Sunday, October 30, 2011

మన ఆరోగ్య పరిరక్షణలో బ్యాక్టీరియా , Bacteria in protecting our health


  • image courtesy with Eenadu newspaper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మన ఆరోగ్య పరిరక్షణలో బ్యాక్టీరియా , Bacteria in protecting our health-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఒకప్పుడు చాలా వ్యాధులు మనకు పెద్ద మిస్టరీ! అవి ఎందుకు వస్తున్నాయో కారణమేమిటో తెలియక కొన్ని యుగాల పాటు మనిషి అయోమయంలో, అపోహల్లో గడిపేశాడు. కానీ సూక్ష్మజీవులు మన కంటబడిన తర్వాత వ్యాధుల పట్ల మన అవగాహనే మారిపోయింది. 18వ శతాబ్దంలో బలంగా మన ముందుకు వచ్చిన ఈ 'సూక్ష్మజీవుల సిద్ధాంతం (జెర్మ్‌ థియరీ) వ్యాధుల పట్ల మన అవగాహననే మార్చేసింది.మన కంటికి కనిపించని బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వ్యాధులకు కారణమవుతున్నాయని గ్రహించగానే... వాటిని మట్టుబెట్టే యాంటీబయాటిక్స్‌ రంగం మీదికి వచ్చాయి. ఆ సూక్ష్మజీవులను అడ్డుకోవటానికి పరిశుభ్రత పాటించటం వంటివి ఆరంభించాం. దీంతో ఎన్నో వ్యాధులను అడ్డుకోగలిగాం, ఎన్నో ప్రాణాలనూ కాపాడుకోగలిగాం. కానీ వీటన్నింటి వల్లా.. మనందరిలో 'బ్యాక్టీరియా' అంటే చెడ్డది, మనకు హాని చేసేదేనన్న భావన బలపడిపోయింది. సూక్ష్మజీవులంటే మనకు కీడు తలపెట్టేవేనన్న నమ్మకం బలపడింది. కానీ ఇది నిజం కాదు!

మన పేగుల నిండా కోటానుకోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరుగాడుతోంది. వీటిలో ఎన్నో రకరకాలున్నాయి. ఇవి ముఖ్యంగా పెద్దపేగు, చిన్నపేగులలో నివాసం ఉంటూ అనుక్షణం రకరకాలుగా మనకు మేలు, సహాయం చేస్తున్నాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం దగ్గరి నుంచీ.. భారీ సైన్యంలా పనిచేస్తూ హానికారక సూక్ష్మజీవుల నుంచి మన పేగులకు రక్షణగా పహారా కాస్తుండటం వరకూ ఎన్నో పనులు చేస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ల నుంచి, అలర్జీల నుంచిమనకు రక్షణగా నిలుస్తున్నాయి. అయితే ఈ బ్యాక్టీరియా అంతా మంచిదే కాదు. దీనిలో దాదాపు 10 శాతం చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంది. దీని ప్రాబల్యం పెరిగితే- పొట్టలో గ్యాస్‌ పెరగటం, అజీర్ణం, విరేచనాల వంటివి చుట్టుముడతాయి, కొన్నిసార్లు ఇవి క్యాన్సర్లకూ కారణం కావచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండేందుకు- పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను రక్షించుకుంటూ చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. కానీ ఆధునిక కాలంలో మనం విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్‌ వాడుతుండటం, బాగా శుద్ధిచేసిన ఆహారపదార్థాలు ఎక్కువగా తింటుండటం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా బలహీనపడి, చెడ్డ బ్యాక్టీరియా బలోపేతమవుతోంది. ఫలితంగానే ఎన్నో వ్యాధులు పెరుగుతున్నాయని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వీటిపై విస్తృతంగా అధ్యయనాలు సాగుతున్నాయి.

