూరియాకు మూడవ కారణం.

స్ర్తి పురుష భేదాన్ని పరిగణిస్తే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. వ్యాధి ఇతివృత్తం ఈ సమస్య ఎక్కువమందిలో
యాదృచ్ఛికంగా బయటపడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే రొటీన్ పరీక్షల్లో ఆల్బూమినూరియా ఉన్నట్లు బయటపడుతుంది.
ఆల్బూమినూరియా ఉన్నంత మాత్రాన దానిని ప్రమాదభరితమైన మూత్రపిండాల వ్యాధులకు ముడిపెట్టాల్సిన పనిలేదు. మామూలు వ్యాధుల్లో సైతం ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది కనుక ముందుగా ఈ కోణంలో దర్యాప్తు చేయటం అవసరం. ఆల్బూమినూరియా ఉన్నదని తేలినప్పుడు మూత్రంలో ఎరుపుదనం, నురగ వంటి లక్షణాలతోపాటు  సకోశవ్యవస్థకు
చెందిన సమస్యలు అనుబంధంగా కనిపిస్తున్నాయేమో తెలుసుకోవాలి. అలాగే మడమల్లోను వాపు, కంటిచుట్టూ వాపు, వృషణాలూ, యోని పెదవుల్లో వాపు వంటివి అనుబంధంగా ఉన్నాయేమో చూడాలి. గతంలో అధిక రక్తపోటు కనిపించిన ఇతివృత్తం ఉండటం, రక్తంలో కొలెస్టరాల్ అధికంగా ఉండటం, గర్భధారణలో కిడ్నీలు వ్యాధిగ్రస్తమైన సందర్భాలు ఉండటం, మధుమేహం ఉండటం, కుటుంబంలో ఇతరులకు మధుమేహం ఉండటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులుండటం, రేనాడ్స్‌వ్యాధి (చర్మంపైన దద్దురు, కళ్ళుఎర్రబారటం, కీళ్లు పట్టేయడం) వంటి వ్యాధుల ఇతివృత్తం గురించి తెలుసుకోవాలి. అలాగే మం దుల వాడకం గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం. కా ర్లు, క్షయ,
మలేరియా, సిఫిలిస్, ఎండోకార్డైటిస్ వంటి వ్యా ధుల బారిన పడిన సందర్భాలున్నాయేమో తెలుసుకోవాలి. హెచ్‌ఐవి, హెపటైటిస్-బి వంటి వైరల్ వ్యాధులబారిన పడే అవకాశం
(రిస్కు) ఉన్నదేమో తెలుసుకోవాలి. జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టటం, బరువు తగ్గటం, ఎముకలనొప్పి వంటి లక్షణాలను అడిగి తెలుసుకోవాలి. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్‌ని సూచించే ఉపద్రవాలున్నాయేమో గమనించాలి. గజ్జల్లో నొప్పి, కడుపునొప్పి, ఆయాసం, ఊపిరితో ఛాతినొప్పి రావటం, వణుకు వంటి లక్షణాలకు ప్రాముఖ్యతనివ్వాలి. వ్యాధి నిర్థారణ, విశే్లషణ తాత్కాలికంగా కనిపించే ప్రొటినూరియా వ్యాధిలో రీనల్ ఫంక్షన్ పరీక్షలో తేడా ఉండదు. పొడుగ్గా సన్నగా ఉండే వ్యక్తుల్లో, అందునా 30 ఏళ్ళలోపు వ్యక్తుల్లో కనిపించవచ్చు. ఈ స్థితితోపాటు సాధారణంగా వెన్ను వంపు కనిపిస్తుంది. శాశ్వతంగా మూత్రంలో  ప్రొటీన్ పోతుండటం, మూత్రంతోపాటు విసర్జితమయ్యే ప్రొటీన్ మొత్తాలు 500 మిల్లీ గ్రాముల ఉండటం అనేది అంతర్గత కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది. మూత్రంలో రక్తకణాల మేట కనిపించటం, రక్తంలో ఆల్బుమిన్ తగ్గటం (హైపోఆల్బిమునీమియా), మూత్రంలో కొవ్వు కనిపించటం (లిపిడూరియా), వాపు, కిడ్నీల పనితీరుని చెప్పే రీనల్ ఫంక్షన్ టెస్టు అసాధారణమైన ఫలితాలను ప్రదర్శించటం, రక్తంలో కొవ్వు ఎక్కువ మొత్తాల్లో ఉండటం (హైపర్ లిపిడిమియా), రక్తపోటు అధికంగా ఉండటం వంటివి అన్నీ కిడ్నీలు వ్యాధిగ్రస్తం కావడం మూలాన ప్రాప్తించే ఆల్బిమినూరియాలో కనిపిస్తాయి.

