Saturday, December 1, 2012

Winter related illness - శీతాకాలము సంబంధిత అనారోగ్యాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Winter related illness - శీతాకాలము సంబంధిత అనారోగ్యాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    శీతగాలి. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు  కొంత కష్టమే. చలికాలం పిల్లలనూ, వృద్ధులనూ కంటికి రెప్పలా కాపాడుకోవటం చాలా అవసరం. చలికాలం అందర్నీ వణికిస్తుంది. చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధుల మరణాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ కాలంలో కేవలం వెచ్చదనం కోసమే మన శరీరం పెద్దమొత్తంలో శక్తిని ఖర్చు పెడుతుంటుంది. ఈ ఒత్తిడికి తట్టుకోలేక మనలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో జీవక్రియలు గతి తప్పి రకరకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముట్టటానికి ఆస్కారం పెరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ఇదే పెను ముప్పుగా పరిణమిస్తుంది.

పసిపిల్లలకు వెచ్చదనం :
చలితో మరణాల గురించి ఏటా వార్తలు చూస్తూనే ఉంటాం. పెద్దల సంగతే ఇలా ఉంటే ఇక ఇప్పుడే పుట్టిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన వారి సంగతి చెప్పనవసరం లేదు. అందుకే ఈ సీజన్లో పిల్లలు పుట్టినపుడు ముందు వాళ్లు వెచ్చగా ఉండేలా చూడాలి. తల్లిగర్భంలో శిశువులు వెచ్చదనంలో ఉంటారు. పుట్టగానే బయట ఒక్కసారిగా భిన్నమైన వాతావరణంలో మనగలగాల్సి వస్తుంది. ఇది తట్టుకోలేక చాలామంది పిల్లలు చల్లగా అయిపోయి మరణిస్తుంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం వెచ్చగా ఉండాలంటే తగినంత గ్లూకోజు, ఆక్సిజన్‌ అవసరం. అయితే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు శరీరంలో గ్లూకోజు, ఆక్సిజన్‌ అంత స్థాయిలో ఉండవు. దీంతో వారు ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టలేరు. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఇది 95 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తగ్గితే ఒంట్లో అన్ని ఎంజైమ్‌లు, అన్ని కణాల జీవక్రియలూ నిలిచిపోతాయి. దీంతో కీలక వ్యవస్థలు కుంటుబడి, చివరికి ప్రాణాపాయం సంభవిస్తుంది. కాబట్టి శిశువులకు వెచ్చదనం అనేది ఎంతో అవసరమని గుర్తించాలి. మన దేశంలో శిశు మరణాల రేటు అధికంగా ఉండటానికి పుట్టగానే వెచ్చగా ఉంచే పద్ధతులు పాటించకపోవటం కూడా ఒక ముఖ్య కారణం. సంప్రదాయంగా కాన్పు కాగానే మన ఇళ్లలో బిడ్డలకు స్నానం చేయించటం రివాజు. అయితే ఈ సమయంలో స్నానం కంటే కూడా వెచ్చగా ఉంచటం ముఖ్యం. తల్లి గర్భంలో ఉమ్మనీరులో ఉన్నప్పుడు శిశువు చర్మంపై రక్షణగా 'వర్నిక్స్‌ కేసియోసా' అనే పొర ఉంటుంది. శిశువు చల్లగా కాకుండా ఇది రక్షణగా నిలబడుతుంది. కాబట్టి స్నానం చేయించి దీన్ని వెంటనే తొలగించాల్సిన పని లేదు. బిడ్డ పుట్టగానే వెంటనే పొడిగా ఉండే, ముందుగా వెచ్చబెట్టిన వస్త్రాల్లో శిశువును తీసుకోవాలి. తర్వాత ఆ వస్త్రాలతో తడినంతటినీ సున్నితంగా తుడిచి.. గోరువెచ్చగా ఉండే వార్మర్‌ కింద ఉంచాలి. తర్వాత- తల్లి దగ్గర వెచ్చగా పడుకోబెట్టాలి. తలతో పాటు శిశువు శరీరమంతటినీ వస్త్రాలతో చుట్టి పడుకోబెడితే బాగా వెచ్చదనం లభిస్తుంది. పాలు పడితే శక్తి పుంజుకుంటుంది. ఇలా ఒక పూట గడిచిన తర్వాత.. శిశువు శరీరంలో వ్యవస్థలన్నీ కుదురుకున్నాక.. అప్పుడు స్నానం చేయించొచ్చు. శిశువు బతికి బట్టకట్టటానికి ఇది ముఖ్యమని గుర్తించాలి.