వ్యాధులకు మూలం!
పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగటం వల్ల పేగుపూత (ఐబీడీ, ఐబీఎస్‌, అల్సరేటివ్‌ కోలైటిస్‌), పెద్దపేగు క్యాన్సర్ల వంటివి పెరుగుతున్నాయని పరిశోధనా ప్రపంచం ఇప్పటికే బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించి, మంచి బ్యాక్టీరియాను పెంచటం ద్వారా ఈ వ్యాధులను ఎదుర్కొనాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మన పేగుల్లో ఈ బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి తలపడుతూ, నిరంతరం పోరాడుతూ, ఒక దాని స్థానాన్ని ఒకటి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మంచి బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువ ఉన్నంత వరకూ సమస్య ఉండదు. వీటిలో ఆమ్లాలను ఉత్పత్తి చేసి పేగులను కాపాడుతుండే లాక్టోబ్యాసిల్లస్‌, బిఫిడో బ్యాక్టీరియం వంటి రకాలను, అలాగే మీథేన్‌ను ఉత్పత్తి చేసే రకాలను ప్రధానంగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకునే ఆహారం, లోపల ఉండే జీర్ణ రసాల ఆధారంగానే పెరుగుతుంటాయి. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే రసాయనాలు పేగుల లోపలి గోడను దెబ్బతీసి పూత వచ్చేలా చెయ్యటం, పుండ్లు పడేలా చెయ్యటం, డీఎన్‌ఏను దెబ్బతీసి క్యాన్సర్‌ గడ్డలు పెరిగేలా చెయ్యటం.. ఇలా రకరకాల వ్యాధులకు కారణమవుతున్నాయని పరిశోధనా ప్రపంచం బలంగా విశ్వసిస్తోంది. 'అల్సరేటివ్‌ కోలైటిస్‌' వంటి సమస్యల్లో పేగుపూత, వాపు ఎందుకు వస్తోందన్నది చాలాకాలంగా పరిశోధనలకు కూడా అంతుబట్టని విషయంగా ఉంది. దీని వెనక ఈ బ్యాక్టీరియా ప్రభావం ఉండొచ్చని ఇప్పుడు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్టీరియా పెంచటం ద్వారా చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించాలని పరిశోధకులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ప్రోబయాటిక్స్‌ వంటివన్నీ ఈ ప్రయత్నాల్లో భాగమే. అయితే ఈ ప్రోబయాటిక్స్‌ను నోటితో తీసుకున్నప్పుడు జీర్ణాశయంలోని ఆమ్లాల ధాటికి ఇవి అక్కడే చనిపోవచ్చు. కాబట్టి బయటి నుంచి పంపటం కాకుండా ఇప్పటికే పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా ప్రాబల్యాన్ని పెంచటం, లేదంటే ఈ రెండు మార్గాలనూ కలపటం వంటి రకరకాల పద్ధతుల ద్వారా ప్రిబయాటిక్స్‌, సింబయోటిక్స్‌ వంటివాటినీ అభివృద్ధిచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి భవిష్యత్తులో మన చికిత్సా మార్గాలను, వైద్య విధానాలను కొత్త దారుల్లో నడిపించటం తథ్యమని భావించవచ్చు.


మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా panulu : -
* మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా పిండిపదార్ధాలను జీర్ణం చేసుకోవటంలో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియా చిన్నపేగు పొడవునా ఉంటుంది.
* మన పేగులను హానికారక బ్యాక్టీరియా, ఫంగస్‌, పరాన్నజీవుల వంటివిఆక్రమించుకోకుండా, వాటి ప్రభావం పెరగకుండా అడ్డుకుంటుంది.
* విటమిన్‌-బి12, విటమిన్‌-కె వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తుంది.
* సహజమైన యాంటీబయాటిక్స్‌, ఆమ్లాలు, హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ వంటివి ఉత్పత్తి చెయ్యటం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణగా నిలుస్తుంది.
* మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. రోగ కారకాలపై పోరాడే 'యాంటీబోడీ'ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. విషతుల్యాలు, అలర్జీ కారకాలు, హానికారకమైన సూక్ష్మజీవులపై పోరాటానికి సిద్ధం చేస్తుంది.

