Thursday, December 20, 2012

Rhinoplasti Awareness- రైనోప్లాస్టి అవగాహన

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Rhinoplasti Awareness- రైనోప్లాస్టి అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ముక్కు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. వాసన చూడ్డానికే కాకుండా ముఖానికి అందాన్నివ్వడంలో కూడా ముక్కుకి చాలా ప్రాధాన్యత ఉంది.కావ్య నాయికలకి ముక్కు కోటేరేసినట్లు ఉంటుంది.  ముక్కు షేపు బాగా లేకపోతే దేవుడ్ని తిడుతూ కూర్చోనే రోజులు కావు ఇప్పుడు. కాస్మెటిక్ సర్జన్ దగ్గరకు వెళితే కావలసిన సైజుకి, షేపుకి మన ముక్కుని  మార్చి పారేస్తాడు. రైనోప్లాస్టి అని పిలిచె ఈ ఆపరేషన్‌ని క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మనదేశంలో సుశ్రుతుడు చేశాడు. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ని  ఇంచుమించు అదే పద్దతిలో చేస్తున్నారు.

సినీ తారలు ఎక్కువగా ఈ ఆపరేషన్‌ని చేయించుకుంటారు. శ్రీదేవితో మొదలుపెట్టి కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, కంగన రనౌత్, మినిషా లంబా, కరీనా కపూర్ లాంటి తారలందరూ తమ ముక్కుని కాస్మెటిక్ సర్జన్ తో రైనోప్లాస్టి చేసుకున్నవారే .

 తీరైన ముక్కుకు రైనోప్లాస్టి---తీరైన ముక్కుతోనే ముఖారవిందం రెట్టింపవుతుంది. అందంతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి చట్టి ముక్కు ఉన్న వారి మాటేమిటి? ముక్కుఅందాన్ని మెరుగు పరుచుకునే అవకాశమే లేదా? అంటే రైనోప్లాస్టితో ముక్కు సమస్యలను సరిచేసుకోవచ్చని అంటున్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. వై. వెంకటరమణ.

అందానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఆ మాటకొస్తే అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఉన్నతోద్యాగాలు సాధించడంలోనూ కీలకంగా మారుతోంది.అందుకే కాస్మెటిక్ సర్జరీలకు ప్రాధాన్యం పెరిగింది. ముక్కు ఆకారం సరిగా లేని వారికి, ముక్కు అందం మరింత మెరుగుపడాలని కోరుకునే వారికి రైనోప్లాస్టి సర్జరీ ఒక వరమని చెప్పవచ్చు.

  • ముక్కు ఎత్తు తక్కువగా ఉంటే(చట్టిముక్కు)
దీన్ని శాడిల్ నోస్ అంటారు. వీరిలో పుట్టుకతో, పెరుగుదలలో ముక్కు ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా వంశపారపర్యంగా వస్తుంది. కొంత మందిలో మాత్రం ఏదైనా గాయం, సర్జరీ లేదా ఇన్‌ఫెక్షన్ వల్ల ఎత్తు తగ్గిపోతుంది. ఈ రకమైన ముక్కును రైనోప్లాస్టి ద్వారా సరిచేయవచ్చు. దీన్ని అగుమెంటేషన్ రైనోప్లాస్టి అంటాము. దీనిలో ముక్కు ఎత్తును కృత్తిమమైన ఇంప్లాంట్ ద్వారా లేక శరీరంలో సహజసిద్ధమైన ఎముక ముక్క అమర్చటంద్వారా సరిచేయడం జరుగుతుంది. సర్జరీ ఒక గంటలో పూర్తవుతుంది. వారంలో ఫలితం కనిపిస్తుంది.

  • కొనభాగం మందంగా ఉంటే..
కొందరిలో ముక్కు కొనభాగం చాలా మందంగా ఉంటుంది. చర్మం మందంగా ఉండటం, కొనభాగంలో కొవ్వు ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం, ముక్కు కొన ఎముకలు(మృదులాస్థి) వెడల్పుగా ఉండటం వంటి కారణాల వల్ల ముక్కు కొనభాగం లావుగా ఉంటుంది. ఈ సమస్యను చాలా వరకు రైనోప్లాస్టి ద్వారా సరిచేయవచ్చు. దీన్ని 'టిప్ ప్లాస్టి' అంటాము. అంటే ముక్కు కొనకు చేసే ప్లాస్టిక్ సర్జరీ. దీనిలో కృత్రిమ వస్తువు ఏదీ అమర్చడం జరగదు. ఆపరేషన్ తరువాత కొన్ని నెలల నుంచి ఏడాది వరకు ముక్కు అందం మెరుగుపడుతూనే ఉంటుంది. దీర్ఘకాలిక మార్పుతో ముక్కు కొన సన్నగా, అందంగా తయారవుతుంది.

