Tuesday, March 27, 2012

Bleeding in Children , పిల్లలు లో రక్తం పడటం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - పిల్లలు లో రక్తం పడటం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



రక్తం మనకు ఎంత ప్రాణావసరమో.. అది కనబడితే అంత చలించిపోతాం. ఇక పసిబిడ్డల విషయంలో అయితే ఆ ఆందోళనకు అంతుండదు. అభంశుభం తెలియని పిల్లలు బాగానే ఉంటారుగానీ తల్లిదండ్రులు ఎంతగానో కంగారుపడిపోతుంటారు. పసిబిడ్డల ముక్కువెంట రక్తం చాలా తరచుగా కనబడే సమస్య. ఇంత తరచుగా కాకపోయినా.. పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటం కూడా అంతే ఆందోళన రేపుతుంది. ముక్కు వెంట రక్తం సాధారణంగా పెద్ద ప్రమాదకరమేం కాదుగానీ.. మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం కచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే.

*పుట్టి 6 రోజులు కాలేదు.. మలంలో రక్తం. ఆకుపచ్చని వాంతులు. తీవ్రమైన ఏడుపు. పరీక్ష చేస్తే.. కడుపులో పేగు మడతబడినట్టు బయటపడింది. వెంటనే శస్త్రచికిత్సతో సరిచేయాల్సి వచ్చింది.

* 8 నెలల పాప. హఠాత్తుగా కడుపు నొప్పితో ఏడుపు మొదలుపెట్టింది. కొద్దిసేపటికి తగ్గినా.. మళ్లీ మళ్లీ తెరలు తెరలుగా కడుపునొప్పితో పాటు ఆకు పచ్చని వాంతులు, మలంలో రక్తం పడటం ఆరంభమైంది. పరీక్షల్లో పేగులోని కొంతభాగం మరోభాగంలోకి చొచ్చుకుపోయినట్టు తేలింది. వెంటనే ఆపరేషన్‌తో సరిచేయాల్సి వచ్చింది.

* 5 ఏళ్ల బాబు. రెండు రోజులకు ఒకసారి మల విసర్జనకు వెళ్లేవాడు. పైగా మలం గట్టిగా వచ్చేది. కొన్ని రోజులకు మలద్వారం నుంచి రక్తం పడటం మొదలైంది. తల్లిదండ్రులు కంగారుపడిపోయి డాక్టర్‌కు చూపించారు. మలద్వారం వద్ద చీలిక (ఫిషర్‌) వల్లే రక్తం వస్తున్నట్లు గుర్తించారు. ....ఇలా పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటం తరచుగా కనబడే సమస్యే. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. ఇవి పిల్లల వయసును బట్టి మారుతుంటాయి కూడా.

కడుపులోని పేగుల్లో కింది భాగం నుంచి రక్తస్రావమైతే అది ఎర్రటి ఎరుపు రంగులో (హెమటోకేజియా) కనిపిస్తుంది. అదే ఎగువభాగంలో పేగుల్లో రక్తస్రామమైతే కొద్దిగా రంగుమారి (melina) ఉంటుంది. పేగుల్లో కొద్దిపాటి రక్తస్రావమైనా అది మలంతో కలిసినప్పుడు ఎంతో పెద్దమొత్తంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు బాగా కంగారుపడిపోతుంటారు. అదృష్టమేంటంటే.. పిల్లల్లో కనిపించే రక్తస్రావ సమస్యల్లో చాలావరకూ వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగని వాటిని వదిలేస్తే ప్రమాదం ముంచుకురావచ్చు. కాబట్టి రక్తస్రావానికి గల కారణమేంటో తెలుసుకొని చికిత్స చేయటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మొత్తం రక్తం పరిమాణమే తక్కువగా ఉంటుంది. అందులో 10% రక్తం బయటకు పోయినా ప్రాణాపాయం కలగొచ్చు. అందువల్ల రక్తస్రావాన్ని అరికట్టేందుకు తక్షణం తగు చికిత్స చేయటం అవసరం.