సూచనలు, ఆయుర్వేద చికిత్స 
* చంద్రప్రభావటి, శిలాజిత్తు, యశదభస్మం, చంద్రకళారసం, స్వర్ణమాక్షీక భస్మం, త్రివంగ భస్మం, యోగేంద్ర రసం, గుడూచిసత్వం, నాగభస్మం వంటివి ఈ వ్యాధిలో ప్రయోగించదగిన ఆయుర్వేద ఔషధాలు.
* ఆల్బుమినూరియా (లాలమేహం) వ్యాధి స్థితిలో ప్రత్యేకంగా వాస (అడ్డసరం ఆకులు), హరీతకి (కరక్కాయ పెచ్చులు), చిత్రక (చిత్రమూలం వేర్లు), సప్తపర్ణి (ఏడాకులపొన్న) వీటితో కషాయం తయారుచేసుకొని తాగితే హితకరంగా ఉంటుంది.
* ఉసిరికాయల రసం (20 మిల్లీలీటర్లు), పసుపు (5 గ్రా.) లను రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పుచ్చుకోవాలి.
* త్రిఫలాలు, పెద్దపాపర (విశాల), దేవదారు, తుంగముస్తలు వీటిని సమాన భాగాలు తీసుకొని కషాయ రూపంలో 30 మిల్లీ లీటర్ల మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
* అడవి మల్లె పుష్పాలు (కుటజ), కపిత్థ పుష్పాలు (కపిత్థ), రోహితక పుష్పాలు, విభీతకి పుష్పాలు, సప్తపర్ణ పుష్పాలు (ఏడాకులపొన్న)వీటిని ముద్దగా  నూరి ఉసిరిపండ్ల రసానికి కలిపి తీసుకోవాలి.
* వేప, రేప, ఏడాకుల పొన్న, మూర్వ, పాలకొడిశ, మదుగ వీటి పంచాంగాలను కషాయం రూపంలో అవసరమైతే తేనె చేర్చి తీసుకోవాలి.
* చంద్రప్రభావటి అనే మందు జాంబవాసవం అనుపానంగా వాడాలి.
* శిలాజిత్తు (500 మి.గ్రా.), వసంత కుసుమాకరరసం (100 మి.గ్రా) మోదుగపువ్వుల కషాయంతో పుచ్చుకోవాలి.
* చిల్లగింజలను మజ్జిగతో గంధం తీసి మూత్రవిరేచన క్వాథంతో 20మిల్లీ లీటర్ల మోతాదులో రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. ఆహారం ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పు చేర్చకూడదు. ముఖ్యంగా వాపు కనిపిస్తున్న సందర్భాల్లో ఈ సూచన బాగా గుర్తుంచుకోవాలి.
* ఈ వ్యాధి స్థితిలో ప్రొటీన్ (మాంసకృతులు) పదార్థాల వాడకం గురించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. మధుమేహంతో కూడిన కిడ్నీ వ్యాధుల్లోనూ, గ్లొమరూలర్ వ్యాధుల్లోనూ కనిపించే
ఆల్బూమినూరియాలో ప్రొటీన్‌ని తగ్గించటం ద్వారా వ్యాధి కొనసాగే వేగాన్ని తగ్గించవచ్చునని తేలింది. అయితే ప్రొటీన్‌ని తగ్గిస్తే పోషకాహార లోపం (మాల్‌న్యూట్రిషన్)వల్ల ఇక్కట్లు వచ్చే చిక్కు ఉంది కాబట్టి రోజుకు ఒక కిలో శారీరక బరువుకు ఒక గ్రాము చొప్పున లెక్కకట్టి ప్రొటీన్ వాడకుంటే మంచిది. అంటే, 70 కిలోల బరువుండే వ్యక్తులు రోజుకు 70గ్రాముల ప్రొటీన్
తీసుకోవాలన్నమాట.

--డా.చిరుమామిళ్ల మురళీమనోహర్@Andhrabhoomi news paper

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.