ఆస్థమా, అలర్జీలు :
చలికాలంలో ఆస్థమా, అలర్జీలు ఉద్ధృతమవుతాయి. ఆస్థమా ఉన్నవారికి ఈ కాలంలో... తుమ్ములు, ముక్కు దిబ్బడ, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, రోజువారీ పనుల్లో ఇబ్బంది, బడికి వెళ్లలేకపోవటం, ఆయాసంతో బాధపడటం, రాత్రిపూట లేచి కూచోవటం, దమ్ము, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి బాధిస్తాయి. అందుకే ఆస్థమా, అలర్జీలున్న వారికి చలికాలం మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆస్థమా, అలర్జీలున్నవారు ఈ కాలం ఒక్కరోజు కూడా విడవకుండా, డాక్టరు ఆపమని చెప్పే వరకూ కూడా విధిగా 'కంట్రోలర్‌' రకం ఇన్‌హేలర్లు వాడాలి. దీంతో ఆస్థమా దాడి చేయకుండా చూసుకోవచ్చు. ఆస్థమా ఉద్థృతమైతే 'రిలీవర్‌' ఇన్‌హేలర్‌ వాడుకోవాలి. అసలు కంట్రోలర్‌ను క్రమం తప్పకుండా వాడితే రిలీవర్‌ అవసరమే ఉండదు.

పొడిచర్మం :
చలికాలం రాగానే వాతావరణంలో తేమ తగ్గుతుంది. దీంతో చర్మంలోని తేమ ఇగిరిపోయి పెదవులు, చెంపలు పగలటం.. చేతులు, కాళ్లు పొడిబారటం.. దురద మొదలవుతాయి. చలికాలంలో చర్మం మీదుండే రక్షణ వ్యవస్థ కూడా క్షీణిస్తుంది. కాబట్టి దురద పెట్టినపుడు గోకితే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. పొడిబారటం మూలంగా పగిలిపోయే చర్మానికి అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. పొడి చర్మం గలవారికి అటోపిక్‌ డెర్మటైటిస్‌, ఎండుగజ్జి వస్తుంది. 10-20% మంది పిల్లలు అటోపిక్‌ డెర్మటైటిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇందులో జరిగేదేమంటే- దురద పెట్టటం.. గోకటం.. గోకినందువల్ల తిరిగి దురద పెట్టటం.. ఇదోవిష వలయంలా తయారవుతుంది. దీంతో చర్మం దెబ్బతిని, ఎర్రగా తయారవుతుంది. రాత్రిళ్లు సరిగా నిద్రపోరు. క్రమేపీ గోకిన చోట బ్యాక్టీరియా చేరి, చీముపట్టి (సెకండరీ ఇన్‌ఫెక్షన్ల) సమస్యలు పెరుగుతాయి. దీంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులకూ వేదన మొదలవుతుంది. చూడటానికి వికారంగా ఉందని, బాగా గోకుతున్నారని, తరచూ ఏడుస్తున్నారని పెద్దలకూ మనసు స్థిమితంగా ఉండదు. కాబట్టి ఈ సీజన్లో పిల్లల చర్మం పొడిబారకుండా, గోకకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవటం పెద్దల కనీస బాధ్యత.

