Monday, October 17, 2011

సెరిబ్రల్‌ పాల్సీ,Cerebral palsy



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెరిబ్రల్‌ పాల్సీ,Cerebral palsy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



పోలియోని దాదాపు జయించాం! బాల్యాన్ని కబళిస్తూ జీవితాలను కకా'వికలం' చేసే ఆ దురవస్థను చాలావరకూ తరిమికొట్టాం. కానీ ఇదే తీరులో నిండు జీవితాలను నిట్టనిలువునా నిర్వీర్యం చేస్తున్న మరో సమస్య 'సెరిబ్రల్‌ పాల్సీ' మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టటం లేదు. మనం గుర్తించటంలేదు గానీ ఇది పెద్ద సమస్య. చేతికి అందిరావాల్సిన బిడ్డలను వికలాంగులుగా మార్చివేసి.. భవిష్యత్తును అంధకారం చేస్తున్న సమస్య. పుడుతున్న ప్రతి వెయ్యి మంది పిల్లల్లో దాదాపు ఇద్దరు ముగ్గురు దీనితోనే కుంగిపోతున్నారు. ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది, రాష్ట్రంలో కనీసం 1.5 లక్షల మంది పిల్లలు ఈ నరకం అనుభవిస్తున్నారని అంచనా.

సెరిబ్రల్‌ పాల్సీని మనం పూర్తిగా నయం చేసి.. బిడ్డలను మిగతా పిల్లలందరిలా మార్చలేకపోవచ్చు. కానీ వైకల్యాన్ని చాలా వరకూ ఎదుర్కొనొచ్చు. బిడ్డ 'తన కాళ్ల మీద తాను నిలబడేలా' చెయ్యచ్చు. ముఖ్యంగా వీరు ప్రతి చిన్నదానికీ మరొకరి మీద ఆధారడాల్సిన దుర్భర స్థితి దాపురించకుండా చూడొచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఆ పనే చేస్తున్నాయి. దీనికి భారీ నిధులేం అక్కర్లేదు. బడా ఆసుపత్రులూ, హైటెక్‌ చికిత్సల అవసరమూ లేదు. కావాల్సిందల్లా ప్రభుత్వం వైపు నుంచి బలమైన నైతిక సంకల్పం. తల్లిదండ్రుల్లో అవగాహన, స్ఫూర్తి!

దుర్భరం : సెరిబ్రల్‌ పాల్సీ పిల్లల్లో కాళ్లు చేతులు సహకరించక పోవటం, వయసుకు తగిన పెరుగుదల లేకపోవటంతో వాళ్లు దైనందిన అవసరాల కోసం కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుంది. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు ఐదారేళ్ల వరకూ బాగానే చూడొచ్చుగానీ ఆ తర్వాత సమస్యలు మొదలవుతుంటాయి. బిడ్డ పెరిగి పెద్దవుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతుండటం, బరువు పెరుగుతుండటం వల్ల ఎత్తుకోవటం కష్టం కావటం.. ఇవన్నీ సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఫలితంగా బిడ్డ అన్ని రకాలుగానూ కుంగిపోతుంటే, మరోవైపు కుటుంబాలు అతలాకుతలమైపోతుంటాయి. పైగా ఈ సమస్య పేద కుటుంబాల్లో ఎక్కువ. ఆసుపత్రి ప్రసవాల్లో అయితే.. కాన్పు సమయంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనా వైద్యులు బిడ్డ గుండె కొట్టుకునే తీరు వంటివన్నీ జాగ్రత్తగా గమనిస్తూ బిడ్డకు నష్టం జరగకుండా చూస్తారు. అదే మంత్రసానులు కాన్పు చేస్తుంటే ఇది సాధ్యం కాదు. దీనివల్ల పేద కుటుంబాల్లో ఈ సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఎక్కువగా కనబడుతోంది. రెండోది- ఇటువంటి పిల్లలకు పేద కుటుంబాల్లో ఆలనాపాలనా కూడా కష్టమే. రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులు వీరిని దీర్ఘకాలం కనిపెట్టుకుని ఉండలేక, క్రమేపీ నిస్పృహలోకి జారిపోయి వీరిని విధికి వదిలేస్తుంటారు. దీంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బిడ్డ తన పని తాను చేసుకునేలా చూడటం అత్యవసరం. కొన్ని తేలికపాటి చికిత్సలతో ఈ బిడ్డల పరిస్థితి మెరుగై.. ఎంతోకొంత స్వతంత్రంగా జీవించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల మీద పెట్టే ఖర్చుకు.. దీర్ఘకాలంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రతిఫలం గొప్పగా ఉంటుంది.