  • గుర్తించటం
1. రక్తం ఎంత మొత్తంలో పడుతుంది? రంగు ఎలా ఉంది? విరేచనంతో కలిసి వస్తోందా? విడిగా పడుతోందా? విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ పడుతోందా? వంటి వివరాల ద్వారా కొంత మేర సమాచారం తెలుస్తుంది.
2. పరీక్షించటం ద్వారా- కామెర్లు, రక్తహీనత, కడుపుబ్బరం, ఫిషర్స్‌, పొట్టలో గట్టిగా తగలటం వంటి వాటిని గుర్తించొచ్చు.
3. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్‌ పరీక్ష, కడుపు ఎక్స్‌రే, ఎండోస్కోపీ ద్వారా కచ్చితంగా నిర్ధరిస్తారు. కొందరికి యాంజియోగ్రఫీ కూడా అవసరమవుతుంది.

  • ఎప్పుడు ప్రమాదం?
* రక్తం ఆగకుండా పడుతున్నా,
* పెద్దమొత్తంలో రక్తస్రావం అవుతున్నా
* రక్తం పడటంతో పాటు నొప్పి, కడుపుబ్బరం, లోపలి అవయవాలు ఉబ్బటం వల్ల కడుపు పెద్దగా అవటం వంటివి కనిపించినా,

చాలావరకు మామూలువే చాలామంది పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటమన్నది ఏమంత తీవ్రమైన సమస్య కాదు. దానంతట అదే తగ్గుతుంది కూడా. క్యాన్సర్ల వంటి అనుమానాలూ అవసరం లేదు. పిల్లల్లో తరచుగా కనిపించే మలబద్ధకం మూలంగా మలద్వారం వద్ద చీలికలు ఏర్పడుతుంటాయి. రక్తం ఆగకుండా, ఎక్కువగా పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా కారణాలను కచ్చితంగా గుర్తించొచ్చని గ్రహించాలి.

  • ముక్కు నుండి రక్తం

పిల్లల్లో ముక్కువెంట రక్తం పడటమన్నది చాలా తరచుగా కనిపించే సమస్య. ఈ సమస్య మండు వేసవిలో, చలికాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. వైద్యపరిభాషలో దీన్ని 'ఎపిస్టాక్సిస్-(epistaxis)‌' అంటారు. ఇంటి వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్లినట్లవుతుంది. లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని వీటిని కెలుకుతుంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఎక్కడి నుంచి?--మన ముక్కు గోడల్లో చాలా సున్నితమైన రక్తనాళాలుంటాయి. ముఖ్యంగా ముక్కు కొనకు ఒక అంగుళం లోపలగా.. సిరలు పైచర్మం కిందే, చాలా సున్నితంగా కూడా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని 'లిటిల్స్‌ ఏరియా' అంటారు. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలామందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తుంటుంది. కాకపోతే దీన్నే ముక్కు లోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు.

  • కారణమేమిటి?---
* ముక్కులోపల వేలు పెట్టి కదిలిస్తుండటం,
* జలుబు, అలర్జీల వంటివి వచ్చినప్పుడు చాలా బలంగా తుమ్ములు రావటం, లేదా గట్టిగా చీదటం,
* వేసవిలో వేడి మరీ ఎక్కువగా ఉండటం
* ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్ల వంటి వస్తువులు పెట్టుకోవటం,
...ఈ సందర్భాలన్నింటిలోనూ 'లిటిల్స్‌ ఏరియా'లోని రక్తనాళాలు చిట్లి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది.

తక్షణం ఏం చెయ్యాలి?--కంగారు పడకుండా బిడ్డను సాంత్వన పరచటం ముఖ్యం. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకుని
ఉండేలా కూర్చోబెట్టి.. ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తిపట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు.

