Thursday, January 26, 2012

COPD,సిఓపిడి(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -COPD,సిఓపిడి(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  •  తినే ఆహారం, తాగే నీరే కాదు. పీల్చేగాలి కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే వూపిరితిత్తులు దెబ్బతినొచ్చు. ఇది క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ), ఆస్థమా, అలర్జీ, బ్రాంకైటిస్‌ వంటి రకరకాల వ్యాధులకు దారితీయొచ్చు. అయితే తగు జాగ్రత్తలు, జీవనశైలి మార్పులతో వూపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

సిఓపిడి-COPD (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) ఏదో ఒక రోజులోనో, హఠాత్తుగానో వచ్చే వ్యాధి కాదు. కొన్ని ఏళ్లపాటు చాపకింద నీరులా వ్యాధి కొనసాగుతూ ఒక స్థాయికి వచ్చే సరికి మనిషిని కుంగదీస్తుంది. ఇప్పుడు చేయడానికి ఏమీ ఉండదని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇవ్వాళ సిగరెట్‌ తాగగానే దాని ఫలితం కనిపించదు. మెల్లగా దాని విషప్రభావం తాలూకు మార్పులు శరీరంలో ప్రారంభమవుతాయి. ఎన్నో ఏళ్లకు గానీ వ్యాధి బయటపడదు. ఈ లోగా లక్షణాలు అంత ప్రమాదకరంగా కూడా ఉండవు. దగ్గు వస్తుంది. కళ్లి (expectoration)పడుతుంది. మళ్లీ కొన్నాళ్లకు పరిస్థితి మామూలుగా ఉంటుంది. మళ్లీ దగ్గు, కళ్లి(expectoration) పడతాయి. ఇలా వ్యాధి ముదరిపోతూ చివరికి ఊపిరితిత్తులు మూలనపడిపోతాయి.

సిఓపిడిని ఒకప్పుడు రెండు వ్యాధులుగా పరిగణించేవారు. ఒకటి క్రానిక్‌ బ్రాంకైటిస్‌. రెండోది ఎంఫిసిమా. ఇపుడు రెండు వ్యాధుల్ని కలిపి సిఓపిడి గా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్‌ బ్రాంకైటిస్‌లో కళ్లి(expectoration) ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫిసిమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికీ కారణం ధూమాపానమే ! సిగరెట్‌ తాగినా, చుట్టతాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. ఈ వ్యాధి కేవలం పురుషుల్లోనే కాకుండా స్త్రీలోలనూ కనిపిస్తుంది. అయితే మన రాష్ట్రంలో స్త్రీలో ఇది వచ్చే అవకాశం అంతాగా లేదు. కానీ పంజాబ్‌, కాశ్మీర్‌ వంటి చలి ప్రదేశాల్లో స్త్రీలకు సిఓపిడి వస్తుంది. ఆస్తమా కూడా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధే కానీ, సామాన్యంగా ఏదో ఒక సీజనల్లో వస్తుంది. పోతుంది. సిఓపిడి అలా కాదు. వచ్చిదంటే పోదు... పైగా క్రమేపీ ముదురుతూంటుంది. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవడానికి వీలులేదు. కనీసం మూత్రవిసర్జన చేసేందుకు లేచి నాలుగు అడుగులు వేయలేని దుస్థితి వచ్చేస్తుంది. తరచూ దగ్గు, జ్వరం, కళ్లి (expectoration) సమస్యలు ఉంటాయి. వస్తుంటాయి. పోతుంటాయి ! కొందరు బరువు తగ్గుతారు. ఎంత తిన్నా బరువు తగ్గతుంటారు. ఎందుకంటే ఊపిరితిత్తులు గాలి తీసుకోవడానికి ఎంతో శక్తి అవసరం. తినే తిండి కేవలం ఊపిరితీసుకోవడానికి సరిపోతుందంటే నమ్మలేం కానీ నిజంగా జరిగేది అంతే ! కుటుంబపరంగా, వారసత్వంగా ఒకవేళ ఆస్తమా అనువంశికంగా వస్తుంటే ఉన్న సిఓపిడికి ఆస్తమా తోడవుతుంది. సిఓపిడి తీవ్రతను మనం ఇంకా సరిగా గుర్తించలేదని చెప్పాలి. ధూమపానం చేసే వ్యక్తి తన జీవితంలో సిగరెట్లు, బీడీలకు తన సంపాదనలో 15 శాతం ఖర్చు చేస్తుండగా, ఆనక వచ్చే వ్యాధులను తగ్గించుకునేందుకు వచ్చే సంపాదనలో 30 శాతం ఖర్చు చేస్తున్నట్లు అంచనా.