* తెలివితేటలు - సెరిబ్రల్‌పాల్సీ బాధితుల్లో శారీరక కదలికలు కష్టం తప్పించి చాలామందిలో తెలివితేటలు బాగానే ఉంటాయి. చూడటానికి కొందరు మానసిక ఎదుగుదల లేనివారిలా కనిపించవచ్చు. ముఖంలోని కండరాల మధ్య సమన్వయం దెబ్బతినటం వల్ల వీళ్ల ముఖ కవళికలూ కొంత భిన్నంగా ఉండొచ్చుగానీ సాధారణంగా వీరిలో చాలామందికి మానసిక సమస్యలు తక్కువనే చెప్పాలి.
సురక్షిత కాన్పు సదుపాయాలు, ఆసుపత్రి ప్రసవాలు లేక .....పేద కుటుంబాల్లో ఈ సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఎక్కువగా కనబడుతోంది.

* ఇటువంటి పిల్లలకు పేద కుటుంబాల్లో ఆలనాపాలనా కూడా కష్టమే. రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులు వీరిని దీర్ఘకాలం కనిపెట్టుకుని ఉండలేక, క్రమేపీ నిస్పృహలోకి జారిపోయి వీరిని విధికి వదిలేస్తుంటారు. దీంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.
* వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది.
పింఛను కోసం చూసుకోవద్దు!
సెరిబ్రల్‌ పాల్సీకి చికిత్స చేయిస్తే.. వికలాంగుల పింఛను వంటి సదుపాయాలు ఇవ్వరేమోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు సర్జరీల వంటివాటికి ముందుకు రావటం లేదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రభుత్వం పింఛను ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవటం అవసరమే. అయితే అక్కడితోనే చేతులు దులిపేసుకోకుండా చికిత్స చేయించటం మీద కూడా దృష్టిపెడితే.. బిడ్డ ఏదో రోజు పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత తన కాళ్ల మీద నిలబడటం, తన పని తాను చేసుకోగలగటం వంటివి సాధ్యమవుతాయి. వ్యక్తిగా ఆత్మాభిమానం, గౌరవం పెరుగుతాయి. ఎంతైనా తల్లిదండ్రులు ఒక వయసు దాటిన తర్వాత సేవలు చేయలేరు, వాళ్లూ వృద్ధులవుతుంటారు. కాబట్టి ఏదో పింఛను రూపంలో తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు రూకల కోసం చూసుకుని.. బిడ్డలకు చికిత్స చేయించకపోవటం, చేయించినా చికిత్సలతో పెద్దగా ప్రయోజనం ఉండదని నిరాశలో కూరుకుపోవటం సరికాదు. అందరూ ప్రధానంగా తెలుసుకోవాల్సింది- సెరిబ్రల్‌ పాల్సీ వంటి సమస్యలను మనం పూర్తిగా నయం చెయ్యలేకపోవచ్చుగానీ.. బిడ్డ తన జీవితం తాను జీవించేలా చేసే అవకాశాలున్నాయి. బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఈ అవకాశాలను ఉపయోగించుకోవటం ముఖ్యం.ఈ సమస్య కారణంగా ఎన్నో పేద కుటుంబాలు ఘోరంగా కుంగిపోతున్నాయి. వీరికి చేసే చికిత్సలు, సర్జరీలు కూడా ఖరీదైనవేం కాదు. చాలా తేలికగా, ఎటువంటి ప్రభుత్వాసుపత్రిలోనైనా చెయ్యటానికి వీలైనవే. మనకు కావాల్సిందల్లా వీరి జీవితాల్లో మార్పు తేవాలన్న సంకల్పం!