*ఇలా 10 నిమిషాలు ఒత్తిపట్టి ఉంచాలి. మధ్యమధ్యలో ఆగిందా? లేదా? అని వదిలి చూసే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. 10 నిమిషాల తర్వాత కూడా ఇంకా రక్తం వస్తుంటే మరో 10 నిమిషాలు పట్టుకుని ఉండాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చెయ్యద్దు. అప్పటికీ తగ్గకుంటే?---ముక్కును పైన చెప్పినట్లుగా పది పది నిమిషాల చొప్పున రెండు దఫాలుగా ఒత్తి పట్టినా కూడా రక్తం వస్తూనే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లటం మంచిది. ఇదే కాదు, మనకు తెలియకుండా లోపల ముక్కులో ఏదైనా ఉందన్న అనుమానం ఉన్నా, అలాగే కేవలం ముక్కు నుంచే కాకుండా చెవులు, చిగుళ్ల వంటి వాటి నుంచి కూడా రక్తం వస్తున్నా, రక్తం మరీ ఎక్కువగా వేగంగా పోతున్నా, లేదా ఆటల్లో పడిపోవటం, ముక్కుకు బలంగా దెబ్బతగలటం వంటి సందర్భాల్లో కూడా వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లటం మంచిది.

రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్‌ నైట్రేట్‌ సాయంతో లేదా విద్యుత్‌ పరికరాలతో ఆ ప్రాంతాన్ని 'కాటరైజ్‌' చేస్తారు. మొత్తానికి ముక్కు నుంచి రక్తం రావటమన్నది తల్లిదండ్రుల్లో భయాందోళనలను పెంచేదేగానీ మరీ అంత ప్రమాదకరమైనసమస్య మాత్రం కాదు.

  • నివారించేదెలా?----
* ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించెయ్యాలి.
* పిల్లలకు తప్పనిసరిగా గోళ్లు తీసెయ్యాలి.
* బలంగా ముక్కు చీదనివ్వద్దు.
* ముక్కు రంధ్రాల్లో పక్కులు ఎక్కువగా కడుతుంటే- ముక్కులో వేసేందుకు సెలైన్‌ చుక్కల మందులు దొరుకుతాయి, వాటిని రెండు పూటలా ముక్కులో వేసి, మెత్త బడిన

తర్వాత శుభ్రం చెయ్యటం మంచిది.
* వాతావరణం బాగా పొడిగా ఉండే వేసవిలోనూ, చలికాలంలోనూ పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ (వాజ్‌లైన్‌) రాయటం మంచిది.
* ఇంటి వాతావరణం మరీ పొడిగా ఉంటుంటే 'హ్యుమిడిఫైయర్స్‌' పెట్టటం ఉత్తమం.

మలంలో రక్తం: కారణాలేంటి?
* మలద్వారం వద్ద చీలిక (ఫిషర్‌): పిల్లల్లో ముఖ్యంగా తొలి రెండేళ్ల వయసువారిలో కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం కావటానికి ఇదే ప్రధాన కారణం. బయటకు వచ్చే
రక్తం చాలా ఎర్రగా ఉంటుంది. మల విసర్జన తర్వాత బొట్లు బొట్లుగా పడుతుంది. మలం పైన రక్తం చారికలు కూడా ఉండొచ్చు. సాధారణంగా ఇది మలబద్ధకం గలవారిలో మలం
పెద్దపెద్ద పెంటికలుగా బయటకు వచ్చిన అనంతరం కనబడుతుంది. మలద్వారం దగ్గరి పొరలు చిట్లి, చీలిక రావటం దీనికి మూలం. ఈ సమయంలో చాలా నొప్పి కలుగుతుంది.
దీంతో పిల్లలు మల విసర్జనను ఆపుకోవటానికీ ప్రయత్నిస్తారు. ఈ సమస్య రోజుల పిల్లల్లో కూడా ఎక్కువగానే కనబడుతుంటుంది. మలబద్ధకం తలెత్తకుండా చూడటం; మలం మెత్తగా, మృదువుగా వచ్చేలా మందులు వాడుకోవటం; బిడ్డను గోరు వెచ్చటి నీటి టబ్బులో కూర్చుండబెట్టటం, చీలికలు త్వరగా మానేందుకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఆయింట్‌మెంట్లు రాయటం అవసరం. సాధారణంగా చీలికలకు సర్జరీ అవసరం ఉండదు.