  • వంకరగా పెరుగుతుంటే...
ముక్కు అంతా బాగానే ఉంటుంది. కానీ పెరుగుదలలో వంకర కనిపిస్తుంది. ముక్కు ఎదిగే వయసులో గాయం కావడం లేదా విరగడం, గ్రహణమొర్రి ఏర్పడటం, సర్జరీ వంటి కారణాల వల్ల ముక్కు వంకరగా పెరుగుతూ ఉంటుంది. ఏ కారణం లేకుండా కూడా ముక్కు వంకరగా పెరగవచ్చు. దీన్ని క్రూక్‌డ్ నోస్ అంటారు. దీన్ని సెప్టో రైనోప్లాస్టి సర్జరీ ద్వారా సరిచేయవచ్చు. ముక్కు ఎముకలు, మధ్యఎముకలను సరిచేయడం ద్వారా ముక్కు చక్కగా పెరిగేలా చేయవచ్చు.

  • పెద్దదిగా ఉంటే...
దీన్ని హంప్ నోస్ అంటారు. వీరిలో ముక్కు ఎత్తు, పొడవు అవసరం కన్నా ఎక్కువగా పెరుగుతుంది. కొంతమందిలో గద్దముక్కులా అవుతుంది. దీన్ని రిడక్షన్ రైనోప్లాస్టి ద్వారా సరిచేయవచ్చు. ఏ విధమైన మచ్చలు, కుట్లు ఏర్పడవు. ఒక వారంలో ఫలితం ఉంటుంది.

  • చర్మం పెరిగితే(రైనోఫైమా)
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో, మొటిమలు ఏర్పడే వారిలో ముక్కు కొన చర్మం కాయలాగా పెరగటం జరుగుతుంది. సమస్య చర్మంలో మాత్రమే ఉంటుంది. కింద ఎముకలు, ఫ్రేమ్ వర్క్ నార్మల్‌గానే ఉంటుంది. పెరిగిన చర్మాన్ని లేజర్ లేక ఆర్ఎఫ్ సహాయంతో తీయవచ్చు.

  • ఏ వయసులో సర్జరీ బెటర్
ఒక వ్యక్తి సహజసిద్ధమైన పెరుగుదల పూర్తయిన తరువాత చేయాల్సి ఉంటుంది. అంటే 16 సంవత్సరాలు నిండిన తరువాత రైనోప్లాస్టి సర్జరీ చేయించుకోవచ్చు. ఇది కొంచెం కొంచెంగా చేసే ఆపరేషన్ కాదు. ఒకే సిట్టింగ్‌లో ముఖారవిందం  మెరుగయ్యేలా చేయాల్సి ఉంటుంది. అందుకే అనుభవం ఉన్న వైద్యులను దగ్గరే ఆపరేషన్ చేయించుకోవాలి.

  • ఆపరేషన్‌కు తరువాత
- సాధారణంగా 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి చేస్తాము. కాబట్టి ఆరోగ్యరీత్యా సమస్యలు ఏర్పడవు.

- ఆపరేషన్‌కు ముందు కొన్ని రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి ముక్కు ఎక్స్‌రే చేయించుకోవాల్సి ఉంటుంది.

- పూర్తి మత్తులో లేదా ముక్కు వరకే మత్తు ఇచ్చి చేసే ఆపరేషన్ ఇది. సర్జరీ, సమస్యను బట్టి ఒక గంట నుంచి రెండున్నర గంటలు సమయం పడుతుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్జికల్ సెంటర్‌లో ఉంటే సరిపోతుంది.

- సర్జరీ తరువాత పూర్తి విశ్రాంతి అవసరంలేదు. మరుసటి రోజు నుంచే సాధారణ పనులు చేసుకోవచ్చు. కేవలం ముక్కుమీద ఒత్తిడి పడకుండా  చూసుకుంటేసరిపోతుంది.

- ముక్కు వాపు 48 నుంచి 72 గంటలలో తగ్గిపోతుంది. వారం తరువాత విధులకు హాజరుకావచ్చు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో, అత్యాధునికసదుపాయాలున్న ఆసుపత్రిలో చేయించుకున్నప్పుడే మంచి ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

  • రైనోప్లాస్టిపై అపోహలు
ముక్కు మీద మచ్చలు : ఇందులో ఏ మాత్రం నిజంలేదు. ఈ ఆపరేషన్ ముక్కు లోపల నుంచి చేయడం జరుగుతుంది. బయటకు ఎలాంటి మచ్చలు కనిపించవు.

శ్వాస, వాసన గుర్తించడంలో తేడా : ఇది కూడా అపోహే. రైనోప్లాస్టి ద్వారా శ్వాస, వాసన గుర్తించడంలో ఎలాంటి తేడా ఉండదు.

ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలి : ఆ అవసరమే ఉండదు. ఇది ఒక్కసారే చేసే సర్జరీ. ఒకవేళ ఏదైనా కారణం చేత మళ్లీ చేయాల్సి వచ్చినా చేయడం సాధ్యమవుతుంది.

- డా. వై. వెంకటరమణ-ప్లాస్టిక్ సర్జన్,కాంటూర్స్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్,ఎస్‌బీహెచ్ పైన, శ్రీనగర్‌కాలనీరోడ్.--హైదరాబాద్, @ swathi
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.