పరిశోధనా ప్రపంచం:
* కోటానుకోట్ల సంవత్సరాలకు పూర్వం... ఈ భూమ్మీద తొలి జీవం ఆరంభమైంది అత్యంత సూక్ష్మమైన 'బ్యాక్టీరియా' రూపంలోనే! కానీ బ్యాక్టీరియా ఉనికి మన కంటికి చిక్కి కేవలం 300 ఏళ్లే అయ్యింది. డచ్‌ శాస్త్రవేత్త లీసివెన్‌హోక్‌ తన మైక్రోస్కోపుతో తొలిసారిగా బ్యాక్టీరియాను దర్శించిన నాటి నుంచీ మన ముందు ఓ సువిస్తారమైన 'సూక్ష్మ' ప్రపంచం ఆవిష్కృతం కావటం మొదలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోపులతో మనం కోట్లాది బ్యాక్టీరియాను చూడగలుగుతున్నాంగానీ.. ఇప్పటికీ మనకు అదో మిస్టరీ ప్రపంచమే. దాని గురించి తెలియాల్సింది చాలా ఉంది.
* మన పేగుల్లో- మన శరీరంలో ఉన్న మొత్తం కణాలకు పదిరెట్లు ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉందని గుర్తించిన తర్వాత వైద్యపరిశోధనా రంగం.. వీటిపై మరింత లోతుగా పరిశోధనలు ఆరంభించింది.
* మానవ జీనోమ్‌లో కేవలం 23,000 జన్యువులు ఉండగా.. ఈ పేగుల్లోని బ్యాక్టీరియాలో కనీసం 33 లక్షల జన్యువులు ఉన్నాయని తాజాగా ప్రతిష్ఠాత్మక 'నేచర్‌' పత్రిక కీలకమైన అధ్యయనాన్ని ప్రచురించింది. అలాగే ఈ బ్యాక్టీరియా జాతులు దాదాపు అందరిలోనూ ఒకేలా ఉంటున్నాయనీ, ముఖ్యంగా వీటిలో క్యాన్సర్‌, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) వంటి వ్యాధులను కలుగజేసే జన్యువులూ ఉన్నాయని వీరు గుర్తించారు.
* ఈ పేగుల్లోని బ్యాక్టీరియా మనలో ఆకలినీ, శరీరంలోని జీవక్రియలనూ, ముఖ్యంగా ఇన్సులిన్‌ నిరోధకతనూ ప్రభావితం చేస్తోందని, తద్వారా వూబకాయం పెరగటానికి ఈ పేగుల్లోని బ్యాక్టీరియా దోహదం చేస్తుందని తాజాగా 'సైన్స్‌' పత్రిక మరో అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో- ఊబకాయం నుంచి క్యాన్సర్‌ వరకూ చాలా వ్యాధులకు ఈ పేగుల్లో బ్యాక్టీరియా ఆధారంగా చికిత్స సాధ్యపడటం తథ్యమని అర్థమవుతోంది. ఇప్పటికే నోటి ద్వారా మంచి బ్యాక్టీరియాను ఇవ్వటం (ప్రోబయాటిక్స్‌) ముఖ్యమైన చికిత్సా విధానంగా ఆచరణలోకి రావటం ఇందుకు బలమైన ఆధారం!

జన్యువులు, పర్యావరణం :
ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుందన్నది కీలకమైన అంశం. ఇది పెరగటానికి జన్యుపరమైన అంశాలు కొంత వరకూ కారణమైతే పర్యావరణపరంగా- అంటే తినే ఆహారం, తాగేనీరు వంటివన్నీ కూడా కొంత వరకూ దోహదం చేస్తాయి. అందుకే తేన్పులు, గ్యాస్‌ ఎక్కువగా తయారవ్వటం వంటి ఒకే రకమైన జీర్ణ లక్షణాలు కొన్ని కుటుంబాల్లో కనబడుతుంటాయి.
* బిడ్డకు మొదటగా పేగుల్లో బ్యాక్టీరియా తల్లి నుంచి వస్తుంది. తల్లిపాలు తాగే బిడ్డల్లో బిఫిడో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది, అందుకే వీరిలో జీర్ణ సమస్యలు తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.