* పేగుల్లో తిత్తి (మెకెల్స్‌ డైవర్టికులమ్‌): పిండ దశలో బొడ్డు ద్వారా పేగుల్లోకి వెళ్లే నాళం (ఓంఫాలోమెసెంట్రిక్‌ డక్ట్‌) పుట్టిన తర్వాత కూడా మూసుకోకపోవటం వల్ల తలెత్తే సమస్య ఇది. దీంతో నొప్పి లేకుండానే మలద్వారం గుండా పెద్దమొత్తంలో రక్తం పడుతుంది. కొందరు పిల్లలు పేగుల్లోని గోడకు తిత్తితో పుడుతుంటారు. ఈ తిత్తి నుంచి ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ.. దాని ప్రభావంతో దీని చుట్టుపక్కల చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్స్‌) పడుతుంటాయి. ఇది రక్తస్రావానికి కారణమవుతుంది. 2% మంది పిల్లల్లో ఇది కనబడుతుంది. ఇది సమస్యాత్మకంగా తయారైనప్పుడు సర్జరీతో ఆ కొంత మేరా పేగును తొలగించటం అవసరం.

* పేగు చొచ్చుకురావటం (ఇంటససెప్షన్‌): కొందరిలో ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకు పోతుంటుంది. ఇది రెండేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. 6-9 నెలల వయసులో ఎక్కువగా కనబడుతుంటుంది. ఎక్కువ మందిలో చిన్నపేగులోని కొంతభాగం పెద్దపేగులోకి తోసుకుపోతుంది. పేగులు కదిలిన ప్రతిసారీ ఇది మరింత ముందుకు వస్తుంది. దీనికి తక్షణం ఆపరేషన్‌ అవసరం. ఎందుకంటే చొచ్చుకొచ్చిన చిన్నపేగుకు రక్తసరఫరా నిలిచిపోయి అది కుళ్లిపోయే ప్రమాదం ఉటుంది.

హాయిగా ఉన్న పిల్లల్లో కూడా ఈ సమస్య హఠాత్తుగా తలెత్తవచ్చు. ఉన్నట్టుండి పిల్లలు తీవ్రంగా ఏడుస్తారు. కొద్దినిమిషాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుందిగానీ కొంత సమయానికి ఇది మళ్లీ వస్తుంది.దీంతో కడుపుబ్బరం, పసుపు లేదా ఆకుపచ్చగా వాంతులు, మలద్వారం గుండా రక్తం పడటం.. ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు వెంటనే అల్ట్రాసౌండ్‌ పరీక్ష తప్పనిసరి. దీన్ని 3-6 గంటల్లోపే గుర్తిస్తే ఆపరేషన్‌ అవసరం లేకుండా.. 'హైడ్రోస్టాటిక్‌ రిడక్షన్‌' పద్ధతిలో మలద్వారం గుండా పీడనంతో నీటిని పంపించటం ద్వారా దీన్ని సరిచెయ్యచ్చు. వేగంగా ప్రవహిస్తున్న నీరు.. పెద్దపేగులోకి చొచ్చుకొస్తున్న చిన్నపేగును వెనక్కి నెడుతుంది. ఇది సత్ఫలితాన్ని ఇవ్వకపోతే ఆపరేషన్‌ ద్వారా సరిచేయాల్సి ఉంటుంది.

*పేగుల్లో పిలకలు (జువెనైల్‌ పాలిప్స్‌): కొందరు పిల్లల్లో పేగుల్లోని గోడలకు చిన్న చిన్న పిలకలు మొలుస్తుంటాయి. ఇవి రక్తస్రావానికి దారి తీస్తాయి. ఆ రక్తం మలం పైన చారలుగా కనబడుతుంది. 2-8 ఏళ్ల మధ్యవయసు పిల్లల్లో నొప్పి లేకుండా మలద్వారం నుంచి రక్తం పడటానికి ఈ పిలకలే ఎక్కువగా దోహదం చేస్తాయి. ఇవి చాలావరకు పెద్దపేగు చివరిభాగంలో (రెక్టో-సిగ్మాయిడ్‌) కనబడతాయి. ఈ పిలకలు తమకు తాముగా ఊడినప్పుడో, గట్టిగా మలవిసర్జన జరిగి ఇవి ఒరుసుకున్నప్పుడో వీటి నుంచి రక్తస్రావమవుతుంది. ఈ పిలకలు ఒకటే ఉంటే ఎండోస్కోపీ ద్వారాగానీ, సర్జరీతోగానీ తేలికగా తొలగించవచ్చు. చాలా పిలకలుండి, పేగుల్లో కొంతమేర ఆక్రమించి ఉంటే సర్జరీతో ఆ కొంతమేరా పేగును తొలగించాల్సి ఉంటుంది. పిలకలు ఎక్కువుంటే క్యాన్సర్‌ లక్షణాలున్నాయేమో చూడటమూ అవసరం.