బ్రాంకియోలైటిస్ :
ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా ఈ సీజన్లో కొన్ని రకాల వైరస్‌లు విజృంభిస్తాయి. వీటిల్లో ముఖ్యమైంది శ్వాస సమస్యలు తెచ్చిపెట్టే 'రెస్పిరేటరీ సిన్‌సీషియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ). ఇది మొగుళ్లవాపు (బ్రాంకియోలైటిస్‌) తెచ్చిపెడుతుంది. మూణ్నెల్ల నుంచి రెండేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. కొద్దిగా జలుబు, దగ్గు, గురగుర, పిల్లికూతలు, డొక్కలు ఎగరేయటం, శ్వాస అందకపోవటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, పాలు తాగకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు పడే ఈ బాధ చూడలేక తల్లిదండ్రులు గిలగిల్లాడిపోతుంటారు. సమస్య తీవ్రమైతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స తప్పనిసరి అవుతుంది. కాబట్టి సమస్యను ముందే పట్టుకుని వైద్యులకు చూపించి తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఒంట్లో నీరు తగ్గకుండా చూడటం ముఖ్యం. ఒంట్లో తగినంత నీరు లేకపోతే శ్వాసనాళాల్లోని జిగురు ద్రవాలు పిడచ కట్టుకుపోయి, ఆ నాళాలు మూసుకుపోతాయి. ఊపిరితిత్తుల పని కష్టమై.. శరీరానికి తగినంత ఆక్సిజన్‌ అందని పరిస్థితి తలెత్తుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గితే ఎంత దగ్గినా జిగురుద్రవాలు బయటకు రాలేక.. ఆయాసం వస్తుంది. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండేలా చూడటం చాలా అవసరం. అయితే ఈ బ్రాంకియోలైటిస్‌ బారినపడ్డ పిల్లలు ఒకేసారి ఎక్కువ మొత్తంలో పాలు తాగలేరు కాబట్టి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు పడుతుండాలి. ఆర్నెల్లు దాటినవారికి తరచుగా నీళ్లు తాగించాలి. పిల్లలు మగతగా ఉండి, పాలు తీసుకోలేని పరిస్థితిలో ఉండి, డొక్కలు ఎగరేస్తుంటే బ్రాంకియోలైటిస్‌ తీవ్రంగా ఉందని అర్థం. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. అక్కడ వీరికి సెలైన్‌ పెట్టి, ఆక్సిజన్‌ ఇస్తారు. యాంటీబయోటిక్స్‌, నెబులైజేషన్‌, సాల్‌బుటమాల్‌ వంటి మందుల అవసరమేం ఉండదు. ఇలా 2, 3 రోజులపాటు జాగ్రత్త తీసుకుంటే సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. చలికాలంలో ''ఆర్‌ఎస్‌వీ''తో పాటు మామూలు జలుబు వైరస్‌లూ తరచుగానే దాడిచేస్తాయి. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వాటంతట అవే తగ్గేవే అయినా.. పిల్లలకు జలుబు, జ్వరం కనిపిస్తే అవే తగ్గుతాయని సరిపెట్టుకోటానికి లేదు. ఎందుకంటే పిల్లల్లో రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. పైగా ఈ బ్రాంకియోలైటిస్‌ ముప్పు ఎక్కువ. కాబట్టి వైద్య సహాయం తీసుకోవటం శ్రేయస్కరం.

ఫ్లూ జ్వరం :
ఈ మధ్య ఫ్లూ భూతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇది చలికాలంలో ఎక్కువ వస్తుంది. ఇది వచ్చినపుడు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ఎక్కువైతే న్యుమోనియాకూ దారి తీస్తుంది. 1902లో స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు యూరప్‌, అమెరికా ఖండాల్లో 20% మందిని పొట్టన పెట్టుకుంది. ఫ్లూ వచ్చాక శరీర రక్షణ వ్యవస్థ బలహీనపడి వాళ్లందరికీ న్యుమోనియా (సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌) వచ్చింది. దీంతో మరణాలు సంభవించాయి. 1944లో యాంటీబయోటిక్‌ మందులు కనుగొన్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మందులతో న్యుమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లను సమర్థవంతంగా నివారించొచ్చు కాబట్టి ఇప్పుడు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఇప్పటికి కూడా ఫ్లూ వచ్చిన వారికి న్యుమోనియా ముప్పు ఎక్కువగానే ఉంటోంది.  ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి తొందరగా సోకకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవటం.. దగ్గు, తుమ్ములు వచ్చినపుడు ముక్కుకు, నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవటం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్లూ రాకుండా టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారికి ఫ్లూ వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి వీరికి ఫ్లూ టీకా ఇప్పించటం మంచిది. ఈ టీకాలు ఏటా తీసుకోవాల్సి ఉంటుంది.