పోలియో.. సెరిబ్రల్‌ పాల్సీ: తేడాలేంటి?
* పోలియో వైరస్‌ కారణంగా వచ్చే వ్యాధి. సెరిబ్రల్‌ పాల్సీ అన్నది మెదడులో కీలక కేంద్రాలు దెబ్బతినటం వల్ల వచ్చే సమస్య.

* పోలియోలో మెదడు బాగానే ఉంటుంది, వెన్ను దగ్గర నాడులు దెబ్బతిని, తత్ఫలితంగా కండరాలు కాళ్లు చచ్చుబడిపోతాయి. సెరిబ్రల్‌ పాల్సీలో కీలక మెదడు భాగాలు దెబ్బతింటాయి, వెన్ను దగ్గర సమస్యేం ఉండదు.

* పోలియోలో సాధారణంగా కాళ్లకు శక్తి ఉండదు, అవి చచ్చుబడిపోతాయి. సెరిబ్రల్‌ పాల్సీలో కాళ్లు చచ్చుబడిపోవటమన్నది ఉండదు, పైగా కాళ్ల కండరాలు అతిగా స్పందిస్తూ బలంగా బిగుసుకుపోతుంటాయి.

* పోలియో మనలాంటి బడుగు దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. సెరిబ్రల్‌ పాల్సీ పాశ్చాత్య దేశాల్లోనూ ఎక్కువే. కాకపోతే మనదేశంలో జనాభా సంఖ్య, శిశుజననాల సంఖ్య ఎక్కువ కాబట్టి మన దగ్గర బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.

* పోలియో, సెరిబ్రల్‌పాల్సీ.. వీటివల్ల జరిగే నష్టమేదో చిన్నతనంలోనే జరిగిపోతుంది. వ్యాధి క్రమేపీ ముదరుతూ పోవటమన్నది ఉండదు. కాకపోతే అప్పటికే జరిగిన నష్టం తాలూకూ దుష్ప్రభావాలు వైకల్యం రూపంలో జీవితాంతం వేధిస్తాయి, బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆ లోపాలు మరింతగా పెరుగుతుంటాయి. కాబట్టి వాటిని సరిచేయటం కోసం, ఆ నష్టాన్ని సాధ్యమైనంత వరకూ పూడ్చటం కోసం చికిత్స తప్పనిసరి.



చచ్చుబడిపోయిన కాళ్లు చూస్తూనే మనకు 'పోలియో' గుర్తుకొస్తుంది. టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతంగా అమలు చేయటం ద్వారా ఇప్పుడు దాన్ని మనం చాలా వరకూ అధిగమించగలిగాం. కానీ దాదాపు ఇదే తీరులో పిల్లలను వైకల్యం పాలు చేసే 'సెరిబ్రల్‌ పాల్సీ' మాత్రం ఇప్పటికీ మనకు పెద్ద సవాల్‌గానే నిలుస్తోంది. పోలియో అనేది వైరస్‌ ద్వారా వ్యాపించే వ్యాధి. కానీ 'సెరిబ్రల్‌ పాల్సీ' అంటువ్యాధి కాదు. ఇదేమీ వైరస్‌, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కారణంగా వచ్చేదీ కాదు. ప్రధానంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడో.. కాన్పు సమయంలోనో.. పుట్టిన తర్వాతో.. బిడ్డ మెదడులోని కీలక కేంద్రాలు.. అందులోనూ కండరాల కదలికలను నియంత్రించే మెదడు భాగాలు దెబ్బతినటం దీనికి మూలం. ఫలితంగా కాళ్లు వంకర్లు తిరిగిపోయి.. చేతులు, వేళ్లు స్వాధీనంలో లేక.. కదలికలు కష్టమై ఎంతోమంది పిల్లలు అంగవైకల్యానికి గురవుతున్నారు. ఒకసారి మెదడు కణాలు దెబ్బతింటే తిరిగి అవి కోలుకోవటం కష్టం. అందుకే ఈ వ్యాధిని మనం పూర్తిగా నయం చెయ్యలేంగానీ.. మెదడులో జరిగిన నష్టం కారణంగా కండరాల్లో తలెత్తే సమస్యలను మాత్రం రకరకాల చికిత్సల ద్వారా చక్కదిద్దే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి 'సెరిబ్రల్‌ పాల్సీ' అనగానే ఇక మనమేం చెయ్యలేమని వదిలేయకుండా.. పసివయసులోనే సమస్యల్ని గుర్తించి వీలైనంత మేర సరిచేయటం అవసరం.

