Friday, November 25, 2011

హంటా వైరస్‌ , HantaVirus



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -హంటా వైరస్‌ , HantaVirus- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  • మళ్లీ ఈ ఏడాది కొత్తగా కాకపో యినా హంటా వైరస్‌ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఏ జ్వరమొచ్చిన ప్రధానంగా పారిశుధ్యం లోపం కారణంగానే. ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే ఉండిపోవడం, పందుల సంచారం, తాగునీరు కలుషితమయం, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్య లోపాన్ని పరిష్కరించాల్సిన పాలకులు, అధికారులు చేతలుడిగి చూస్తున్నారు. వారు కేవలం పత్రికల్లో ప్రకటనలకే పరిమిమతవుతున్నారు. హంటావైరస్‌ ఎలుకల నుంచి ప్రబలుతోంది. సకాలంలో వైద్యులను సంప్రదిస్తే ప్రాణాపాయం ఉండదు.

ఏటా వర్షాలతోపాటు జ్వరాలూ ముంచుకొస్తాయి. మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌ గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతాయి. వీటిలో డెంగ్యూ గత ఏడాది నుంచి బాగా విజృంభించింది. డెంగ్యూ అంటే జనాలు భయపడుతున్నారు. ప్రధానంగా ఈ జ్వరమొస్తే రక్తంలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతోంది. సకాలంలో వైద్యులను సంప్రదిస్తే వ్యాధి నయమవుతుంది. సాధారణంగా మనిషి రక్తంలో 1,28000 నుంచి 4,34,000 వరకూ ప్లేట్‌లెట్లు ఉంటాయి. 70 వేల నుంచి 50 వేలకు ప్లేలెట్ల సంఖ్య పడిపోయినా గత ఏడాది చాలా మంది పరుగు పరుగునా కార్పొరేట్‌ ఆస్పత్రులకెళ్లి వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు పెట్టుకున్నారు.

  • పుట్టుక :
హంటా వైరస్‌ వల్ల వచ్చే జ్వరం ప్రాణాంతకం కాదు. భయపడాల్సిన పని లేదు. కొన్నేళ్ల క్రితం అమెరికాలోని హంటా నదీ తీరాన సైనికులు గుడారాలు వేసుకున్నారు. అక్కడ ఎలుకలు ఎక్కువగా ఉన్నందున వాటి ద్వారా వచ్చిన వైరస్‌ సైనికులకు ప్రబలింది. దాంతో కొందరు చనిపోయారు. వైద్యులు పరీక్షించి ఎలుకల నుంచి వచ్చిన కారణంగా వ్యాధి ప్రబలిందని నిర్ధారించారు. అందువల్ల దానికి హంటావైరస్‌ అని పేరు వచ్చింది.

  • ఎలా వస్తుంది?
ఎలుకల మల మూత్రాలు, లాలాజలం నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఈ వైరస్‌ ప్రబలుతుంది. తాగేనీటిలో అవి కలిసినా వస్తుంది. ప్రధానంగా నివాసం లేని షెడ్లు, ఎన్నో ఏళ్లుగా మూసేసిన ఇళ్లలో, ఇళ్లలోని స్టోరు గదులు, వంట రూముల్లో ఎలుకలు మలమూత్రాలు విసర్జించి ఉంటాయి. మనం ఆ గదులను శుభ్రం చేసే సమయంలో గాలిని పీల్చినప్పుడు వైరస్‌ ప్రబులుతుంది. దాని వల్ల ఫ్లూ జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు డెంగ్యూ లక్షణాలు దాదాపు ఒక్కటే. ఉన్నట్టుండి జ్వరం రావడం, నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వెంటనే వైద్యులను సంప్రదిస్తే నయమవుతుంది. లేకపోతే ఆక్సిజన్‌ తగ్గిపోవడం, దశలవారీగా ఊపిరితిత్తులు, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతాయి. దాంతో ఆయాసంగా ఎక్కువ అవుతుంది. బిపి తగ్గిపోతుంది. కిడ్నీలు పనిచేయడం దాదాపు తగ్గిపోతుంది. చివరకు రోగి అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రస్‌ సిండ్రోమ్‌ (ఎఆర్‌డిఎస్‌) స్థితికెళ్తే ప్రాణాపాయం సంభవిస్తుంది. వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తులపై పడితే 50 శాతం ప్రమాదం ఏర్పడుతుంది. రోగి ఆయాసం ఎక్కువ అయినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే '' ఐసియు ''లో పెట్టి వైద్యం చేయవచ్చు. ఈ వ్యాధి ప్రబలిన వెంటనే చనిపోరు. వెంటనే వైద్యం చేయిస్తే నయమవుతుంది. అందువల్ల ఈ వ్యాధి నివారణకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది.

  • జాగ్రత్తలు :
నివాసం లేని షెడ్లు, మూసేసిన ఇళ్లను, స్టోరు రూములను శుభ్రం చేసే ముందు వాటి తలుపులు, కిటికీలు తెరవాలి. అరగంటపాటు లాగే ఉంచాలి. శుభ్రం చేసే వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. అనంతరం క్రిమిసంహారక మందులో పది శాతం బ్లీచింగ్‌ కలిపి స్ప్రే చేయాలి. అనంతరం గదులను శుభ్రం చేస్తే హంటా వైరస్‌ ప్రబలదు. అలాగే ఇళ్లలో ఎలుకలు లేకుండా చూసుకోవాలి.
  • చికిత్స :
ఈ వ్యాధి నివారణకు యాంటీ వైరల్‌, '' రిబా విరన్‌ '' మాత్రలను వాడాలి. జ్వరము తగ్గడానికి " పారాసెటమాల్ " వాడాలి . ఆవిధముగా భాదను బట్టి చికిత్స చేయాలి. శరీరములో నీటి శారము తగ్గకుండా ' సెలైన్లు ' పెట్టి Dehydration రాకుండా కాపాడాలి.


--డాక్టర్‌ హెచ్‌. దత్తాత్రేయులు, డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల-నెల్లూరు ఫోన్‌ : 9490300447
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.