చలివిరేచనాలు :
వేసవి, వర్షాకాలాల్లో నీరు కలుషితమై వాంతులు, విరేచనాలు ఎక్కువ. అవి బ్యాక్టీరియా కారణంగా వచ్చేవి. అయితే చలి కాలంలోనూ ఈ సమస్య ఎక్కువే, దీనికి వైరస్‌లు కారణమవుతుంటాయి. అందుకే వీటిని 'వింటర్‌ డయేరియా' అనీ, 'స్టమక్‌ ఫ్లూ' అనీ అంటారు. ఈ చలికాలం డయేరియా సాధారణ డయేరియా కన్నా తీవ్రంగా ఉంటుంది. ఇది జ్వరంతో వస్తుంది. త్వరగా ఒంట్లో నీరింకిపోయి (డీహైడ్రేషన్‌) ప్రమాదం ముంచుకొస్తుంది. వాంతులు ఎక్కువగా ఉంటాయి. మొదటిరోజు జ్వరం, వాంతులు.. రెండోరోజు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి. మూడోరోజు ఇవి తీవ్రమై డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి పిల్లల్లో తీవ్రమైన విరేచనాలు, వాంతులు, జ్వరం ఉన్నప్పుడు రోటా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందేమోనని అనుమానించాలి. వెంటనే వీరికి శరీరం నుంచి ఎంత నీరు పోతోందో అంతా భర్తీ చేసే ప్రయత్నం చేయాలి. అవసరమైతే వైద్యులు సెలైన్‌ కూడా పెడతారు. చాలామంది నీళ్లు తాగిస్తే ఇంకా విరేచనాలు అవుతాయని పొరపడుతుంటారు. ఇది తప్పు. ఎంత పోతుంటే అంతకంటే ఎక్కువ నీరు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగిస్తుండాలి. అలాగే మిగతా ద్రవ పదార్థాలు, రోజూ తినే ఆహారం కూడా ఇవ్వాలి. విరేచనాలు అవుతున్న పిల్లలు- మగతగా ఉండటం, నోరు ఎండిపోవటం, నాడి సరిగా అందకపోవటం, శ్వాస వేగంగా తీసుకుంటుంటే డీహైడ్రేషన్‌ ఎక్కువైందని అర్థం. ఇలాంటి పిల్లలకు అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చి సెలైన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రోటావైరస్‌ బారినపడకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాను పుట్టిన తర్వాత ఒకటిన్నర నెలలు, రెండున్నర నెలలు, మూడున్నర నెలల వయసులో వేయించాలి. పోలియో, డీపీటీలతో పాటే దీన్నీ వేస్తారు. ఈ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చాలని జాతీయ పిల్లల వైద్యుల సమాఖ్య ప్రభుత్వానికి సిఫారసు చేసి, అందుకు కృషి చేస్తోంది. ఈ టీకా మొదటి మోతాదును 3 నెలల వయసు లోపు, చివరి మోతాదును ఎనిమిది నెలల లోపే ఇవ్వాలి. విరేచనాలకు కారణమయ్యే రోటా వైరస్‌తో పాటు వాంతులకు కారణమయ్యే నోరో వైరస్‌ కూడా చలికాలంలోనే అధికంగా కనిపిస్తుంది. వీరికి వాంతుల తర్వాత విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువ.