సెరిబ్రల్‌ పాల్సీ: ఏమిటీ సమస్య?
చిన్న ఉదాహరణ చూద్దాం. టేబుల్‌ మీద ఉన్న పెన్నును పైకి తీసుకోవాలనుకున్నాం. అదెలా సాధ్యం? ముందు చేతి, వేళ్ల కండరాలు సమన్వయంతో కదులుతూ... మన వేళ్లు కాస్త వదులుగా పెన్ను వరకూ వెళ్లాలి. అవి కచ్చితంగా పెన్నును పట్టుకోవాలి. వెంటనే బిగువుగా మారి, ఆ పెన్నును పైకి లేపాలి, వెనక్కిరావాలి. ఇలా ప్రతి కదలికా.. ప్రతి పనీ.. కండరాల సమన్వయంతో సున్నితంగా జరగాల్సిందే. లేకపోతే శారీరక కదలికలు అసంభవం. ఇందుకోసం మెదడులోని కీలక కేంద్రాలు.. ఎప్పుడు బిగువుగా మారాలి, ఎప్పుడు వదులవ్వాలి.. ఎలా కదలాలన్నది నిరంతరం ఆయా కండరాలకు ఆదేశాలు పంపిస్తూనే ఉంటాయి. కానీ సెరిబ్రల్‌ పాల్సీ బాధితుల్లో... ఇలా కండరాలను నియంత్రించాల్సిన మెదడు భాగాలు దెబ్బతింటాయి. ఫలితంగా కండరాల కదలికలన్నీ అసహజంగా, అస్తవ్యస్తంగా తయారవుతాయి. క్రమేపీ కండరాలు బిగుసుకుపోవటం.. మోకాళ్లు ముడుచుకుపోతుండటం, కాళ్లు కత్తెరలా వంకరైపోతుండటం, పాదాలు తిరిగిపోతుండటం, చేతుల వేళ్లు ముడుచుకుపోతుండటం.. ఇలా ఎన్నో వైకల్య లక్షణాలు మొదలవుతాయి.

చెప్పలేని కారణాలు అనేకం
మన మెదడు ఎదుగుదల తల్లిగర్భంలోనే ఆరంభమై.. పుట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్ల వరకూ కూడా కొనసాగుతుంది. ఇలా గర్భంలో పెరుగుతున్నప్పుడుగానీ, కాన్పు సమయంలో గానీ, చిన్న వయసులోగానీ పసి మెదడు దెబ్బతింటే పరిస్థితి 'సెరిబ్రల్‌ పాల్సీ'కి దారి తియ్యచ్చు. గర్భిణికి రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు రావటం, హైబీపీ, పోషకాహార లోపం, తల్లీబిడ్డల రక్తం గ్రూపులు సరిపడకపోవటం వంటివి గర్భంలోనే పిండం మెదడును దెబ్బతియ్యచ్చు. ఇక కాన్పు కష్టమై, బిడ్డ మధ్యలోనే ఎక్కువసేపు ఉండిపోయినా, ఆ సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక సెరిబ్రల్‌ పాల్సీ రావచ్చు. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే మెదడు నిర్మాణంలో లోపాలు తలెత్తచ్చు. ఇక పసివయసులో మెదడు, మెదడు పొరల వాపు (ఎన్‌సెఫలైటిస్‌, మినింజైటిస్‌), తలకు దెబ్బలు తగలటం వంటివీ మెదడును దెబ్బతియ్యచ్చు. బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు సెరిబ్రల్‌ పాల్సీ ముప్పు 20 రెట్లు ఎక్కువ. కవలల్లోనూ ఎక్కువగా కనిపించొచ్చు. ఇలా మెదడుకు ఏ రూపంలో నష్టం జరిగినా సెరిబ్రల్‌ పాల్సీ రావచ్చుగానీ వీటిలో దేనివల్ల వచ్చిందన్నది కచ్చితంగా నిర్ధారించటం మాత్రం కష్టం.

