Wednesday, April 25, 2012

ధమనులు, సిరలు అందించే సేవలు , Services of Arteries and Veins

  •  
  •  image : courtesy with Visual Dictionary online.com.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ధమనులు, సిరలు అందించే సేవలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన శరీరంలో రక్తం రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులలో శుద్ధి అయిన తర్వాత హృదయాన్ని చేరి అక్కడ నుండి వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకుపోతుంది. ఆయా అవయవాలలో విడుదల అయిన వ్యర్థాలను స్వీకరించి తిరిగి హృదయంలోకి ప్రవేశించి అక్కడ నుండి ఊపిరితిత్తులకు పంపు చేయబడుతుంది.

శుద్ధి కాబడిన రక్తాన్ని అవయవాలకు మోసుకుపోయే రక్తనాళాలను ధమనులు అంటారు. వ్యర్థ పదార్థాధలను స్వీకరించిన రక్తాన్ని అవయవాల నుండి  హృదయానికి తీసుకుపోయే రక్తనాళాలను సిరలు అంటారు.

ధమనులు : హృదయం నుండి పంప్‌ చేయబడిన శుద్ధి రక్తాన్ని మోసుకువెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. గుండెలోని ఎడమవైపు ఉండే ఆరికల్‌, వెంట్రికల్‌ గుండె యొక్క ఎడమ ఆరికల్‌కు చేరుకుంటుంది. అక్కడ నుండి ఎడమ వెంట్రికల్‌కు చేరుకుంటుంది. అక్కడ నుండి అయోర్టాలోనికి పంప్‌ చేయబడుతుంది. అయోర్టా(బృహద్ధమని) అతిపెద్ద ధమని. ఇది గుండె నుండి బయల్దేరి కొంతదూరం తర్వాత చిన్న, చిన్న రక్తనాళాలుగా విడిపోతుంది. వీటిని  ధమనులు అంటారు. ఇవి మరింత విభజించ బడితాయి. వీటిని ఆర్టరియోల్స్‌ అంటారు. ఇవి ఆ తర్వాత మరింత సూక్ష్మనాళలుగా విభజించబడతాయి. వీటిని కెపిలరీస్‌ అంటారు.  ఈ ధమనులు కణజాలలో భాగా లోపలికి ఉంటాయి. అయితే మణికట్టు వద్ద, కణతల వద్ద,మెడ వద్ద మాత్రం పైపైకి ఉంటాయి. అందువల్లే డాక్టర్‌ మణికట్టు వద్ద పల్స్‌ చూసేది. దానిబట్టి ధమనులు పనితీరు, ఆరోగ్యస్థితి తెలుస్తుంది. ధమనులు కండరాలతో చెయ్యబడిన గోడలను కల్గి ఉంటాయి. ఈ కండరపు గోడలు మందంగా ఉండి ఎలాస్టిక్‌ తత్త్వాన్ని కలిగి ఉంటాయి. గుండె రక్తాన్ని ధమనులలోకి పంప్‌ చేసినప్పుడు, ధమనుల కండరపు గోడలపై ఒత్తిడిని కలుగజేస్తుంది.ధమనుల గోడలు లోపలకు సంకోచించి రక్తాన్ని ముందుకు తోసి మరలా యధాస్థితికి వస్తాయి. ఈ విధంగా రక్త ప్రసరణను నియంత్రిస్తాయి. కానీ, ధమనులలో రక్తం చాలా వేగంగా ప్రవహిస్తుంది.ధమనులలో ప్రవహించే రక్తం మంచి ఎరుపు రంగును కలిగి ఉంటుంది. కాలేయం శరీరానికి అతి ముఖ్యమైన పనులు చేస్తుంది. అందువల్ల బృహద్ధమని నుండి నేరుగా కాలేయానికి ఒక ధమని వెడుతుంది. దీనిని హెపాటిక్‌ ఆర్టరీ అంటారు.

సూక్ష్మనాళాలు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇవి వెంట్రుకల కన్నా చాలా సన్నగా ఉంటాయి. వీటి గుండా రక్తకణాలు స్కూలు విద్యార్థుల వలె ఒక లైనులో వెళ్ళవలసిందే. అంత సన్నగా ఉంటాయి. ధమనులలో అతివేగంగా వెళ్ళే రక్తం కెపిలరీస్‌ చాలా  నెమ్మదిగా ప్రయాణిస్తుంది.

కొన్ని కెపిలరీస్‌ కొంత దూరం తర్వాత కలిసి వెన్యూల్స్‌గా ఏర్పడతాయి. ఈ వెన్యూల్స్‌ కొంత దూరం తర్వాత కలిసి వీన్స్‌(సిర)లుగా ఏర్పడతాయి.

సిరలు : కెపిలరీస్‌ శుద్ధి రక్తాన్ని శరీర కణాలను అందజేసి అక్కడ నుండి వ్యర్థ పదార్థాలను స్వీకరించిన రక్తాన్ని వెన్యూల్స్‌లోకి పంపుతాయి. ఈ వెన్యూల్స్‌లో నుండి రక్తం సిరలలోకి ప్రవేశిస్తుంది. సిరల నుండి వ్యర్థాలతో కూడిన రక్తం బృహత్‌సిర అయిన వీనా కేవాలోనికి ప్రవేశిస్తుంది . ఈ వీనా కేవా ఈ రక్తాన్ని గుండెలోని కుడివైపు ఉండే ఆరికల్‌లోకి పంప్‌ చేస్తుంది. సిరల యొక్క గోడలు మూడు పొరలను కలిగి ఉంటాయి. కాని, ధమనుల గోడల కన్నా సిరల గోడలు మందం తక్కువ ఉంటుంది. సిరలలో రక్తం అంత వేగంగా   ప్రవహించదు. దీనికి కారణం రక్తంలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా ఉండడం. సిరలు చర్మానికి దగ్గరగా ఉంటాయి.