టాన్సిల్స్‌ వాపు :
నోటి తుంపరల ద్వారా, గాలి ద్వారా వ్యాపించే జబ్బుల్లో 'స్ట్రెప్టోకోకల్‌ టాన్సిలైటిస్‌' కూడా ఒకటి. ఇది చలికాలంలో ఎక్కువ. చలికాలంలో తలుపులు మూసిన గదుల్లో పిల్లలు దగ్గరగ్గరగా కూచుంటారు కాబట్టి ఇది ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంటుంది. జ్వరం, గొంతునొప్పి, మింగలేకపోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ టాన్సిలైటిస్‌ను అనుమానించాలి. దీనికి వారం పాటు సమర్థమైన యాంటీబయోటిక్స్‌ ఇచ్చి పూర్తిగా నయం చెయ్యటం అవసరం. ఎందుకంటే ఈ స్ట్రెప్టోకాకల్‌ టాన్సిలైటిస్‌తో కేవలం జ్వరం, గొంతునొప్పే కాదు.. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ (గుండె జబ్బు), గ్లోమరులో నెఫ్రైటిస్‌ (కిడ్నీ జబ్బు) కూడా వచ్చే అవకాశమూ ఉంటుంది. ఈ రెండూ తీవ్రమైనవి, జీవితాంతం దుష్ప్రభావాలను చూపించేవి. కాబట్టి గొంతునొప్పితో టాన్సిల్స్‌ వాస్తే తేలికగా తీసుకోవద్దు. సాధ్యమైనంత త్వరగా, పూర్తిగా తగ్గేవరకు చికిత్స తీసుకోవాలి. ఈ టాన్సిలైటిస్‌ను గుర్తుపట్టటం తేలిక. ఈ గొంతు ఇన్ఫెక్షన్‌కూ, సాధారణ జలుబుకూ తేడాలు స్పష్టంగానే ఉంటాయి. టాన్సిలైటిస్‌ వచ్చిన వారికి ముక్కు కారదు, దగ్గు ఎక్కువగా ఉండదు. కేవలం గొంతు నొప్పి, బాధ, మింగలేకపోవటం, తీవ్రమైన జ్వరం.. ఇవి ఉంటాయి. నోరు తెరిచి చూస్తే టాన్సిల్స్‌ ఎర్రగా అయ్యి, వాటి మీద తెలతెల్లగా చీము మచ్చల వంటివి కనబడతాయి. చెవుల వెనకగా మెడ దగ్గర లింఫ్‌ గ్రంథులు వాచి బిళ్ల కడతాయి. (ఇది సాధారణ జలుబు జ్వరంలో ఉండదు) టాన్సిలైటిస్‌లో జ్వరం కూడా మొదట్లో కొద్దిగా ఆరంభమై అంచెలంచెలగా పెరుగుతుంది. అదే వైరల్‌ జ్వరాల్లో- జ్వరం వస్తూనే తీవ్రంగా వస్తుంది, క్రమేపీ తగ్గుతుంటుంది. ఇక టాన్సిలైటిస్‌లో మనం మందులతో చికిత్స ఆరంభించిన 24-48 గంటల్లోనే జ్వరం, నొప్పి, వాపు అన్నీ తగ్గుముఖం పడతాయి. వారంపాటు చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని ముందుగానే అడ్డుకోవటం చాలాచాలా అవసరం.

కీళ్లనొప్పులు :
మనలోని రోగ నిరోధక వ్యవస్థ.. మన శరీరావయవాల మీదే దాడులు చేయటం ఫలితంగా తలెత్తే కీళ్ల వాతం (రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌) వంటి దీర్ఘకాలిక సమస్యలు పెద్దలకే కాదు, పిల్లలకు కూడా వస్తాయి. పిల్లల్లో వచ్చే దాన్ని 'జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌' అంటారు. దీనివల్ల చేతులు, కాళ్ల కీళ్లు, చిన్న కీళ్లు ప్రభావితం కావటం వల్ల నొప్పి, బాధ, జ్వరం.. ఇవన్నీ వేధిస్తుంటాయి. బయట వాతావరణంలో చలి ఎంత ఎక్కువగా ఉంటే ఈ బాధలు వీరిని అంత ఎక్కువగా వేధిస్తుంటాయి. ఎండ పెరుగుతున్న కొద్దీ బాధల తీవ్రత తగ్గుతుంటుంది. పెద్దల్లో అయితే ఏళ్ల తరబడి అనుభవం ఉంటుంది కాబట్టి చలి పెరుగుతున్నప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ పిల్లలకు ఈ అనుభవం ఉండదు. కాబట్టి ఇటువంటి సమస్యలున్న పిల్లలకు తల్లిదండ్రులు ముందు నుంచే ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవటం అవసరం.

మెదడు వాపు :
దోమలు వానకాలంలో ఎక్కువే గానీ.. వాటి ప్రభావం వల్ల అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో మెదడు వాపు సమస్య ప్రబలుతుంటుంది. దీని బారినపడ్డ పిల్లల్లో 30-35% మంది మృత్యువాత పడుతున్నారు. మరో 30-35% మంది బతికి బట్టకట్టినా.. జీవితాంతం వినికిడి లోపమో, దృష్టి లోపమో, ఫిట్స్‌ రావటమో, బుద్ధిమాంద్యమో.. ఇలా ఏదో అవకరాలతో గడపాల్సి వస్తుంటుంది. ఈ మెదడువాపు బారినపడిన వారిలో కేవలం 30% మాత్రమే అదృష్టవశాత్తూ ఎటువంటి దుష్ప్రభావాలూ లేకుండా బయటపడతున్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇదెంత ప్రమాదకరమైన సమస్యో! కాబట్టి ఈ కాలంలో దోమలు కుట్టకుండా పిల్లలను సంరక్షించుకోవటం చాలా అవసరమని గుర్తించాలి. మెదడువాపు రాకుండా నివారించుకునేందుకు త్వరలో టీకా (జీవ్‌) అందుబాటులోకి రానుంది. దీన్ని ప్రపంచంలోనే తొలిగా మన హైదరాబాద్‌లో రూపొందిస్తుండటం విశేషం.