గుర్తించేదెలా?
సమస్య తీవ్రంగా ఉండి, బిడ్డ కదలికలు మరీ అసహజంగా ఉంటే తల్లిదండ్రులు 3 నెలల్లోపే తేడా గుర్తిస్తారు. మెదడుకు జరిగిన నష్టం మధ్యస్తంగా ఉంటే మాత్రం- రెండు మూడేళ్ల వరకూ వ్యాధి అంతగా బయటపడకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు చూడటానికి బాగానే ఉంటారుగానీ మెడ నిలబెట్టటం, పాకటం, కూచోవటం, నిలబడటం, నడవటం వంటివి ఆలస్యం అవుతుంటాయి. దాన్నిబట్టి తల్లిదండ్రులు అనుమానించే అవకాశం ఉంటుంది. పుట్టగానే బిడ్డ ఏడ్వకపోవటం కీలక సమస్యలకు సంకేతం. కొందరు పిల్లల్లో పాలుతాగటం, మింగటం, మాటల వంటివీ కష్టంగా ఉండొచ్చు. మెదడులోని ఏ భాగం దెబ్బతిందన్న దాన్నిబట్టి- కండరాలు బలంగా ముడుచుకుపోతుండటం నుంచి ఉన్నట్టుండి జర్క్‌లు వచ్చినట్టు అసహజమైన కదలికల వరకూ సెరిబ్రల్‌ పాల్సీలో చాలా రకాలున్నాయి.

చికిత్స: స్వతంత్రులను చేయటమే లక్ష్యం!
మనం సెరిబ్రల్‌పాల్సీ వ్యాధిని పూర్తిగా నయం చేసి.. వారిని చక్కటి ఆరోగ్యవంతులుగా మార్చలేకపోవచ్చు. కానీ సమస్యను గుర్తించి.. చిన్నతనం నుంచీ చిన్నచిన్న సంరక్షణ చర్యలు ఆరంభిస్తే ఈ పిల్లలను చాలా వరకూ స్వతంత్రులను చేసే అవకాశం ఉంటుంది. కనీసం పూర్తి అంగ వైకల్యంలోకి జారిపోకుండానైనా చూడొచ్చు. వైద్యులు బిడ్డ పరిస్థితిని పరిశీలించి.. బిడ్డ సాధ్యమైనంత చక్కగా ఎదిగేందుకు సహాయపడతారు. పూర్తిగా మంచానికి అతుక్కున్న బిడ్డను కొంత లేచి కూర్చునేలా చూడటం.. నడవ లేకపోతున్న బిడ్డను క్యాలిపర్స్‌ వంటివాటి సహాయంతోనైనా.. కుంటుకుంటూ అయినా నడిచేలా చూడటం.. ఇలా ప్రతి దశలోనూ పరిస్థితి మెరుగయ్యేలా చూడటం సాధ్యమే. దీనిలో- ఫిజియోథెరపీ, సర్జరీ రెండింటికీ ప్రాధాన్యం ఉంది.

* ఫిజియోథెరపీ: సెరిబ్రల్‌ పాల్సీ వల్ల బిగుసుకుపోతున్న కండరాలను దారిలోకి తేవటం, కదలికలను మెరుగుపరచటం వంటివాటికి ఫిజియోథెరపీలో ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. వీటిని తల్లిదండ్రులు నేర్చుకుని నిత్యం బిడ్డతో చేయించటం ద్వారా దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. కొందరికి కండరాల సమస్యలు తీవ్రంగా ఉంటే ఆపరేషన్‌తో సరిచేసి.. ఆ తర్వాత మళ్లీ ఫిజియోథెరపీ చెయ్యాల్సి ఉంటుంది.