  • వ్యాధి లక్షణాలు

ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. రోజువారీ పనులు చేసుకోవడం తగ్గిపోతాయి. వ్యాధి ముదిరేకొద్దీ కదలికలు తగ్గిపోతూ వస్తాయి. కాస్త వంగున్నా ఊపిరాడదు. కాస్త జలుబు చేసినా ఊపిరి తీయడం కష్టమవుతుంది. ఎడతెగని దగ్గు ఉంటుంది. ఆకలి ఉండదు. బరువు తగ్గుతారు. కళ్లు తిరుగుతాయి.
స్పైరోమీటర్‌ అన్న ఒక పరికరం సహాయం ద్వారా,మీరు కొన్ని శ్వాస పరీక్షలు చెయ్యవలసి వుంటుంది. COPD తక్కువైనదా ( MILD), ఓ మోస్తరుదా ( MODERATE) లేదా విపరీతమైనదా (SEVERE) అనేది కనుక్కునేందుకు ఈ పరీక్షలు పనికొస్తాయి.

తక్కువ COPD లక్షణాలు :- ఎక్కువగా దగ్గతూ వుండవచ్చు, ఒక్కొసారి దగ్గులో శ్లేష్మం కూడా రావచ్చు.కాస్తగా గట్టిగా పనిచేస్తే లేదా త్వరగా నడిస్తే, తగ్గినట్లు అనిపించవచ్చు.

మోస్తరు COPD లక్షణాలు :- శారీరకమైన పని లేదా ఇంటి పనులు చేస్తూ వున్నప్పుడు, మీకు కష్టం అనిపిస్తూ వుండచ్చు. మిగతా వారి కంటే ఈ పనులన్నీ కాస్త మెల్లగా చేయవలసి రావచ్చు.జలుబు, ఛాతీ ఇన్‌ఫె క్ష్‌న్‌ల నుండి కోలుకోవడానికి చాలా వారాలు పట్టవచ్చు.

విపరీతమైన COPD లక్షణాలు :- మీరు మెట్లు ఎక్కలేరు. ఓ గదిలో ఈమూల నుంచి ఆ మూలకి సరిగ్గా నడవలేరు. ఎంత కొంచెం పని చేసినా లేదా మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా మీరు ఆలిసిపోతూవుంటారు.

  • కారణాలు

ఈ వ్యాధి ఎక్కువగా సిగరెట్లు తాగే వారిలోనే, చుట్టలు తాగేవారిలోనూ, బీడీలు తాగేవారిలోనూ కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువ. ఏళ్ల తరబడీ ధూమపానం చేసేవారికి ఈ వ్యాధి తప్పకుండా వస్తుంది. పరోక్ష ధూమపానం వల్ల క్రానిక్‌ బ్రాంకైటిస్‌ లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల కూడా సిపిఓడి వస్తుంది. కొన్ని వృత్తుల వల్ల కూడా సిపిఓడి వ్యాధి రావొచ్చు. వండ్రంగులూ, మైనింగ్‌లో పనిచేసేవారు కూడా ఈ వ్యాధి బారినపడతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు వాడే స్త్రీలు నిరంతరం పొగలో ఉండడం వల్ల ఈ వ్యాధి రావొచ్చు. కార్లు విడుదల చేసే కాలుష్య కారకాలను పీల్చే వారికి కూడా రిస్కు ఉంటుంది. ఇన్నీ కాకుండా వంశపారంపర్యంగా కూడా సిఓపిడి రావొచ్చు. ''ఏఏఎఫ్‌'' అల్ఫా ప్రోటీన్‌ లోపం వల్ల వ్యాధి అనువంశికంగా వస్తుంది. కాకపోతే ఇది అరుదు. అలాగే హెచ్‌ఐవి వ్యాధి ఉన్నవారు కూడా ఈ వ్యాధికిలోనవుతారు.

  • డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలి?

కొంచెం వ్యాయామాలు చేసేటప్పుడు శ్వాస కష్టంగా ఉంటే. ఎంతకీ మానని దగ్గు, కాస్త రంగుగా ఉన్న కళ్లెపడుతున్నప్పుడు. ఈ లక్షణాలు ఉన్న అందరికీ ఎంఫిసిమా ఉందని కాదు. ఇవన్నీ ఉంటే ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదని భావించొచ్చు. ఎంఫిసిమా ఉన్నదీ లేనిది డాక్టర్లు మాత్రమే నిర్ధారిస్తారు. పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ (PFT)ద్వారా ఊపిరిత్తులు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసినవారూ, చేస్తున్నవారూ కూడా ఒకసారి ''పి.ఎఫ్‌.టి'' చేయించుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నదీ లేదనిదీ తెలుస్తుంది. అలాగే కళ్లి పరీక్ష, ఎక్స్‌రేలు కూడా వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటిస్కాన్‌ చేయించుకుంటే బుల్లాలను ( ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న చిన్న వాయుకోశాలు కలిసిపోయి పెద్ద తిత్తిలా మారతాయి. ఇలాపాడైపోయిన ఈ తిత్తి శ్వాస ప్రక్రియను నిర్వహించలేదు. దీన్నే బుల్లా అని వ్యవహరిస్తారు) గుర్తించే వీలుంది.

  • చికిత్స

తక్షణ చికిత్స పొగమానేయడం. లేదంటే వ్యాధి ముదిరిపోతుంది. ఇన్‌హేలర్‌ ద్వారా మందులు వాడడం ప్రారంభిస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు కొద్దిగా వదులుగా మారి శ్వాస కాస్త తేలిగ్గా అందుతుంది. చాలాసార్లు ప్రాణవాయువును అందిచాల్సి వస్తుంది.
డాక్టర్‌ సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. COPD తీవ్రతను తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోండి. ప్రతి మందు పేరు, తీసుకోవలసిన మోతాదు, ఎప్పుడు తీసుకోవాలి అనవి రాసి ఉంచుకోండి. వాయునాళాలని వెడల్పు చేసే మందులను 'బ్రోంకో డైలేటర్స్‌' అంటారు. మీ ఊపిరితిత్తులలో గల వాయు నాళాల చుట్టూ వున్న కండరాలను గట్టిపరిచే చర్యను అవరోధించి, ఇంకా వెనక్క మరలించడం ద్వారా ఈ మందులు పని చేస్తాయి. ఉపశమనం కలిగి మరింత కులాసాగా శ్వాస పీల్చడానికి తోడ్పడ తాయి. శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. Infection  కోసము యాంటిబయోటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడాలి

  • ఆపరేషన్‌ అవసరమా?

సిఓపిడి వ్యాధి బాగా ముదిరి శ్వాస తీసుకోవడం మరీ కష్టంగా ఉన్నప్పుడు ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. దీన్ని లంగ్‌ రిడక్షన్‌ సర్జరీ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లోపల ఉన్న బుల్లాను కత్తిరించి తీసేస్తారు.


తీసుకోవలసిన జాగ్రత్తలు : 
  •  తేమకు దూరం :
తేమ వాతావరణం.. పిల్లికూతలు, దగ్గు, ఆస్థమా దాడులు పెరగటానికే కాదు. సీవోపీడీ వంటి వూపిరితిత్తి సమస్యలకూ దారితీస్తుంది. ఇంట్లో తేమ ఎక్కువగా ఉంటే తవిటి పురుగులు పెరగటానికీ తోడ్పడుతుంది. కాబట్టి ఇంట్లోకి తేమ వచ్చే అవకాశం గల అన్ని మార్గాలను మూసేయాలి.