కుంగుబాటు :
చలికాలంలో కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి మానసిక సమస్యలు ఎక్కువ. వీటిని 'సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్లు' అంటారు. చాలామంది పిల్లలకు డిప్రెషనెందుకు వస్తుందని భావిస్తుంటారుగానీ పిల్లల్లో కూడా ఇలాంటివి సహజమే. తోటిపిల్లలతో ఆడుకోకపోవటం, ఒక్కరే ఉండాలనుకోవటం, సరిగా తినకపోవటం, ఎప్పుడూ బద్ధకం, దేనిమీదా ఆసక్తి లేకపోవటం.. ఇటువంటి లక్షణాలు కనబడితే దీన్ని అనుమానించటం మంచిది. పగటి కాలం తక్కువుండి, రాత్రి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు భావోద్వేగపరమైన సమస్యలకు ఆస్కారం ఎక్కువ. అందుకే చలికాలం డిప్రెషన్లు, భావోద్వేగ సమస్యలు, ఆత్మహత్యా భావనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిపై ఒక కన్నేసి ఉంచాల్సిన సమయం ఇది.

రక్షణ చర్యలు :
* పిల్లలకు అవసరమైన టీకాలన్నీ వేయించాలి. శుభ్రంగా, తరచుగా చేతులు కడుక్కోవటం నేర్పించటం.. వ్యాధులు దరిజేరకుండా కీలకమైన రక్షణ చర్య.
* ఈ కాలంలో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువ కాబట్టి ప్యారాసెటమాల్‌, ఓఆర్‌ఎస్‌ బిళ్లలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
* మంచి పుష్టికరమైన పోషకాహారం అందించాలి. సూక్ష్మపోషకాలు కూడా ఎక్కువగా ఉండే, ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన, తాజా ఆహారం ఇవ్వటం ముఖ్యం.
* చలికాలం ఒంటికి సరైన వ్యాయామం ఉండటం అవసరం. వ్యాయామం చేసినప్పుడే మనలోని రోగనిరోధక వ్యవస్థ కూడా ఉత్తేజితంగా ఉంటుందని గుర్తించాలి.
* చలికాలంలో కూడా ద్రవాహారం, ద్రవపదార్ధాలు ఎక్కువగా తీసుకోవటం ముఖ్యమని గుర్తించాలి.
* చర్మం పెదవులు పగలకుండా ఉండేందుకు చలికాలంలో వాజ్‌లైన్‌ రాయటం ఉత్తమం. దీని కోసం ఖరీదైన మాయిశ్చరైజర్లు అవసరం ఉండదు. అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ డెర్మటాలజీ కూడా వాజ్‌లైన్‌ను ఉత్తమ 'ఎమోలియెంట్‌'గా నిర్ధారించింది.
* చలికాలం సబ్బులు తక్కువ వాడాలి, సున్నిపిండి వంటివి ఉత్తమం. సబ్బు ఎక్కువ వాడిన కొద్దీ శరీరం మీది చమురు పొరలు పోయి, పొడిబారి.. ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు ఆస్కారమవుతుంది.
* పిల్లలకు మెత్తటి పూర్తి చేతుల చొక్కా, పైజమాలు, గ్లౌజులు, సాక్సులు, మంకీక్యాప్‌ వెయ్యటం తప్పనిసరి.
* ఎండలేమి కారణంగా చలికాలంలో విటమిన్‌-డి లోపించే అవకాశాలు ఎక్కువ, దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, ఇతరత్రా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ముదురుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చలికాలంలో విటమిన్‌-డిని ప్రోది చేసుకునే ప్రయత్నం చెయ్యటం మంచిది. ఇది ఆహారం ద్వారా లభించే అవకాశాలు తక్కువ. అందుకని ఉన్న ఎండను సద్వినియోగం చేసుకోవాలి.  రోజూ ఒక గంట ముఖానికి, కాళ్లకు, చేతులకు ఎండ తగిలేలా చూసుకోవటం అవసరం.

--Dr.P.sudharshan reddy -peadiatrician ,Hyd@Eenadu sukhibhava
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.