*రక్తనాళాల లోపాలు (యాంజియో డిస్‌ప్లేసియా): పేగులకు రక్తసరఫరా చేసే నాళాల్లో లోపాలు కూడా మలద్వారం గుండా రక్తానికి దోహదం చేస్తాయి. కొన్నిసార్లు ఈ రక్తనాళాలు పేగుల్లో ఎక్కడోచోట ఉండలా బయటకు తోసుకొచ్చినట్లుంటాయి. అక్కడ పుండు పడటమో లేదంటే గాయం కావటం వల్లనో, ఇతరత్రా రక్తస్రావ సమస్యల వల్లనో రక్తం పడొచ్చు. ఎండోస్కోపీతో గానీ యాంజియోగ్రామ్‌ ద్వారా గానీ రక్తనాళాల లోపాలను గుర్తించొచ్చు. ఆపరేషన్‌ ద్వారా లోపాలు గల పేగు భాగాన్ని తీసేసి సరిచేస్తారు.

* పేగుల్లో వాపు, కణక్షయం (నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌): సాధారణంగా ఇది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కనిపిస్తుంది. నెలలోపే.. పిల్లలకు పాలు పట్టిన తర్వాత మొదలవుతుంది. పాలు పేగుల్లో నిల్వ ఉండిపోవటం వల్ల.. పేగుల గోడల్లో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడటం.. ఫలితంగా పుండు, రక్తస్రావం, రంధ్రం పడటం వంటి వాటికి దారితీస్తుంది.
పేగుల్లో వాపుతో బాధపడే పిల్లలు స్తబ్ధుగా ఉంటారు. పాలు తాగటానికి ఇష్టపడరు. కడుపుబ్బరం ఉంటుంది. తొలిదశలో పేగుల్లో వాపును గుర్తిస్తే యాంటీబయోటిక్స్‌ వంటివాటితో చికిత్స చేస్తే తగ్గిపోతుంది. కణాలు క్షీణిస్తుండటం, గ్యాంగ్రీన్‌ లేదా రంధ్రం పడటం వంటివి తలెత్తితే ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది.

*యాంటీబయోటిక్స్‌: కొన్నిసార్లు యాంపిసిలిన్‌, రిఫమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌, ఇనుము వంటి మందులతో పాటు చాక్‌లెట్లు, కొన్నిరకాల బీట్‌రూట్‌ దుంపల వంటివి తిన్నప్పుడూ మలంలో రక్తం మాదిరిగా ఎర్రటి చారలు కనిపిస్తాయి.

* పేగుల్లో అడ్డంకి: ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే పేగులు ఉబ్బటం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీంతో లోపల రక్తస్రావం కావటం, చివరికి రక్త ప్రసరణ తగ్గటం వల్ల పేగుల్లో గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది. పేగుల్లో అడ్డంకి కారణంగా మలద్వారం నుంచి రక్తం పడుతోందంటే అప్పటికే గ్యాంగ్రీన్‌ ఉందని అనుకోవచ్చు.

*ఆహారం పడకపోవటం: ఫుడ్‌ అలర్జీ వల్ల కూడా మలంలో రక్తం పడుతుంది. వీరిలో ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతులు, విరేచనాలు, ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పోషణ లోపం కూడా ఉండొచ్చు. కొందరిలో ఆవు పాలు, సోయా ప్రోటీన్ల వంటివి అలర్జీకి కారణం కావొచ్చు.


  • --Dr.A,Narendrakumar (Paediatrician -Nelofer children hospital HYD)(Courtesy with Eenadu sukhibhava)

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.