* సర్జరీ: బిగుసుకుపోతున్న కండరాలు, టెండన్లను వదులు చేయటం, మరీ బలంగా ముడుచుకుంటున్న వాటిని కాస్త సాగదీసి, సమన్వయ పరచటం, వంకర్లు సరిచెయ్యటం వంటివన్నీ సర్జరీలో కీలకాంశాలు. మోకాళ్లు వంగిపోతుంటే ముడుచుకుంటున్న టెండన్లను 'జడ్‌ప్లాస్టీ' వంటి విధానాల ద్వారా సాగదీసి, సాఫీగా నిలబడి.. క్రమేపీ నడిచేలా చెయ్యచ్చు. కొన్నిసార్లు వీటికి 'బొటాక్స్‌' ఇంజక్షన్ల వంటివీ ఉపయోగపడతాయి.

* కొందరిలో బొటనవేలు ముడుచుకుపోతూ ఏ పని చెయ్యాలన్నా అరిచేతిలో పెద్ద అడ్డుగా తయారవుతుంది. కండరాన్ని సరిచేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

* కొందరికి కాళ్లు రెండూ దగ్గరగా బిగుసుకుపోయి.. ఏం చేసినా వెడంగా, దూరంగా వెళ్లవు. గజ్జల దగ్గరి కండరాలను వదులు చేయటం, కట్‌ చేయటం వంటి సర్జరీలతో కొంత సరిచెయ్యచ్చు. గూని వంటివి ఉన్నా సర్జరీలో సరిచేయచ్చు.

* కొన్నిసార్లు కాళ్లు సాఫీగా సాగటానికి- ఒకవైపు కండరం సరిగా పనిచేయకుండా రెండోది బాగుంటే.. ఒకవైపు కండరాన్నీ, టెండన్లనూ ఇంకోవైపునకు మార్చటం కూడా సర్జరీల్లో ముఖ్యమైన భాగం.

* కండర బిగుతుదనానికి కారణమవుతున్న నాడులను కట్‌ చేయటం గురించి తరచూ మాట్లాడుతుంటారుగానీ అది చాలాచాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకూ నాడులనుకట్‌ చేయకుండా కండరాలను సరి చేయటమే ఉత్తమ విధానంగా నిలుస్తుంది.

* అతిగా పనిచేస్తున్న కండరాలను గాడిలో పెట్టటానికి 'యాంకిల్‌ ఫ్లోర్‌ ఆర్థ్రోసిస్‌ (ఏఎఫ్‌ఓ)' రకం క్యాలిపర్స్‌ వంటివి ఇస్తారు.

* సర్జరీ తర్వాత నడకలో తర్ఫీదు ఇస్తారు. ముందు అటూఇటూ కర్రదండాలు పట్టుకుని నడవటం, తర్వాత స్ట్రెచర్‌తో నడవటం, తర్వాత వదిలేసి నడవటం.. ఇలా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నతనంలో సరిచేయకపోతే క్రమేపీ ఎముకలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

* మొత్తమ్మీద ఫిజియోథెరపీ చేయించటం, కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటే సర్జరీతో సరిచేయటం, క్యాలిపర్స్‌తో నడిచేలా తర్ఫీదునివ్వటం.. ఇవి చికిత్సలో కీలకాంశాలు. వీటికి పెద్ద ఖర్చేం కాదు. కష్టమేం లేదు. కాకపోతే చికిత్సా విధానాలు ఉన్నాయని.. పరిస్థితిని పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత సరిచేయవచ్చని అందరూ అవగాహన పెంచుకోవటం ముఖ్యం.

* పునర్వికాసం: చికిత్సల తర్వాత వీరు స్కూలుకు వెళ్లి చదువుకునేలా చూడటం, ఏ రకం పని బాగా చేయగలుగుతారో గుర్తించి దానికి సంబంధించిన వృత్తుల్లో కుదురుకునేలా చూడటం కూడా అవసరం.

డా|| కె.కృష్ణయ్య--ఆర్థోపెడిక్‌ సర్జన్‌--మెడిసిటీ హాస్పిటల్‌--హైదరాబాద్‌(ఈనాడు సుఖీభవ).
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.