అవసరమైతేనే ప్రోబయాటిక్స్‌ :
యాంటీబయాటిక్స్‌ తీసుకుంటే అవి పొట్టలోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది కాబట్టి ఆ ప్రభావాన్ని భర్తీ చెయ్యటానికి 'ప్రోబయాటిక్స్‌'తీసుకోవటం మంచిదన్న భావన చాలామందిలో ఉంది. కానీ ఇది సరికాదు. ఎందుకంటే- యాంటీబయాటిక్స్‌ కేవలం పొట్టలోని బ్యాక్టీరియానే కాదు, ఈ ప్రోబయాటిక్స్‌ను కూడా చంపేస్తాయి. కాబట్టి ఈ రెంటినీ కలిపి ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు, అసలా అవసరమూ లేదు. యాంటీబయాటిక్స్‌ వాడటం ఆపేసిన తర్వాత సహజంగానే కొద్దిరోజుల్లో మళ్లీ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి ప్రోబయాటిక్స్‌ అవసరం లేదు. దీర్ఘకాలంగా నీళ్ల విరేచనాలు, చిన్నచిన్న పుళ్లుపడి పెద్దపేగు పూత (అల్సరేటివ్‌ కోలైటిస్‌), క్రోన్స్‌ వంటి వ్యాధులతో వచ్చే నీళ్లవిరేచనాల్లో మాత్రమే ప్రోబయాటిక్స్‌తో ప్రయోజనం ఉంటుంది. మొత్తమ్మీద- నీళ్లవిరేచనాల సమస్య మూడు వారాలకు మించి కొనసాగుతున్నప్పుడు మాత్రమే ప్రోబయాటిక్స్‌తో ఉపయోగం ఉంటుందన్నది ప్రస్తుత అవగాహన.
* ఆల్కహాల్‌ తాగకుండా కూడా కొందరిలో కాలేయం వ్యాధిగ్రస్తమవుతుంది(నాష్‌). బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొన్ని విషతుల్యాలు లివర్‌ను దెబ్బతియ్యటమే దీనికి కారణమని గుర్తించారు. ప్రోబయాటిక్స్‌ తీసుకుంటే ఇది నయమవుతుందని నిరూపణ అయ్యింది.

చెడ్డ బ్యాక్టీరియాకు చెక్‌
పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవటం చాలా అవసరం. అందుకు...
* యాంటీబయాటిక్స్‌: ఎంతో అవసరమైతే తప్పించి యాంటీబయాటిక్స్‌ను చీటికీమాటికీ విచక్షణా రహితంగా వాడెయ్యద్దు. అవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. దాంతో పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగిపోయి నీళ్లవిరేచనాల వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి.
* ఆహారం: తీపి, చక్కెరలు ఎక్కువుండే పదార్థాలు, బాగా శుద్ధి చేసిన రిఫైన్డ్‌ పదార్థాలు ఎక్కువగా తినొద్దు. ఇవి పేగుల్లో పులిసినట్త్లె (ఫెర్మెంటేషన్‌) చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయేందుకు దోహదం చేస్తాయి. స్వీట్లు, కుకీస్‌, చిప్స్‌, పేస్ట్రీలు, ప్యాకెట్లలో దొరికే పదార్థాలు తగ్గించటం అవసరం.
ఆహారం బాగా నమిలి తినటం మంచిది. బీఫ్‌ ( goDDumaaMsamu ) వంటి పీచు తక్కువుండే మాంసాహారాలు బ్యాక్టీరియాతో చర్య జరిపి నైట్రోజమైన్స్‌ అనే రసాయనాలను ఏర్పరుస్తాయి. అవి పేగుల కణాల్లోని డీఎన్‌ఏ మీద పని చేసి క్యాన్సర్‌కూ కారణమవుతాయి. కాబట్టి బీఫ్‌ వంటి మాంసాలు సాధ్యమైనంత తక్కువ తింటూ, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం.. మంచి బ్యాక్టీరియా పెరగటానికి, తద్వారా క్యాన్సర్‌ వంటివి దరిజేరకుండా చూసుకోవటానికి ముఖ్యం.
* మద్యం: మద్యం పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతియ్యటంతో పాటు చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగేలా కూడా చేస్తుంది. కాబట్టి తరచూ మద్యం తాగకుండా ఉండటం పొట్టకు మంచిది.
* మందులు: కొందరు చీటికీమాటికీ అసిడిటీ తగ్గించే యాంటాసిడ్‌ మందులు వాడేస్తుంటారు. పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఇది మంచిది కాదు. అలాగే విరేచనాలు ఎక్కువ అయ్యేందుకు మందులు (లాగ్జేటివ్స్‌) వేసుకోవటమూ మంచిది కాదు. దానివల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా కూడా కొట్టుకుపోతుంది. స్టిరాయిడ్‌ మందులు, గర్భనిరోధక మాత్రలు కూడా పేగుల్లో బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు మేరకే వాడుకోవాలి.
మన శరీరం మొత్తం మీద ఉన్న జీవకణాలు 100 ట్రిలియన్లు. కానీ మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా దానికి దాదాపు పది రెట్లు ఎక్కువ.. అంటే 1000 ట్రిలియన్లు. 10 కోట్ల కోట్లు!
తాజా పండ్లు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవటం.. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఎంతో మేలు చేస్తుంది.

--డా|| డి.నాగేశ్వరరెడ్డి--డైరెక్టర్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ--హైదరాబాద్‌.
  • ==================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.