చిన్న ప్రేవుల వద్ద ఆహారం రక్తంలోని గ్రహించబడుతుంది. అక్కడ నుండి హెపాటిక్‌ పోర్టల్‌ వీన్‌ ద్వారా కాలేయానికి చేరుతుంది. కాలేయం నుండి రక్తం హెపాటిక్‌ వీన్‌ ద్వారా హృదయాన్ని చేరుతుంది.

చేతుల లోను, కాళ్ళలోను ఉన్న వీన్స్‌(సిరల)లో వాల్వ్స్‌ శక్తికి లోబడి వెనుకను వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని సిరలలోని వాల్వ్స్‌ నివారిస్తాయి.కొంతమంది కాళ్ళమీద ఉబ్బిన లేదా, సాగదీయబడిన రక్తనాళాలు కనిపిస్తాయి. వీటిని వెరికోస్‌ వీన్స్‌ అంటారు. ఇవి ఎక్కుగా ముసలి వారిలోను, వ్యాయామం చేసే వారిలోను, ఎక్కువగా నడిచే వారిలోను కనిపిస్తాయి. సిరలలోని రక్తం తక్కువ వత్తిడిని కలుగజేస్తూ ప్రవహిస్తుంది.

పల్మనరీ ఆర్టరీ : వీనా కేవాలోని రక్తం గుండెలోని కుడి ఆరికల్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి కుడి వెంట్రికల్‌లోనికి ప్రవేశిస్తుంది. అక్కడ నుండి పల్మనరీ ఆర్టరీలోనికి ప్రవేశించి ఊపిరి తిత్తులకు చేరుతుంది. అక్కడ రక్తం ఆక్సిజన్‌ను స్వీకరించి, కార్బనడైఆక్సైడ్‌ను వదిలివేస్తుంది. పల్మనరీ వీన్‌ : ఊపిరితిత్తులలో శుద్ధి చెయ్యబడిన రక్తం పల్మనరీ వీన్‌లోకి ప్రవేశిస్తుంది. పల్మనరీ వీన్‌లో నుండి గుండె యొక్క ఎడమ ఆరికల్‌లోకి ప్రవేశిస్తుంది.

సాధారణంగా సిరలు చెడు రక్తాన్ని మోసుకుపోతాయి. కాని, పల్మనరీ వీన్‌లో శుద్ధి రక్తం ప్రవహిస్తుంది. మన శరీరంలో ఒక రక్తపు కణం గుండెనుండి ఊపిరితిత్తులకు, అక్కడ నుండి తిరిగి గుండెకు, అక్కడ నుండి వివిధ అవయవాలకు, మరలా తిరిగి గుండెకు చేరుకోవడానికి ఇరవై మూడు సెకన్ల కాలాన్ని తీసుకుంటుంది. రోజులో ప్రతీ రక్తపు కణం మూడువేల సార్లు శరీరమంతా తిరిగి వస్తుంది. అతిపెద్ద మార్గంగా మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థను చెప్పుకోవచ్చు. మన శరీరంలోని రక్తనాళాలను అన్నింటిని ఒక వరుసలోకి చేర్చి వంపులు లేకుండా సాగదీస్తే దాని పొడవు దాదాపుగా అరవై వేలమైళ్ళు ఉంటుంది.

ఏ అవయవానికి సంబంధించిన రక్తనాళాలను ఆ అవయవం పేరును జత చేసి పిలుస్తారు. ఉదాహరణకు కాలేయానికి సంబంధించిన ధమనిని హెపాటిక్‌ ఆర్టరీ అంటారు. సిరను హెపాటిక్‌ వీన్‌ అంటారు. కాలేయానికి ఆహారాన్ని మోసుకువచ్చే రక్తాన్ని కాలేయానికి అందించే సిర కాబట్టి దాన్ని హెపాటిక్‌ పోర్టల్‌ వీన్‌ అంటారు. అలాగే మూత్ర పిండాలకు సంబంధించి రీనల్‌ ఆర్టరీ, రీనల్‌ వీన్‌ అంటారు.

రక్త వేగంలో మార్పులు ఎప్పుడు వస్తాయి?

ఆరోగ్యవంతుని శరీరంలో రక్తం వేగంలోనూ, అనారోగ్యవంతుని శరీరంలోని రక్తం వేగంలోనూ తేడా ఉంటుంది. అలాగే తటస్థంగా కదలకుండా కూర్చున్నప్పుడు రక్త  ప్రసరణ వేగంలోనూ, బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు రక్త ప్రసరణ వేగంలోనూ తేడా ఉంటుంది.

జ్వరపడిన వారిలో రక్తప్రసరణ, వేగం, పనివల్ల రక్తప్రసరణ వేగం రెట్టింపవుతుంది. పని చేసినప్పుడు మన శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి రక్తం త్వరగా ఆక్సిజన్‌ నింపుకుని వేగంగా శరీర కణాలకు చేరుతుంది. దీనికి కావలసిన ఆక్సిజన్‌ను అందించడానికి ఊపిరి తిత్తులు కూడా వేగంగా పనిచేస్తాయి. అందుకే మనం త్వరత్వరగా ఊపిరిపీలుస్తాం. ధమనులు, సిరలు హృదయం అన్నింటినీ కలిపి రక్త  ప్రసరణ వ్యవస్థ అంటాం. ఇది ఏ మాత్రం అస్తవ్యస్థమైనా మనిషి పని అయినట్లే.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.