  • ఇంటి కాలుష్యంతో జాగ్రత్త:
గ్యాస్‌ లీక్‌ కావటం, కట్టెపొయ్యిలు.. బొగ్గుపొయ్యిల నుంచి వచ్చే పొగ, మాడిపోయే వేపుళ్ల వంటివి ఇంట్లోనూ గాలిని కలుషితం చేస్తాయి. ఇలాంటి గాలిని పీల్చేవారికి సీవోపీడీ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి వంటగదిలో పొగను బయటకు పంపే ఫ్యాను, చిమ్నీలు ఏర్పాటుచేసుకోవాలి. ఎయిర్‌ కండిషన్ల వాడకాన్ని తగ్గించుకోవాలి.
  • సిగరెట్లు ప్రమాదం
వూపిరితిత్తులకు సిగరెట్లు, బీడీల పొగ ప్రధాన శత్రువు. సీవోపీడీ బాధితుల్లో 70% మంది సిగరెట్లను తాగేవారే కావటం గమనార్హం. ఇతరులు వదిలిన సిగరెట్‌ పొగను పీల్చటమూ ప్రమాదమే. దీంతో సీవోపీడీ ముప్పు 130% పెరుగుతున్నట్టు తేలిది. కాబట్టి సిగరెట్లు, బీడీలు తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. అలాగే ఇంట్లో ఎవరైనా వీటిని కాలుస్తుంటే వారించాలి.
  • గోబీపువ్వు సాయం
క్యాబేజీ, గోబీపువ్వు, బ్రకోలీ వంటి కూరగాయల్లో ఐసోథియోసయనేట్లు అధికంగా ఉంటాయి. ఇవి పొగ వల్ల వూపిరితిత్తులు దెబ్బతినటాన్ని అడ్డుకుంటాయి. పొగతాగేవారు ఇలాంటి కూరగాయలను తింటే వూపిరితిత్తి క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి క్యాబేజీ, గోబీపువ్వు, బ్రకోలీ వంటివి ఎక్కువగా తినాలి.
  • పట్టణాల్లో నుసి ముప్పు
దుమ్ము, ధూళి, నుసి, పొగ, వాహనాలు వెలువరించే కాలుష్య కారకాలు, ద్రవ బిందువులు.. గాల్లో చాలాసేపు ఉండిపోతాయి. వీటిని పీల్చితే నేరుగా వూపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. శ్వాస వ్యవస్థలో స్థిరపడి, అడ్డంకులు సృష్టిస్తాయి. వూపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. అందువల్ల వీలైనంతవరకు కాలుష్యం తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటి పనులు చేసుకోవటం మంచిది. అలాగే రద్దీ ప్రాంతాలు, రోడ్ల పక్కన వ్యాయామం వంటివి చేయకుండా చూసుకోవాలి.
  • వ్యాయామం --
వ్యాయామం మూలంగా వూపిరితిత్తులు ఆక్సిజన్‌ను బాగా గ్రహిస్తాయి. దీర్ఘంగా శ్వాస తీసుకునే ప్రాణాయామం వంటివీ వూపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి నిపుణుల సూచన మేరకు రోజుకి 10 నిమిషాల సేపు ప్రాణాయామం, అరగంట సేపు వ్యాయామాలు చేయటం మంచిది.
  • బరువు తగ్గటం--
అధిక బరువు వూపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో రక్తంలోకి తగినంత ఆక్సిజన్‌ సరఫరా కాదు. అందువల్ల బీఎంఐ 30 కన్నా ఎక్కువ గలవారు బరువు తగ్గించుకోవాలి.

references :
1.డా|| పి.అజయకుమార్‌,ఛాతివైద్యనిపుణులు-ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి-ఇఎస్‌ఐ దగ్గర హైదరాబాద్‌,
2.ఈనాడు సుఖీభవ వ్యాసము ,
3. - డా|| సుధీర్‌ ప్రసాద్‌-పల్మోనాలజిస్ట్‌--గ్లోబల్‌ హాస్పిటల్‌,-హైద్రాబాద్‌ ,
4.Text book of Lung diseases for P.G. students.,
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.