Tuesday, August 30, 2011

ఒంటరితనం , Loneliness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఒంటరితనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం అని అర్థం కాదు. సంఘటనలు లేదా అవకాశాలను బట్టి చాలామంది ఒంటరిగా ఉండే సమయాలుండవచ్చు. ఒంటరితనమనేది వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లయితే, ఒంటరిగా ఉండటాన్ని సానుకూలంగా, ఉల్లాసకరంగా మరియు భావావేశపరంగా పునరుత్తేజం పొందటంగా అనుభూతించవచ్చు. ఏకాంతం స్థితి అంటే ఒంటరిగా మరియు ఇతర వ్యక్తుల నుండి వేరుగా ఉండటం, మరియు తరచుగా స్పృహతోనే ఒంటరిగా ఉండే అవకాశం కల్పించుకోవటంగా సూచించవచ్చు. ఉపేక్షింపబడిన ఏకాంతం నుండి వచ్చే ఫలితమే ఒంటరితనం. ఒంటరితనం, ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా, అనుభవంలోకి రావచ్చు. దాన్ని వ్యక్తిగత గుర్తింపు, అర్ధం చేసుకోవటం లేదా కరుణ లేకపోవటంగా కూడా వర్ణించవచ్చు. ఒక వ్యక్తి భౌతికంగా ఇతరుల నుండి వేరు చేయబడ్డాడా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా, ఒంటరితనం, ఇతర స్వతంత్ర వ్యక్తుల నుండి వేరు చేయబడిన భావనగా వర్ణింపబడుతుంది. నెరవేరని, అంతేకాదు పొందలేమనిపించే ప్రేమ లేదా సాహచర్యం గురించిన బలమైన కోరికగా కూడా దీన్ని వర్ణించవచ్చు. లేదా ఒకరి జీవితంలో ప్రేమ రాహిత్యం నుండి విస్తరించిందనవచ్చు, కాబట్టి తిరస్కారం, నైరాశ్యం మరియు హీనమైన ఆత్మగౌరవం వంటి భావోద్రేకాలకి దారి తీయవచ్చు. ఒంటరితనం యొక్క భావనలు, మృత్యుభావనలు లేదా ప్రియమైన వారిని పోగొట్టుకున్న భావనలకి సమానంగా ఉండవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారి ఆరోగ్యంకూడా అంతంతమాత్రమేనంటున్నారు పరిశోధకులు.

ఒంటరిగా ఉండేవారు కేవలం మానసికంగానేకాకుండా శారీరకంగాకూడా బాధపడుతుంటారని వైద్యులు తెలిపారు. ఇది వారి మస్తిష్కంపైకూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వారు తెలిపారు. ఒంటరిగా ఉండటంవలన మస్తిష్కంపై ఒత్తిడి అధికంగావుంటుందని పరిశోధకులు వివరించారు.ఒంటరితనంవలన మనిషిలో కోరికలు నశిస్తాయని, దీంతో వారికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఏ విధంగానైతే ధూమపానం చేసేవారికి, ధూమపానం చేయనివారికి ఎంత తేడా ఉంటుందో అలాంటి తేడాలే ఒంటరిగా జీవించేవారిలోకూడా ఉంటుందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధనకర్త ప్రొఫెసర్ జాన్ కాసిపో వివరించారు.

ఒంటరితనం అనేది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా వారి ఆరోగ్యంపైకూడా తీవ్రమైన ప్రభావం కనపడుతుందని, ఇది చాలావరకు అనారోగ్యానికి దారి తీస్తుందని ఆయన తెలిపారు. ఎందుకంటే అన్ని రకాల ప్రాణులు కలిసి మెలిసి ఉంటాయి. అలాగే మనిషి సంఘజీవి కావడం వలన తన రక్త సంబంధీకులు, మిత్రులు, ఇరుగు-పొరుగులతో సత్సంబంధాలు కొనసాగించనిదే ఉండలేడు.కాబట్టి ప్రతి ఒక్కరు సంఘంతో తమ జీవితాన్ని ముడిపెడుతుంటారు. అయినాకూడా కొందరికి ఒంటరితనం వెంటాడుతూనే ఉంటుందని వారి పరిశోధనలలో తేలినట్లు ఆయన తెలిపారు.

ఒంటరితనంవల్ల మీరు ఏమీ చేయలేని అశక్తులం అన్న భావనకు గురవుతుంటారు. కారణం ఆ ఒంటరితనం మీలో పాతుకుపోయి ఉండటమే. ఒంటరితనం మరీ ఎక్కువైపోతే అది కుటుంబాన్ని కూడా బాధిస్తుంది. సంతోషంతో, చురుగ్గా జీవితాన్ని గడపలేరు. ఒంటరిగా ఉన్నవారు విభిన్నమైన సాంఘిక జీవితాన్ని గడపలేరు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరితనాన్ని అనుభవించేవుంటారు. ఇది మానవ జీవితపు ఒక అంతర్భాగం. ఈ సమయాన్ని గుర్తుంచుకుని తగినంత సహన్నాని ప్రదర్శించాలి. ఓర్పు ఆయుధంగా ఒంటరితనంతో నెగ్గుకు రావడం సులభం అవుతుంది.

కుటుంబంలో ఏదో కష్టం. లేదా మీ మిత్రుడు మీరు అనుకున్న దానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు లేదా మీ జీవితంలో ఏదీ సవ్యంగా ఉండడం లేదనిపించినప్పుడు మీలో సమస్యపట్ల తగినంత సహనం. ఆత్మ పరిశీలన అవసరం. మొట్టమొదటగా మిమ్మల్ని బాధపెడుతున్న ఒంటరి తనం ఎలా సంభవించిందో దాన్ని గురించి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఉదాహరణకు సంతోషంగా జీవిస్తున్న కుటుంబంలోని సభ్యలు చాలా చురుకైన సాంఘిక జీవితాన్ని గడుపుతారు.

మీలో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారనుకోండి మీ చుట్టూ మిమ్మల్ని స్వీకరించగల వ్యక్తులు చాలామందే ఉంటారు. అది గ్రహిస్తే మీరు ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ కుటుంబ సభ్యలు, మిత్రులు మిమ్మల్ని గౌరవంగా స్వీకరించినా మీలో మీరు ఇంకా ఒంటరిగానే ఫీలవుతున్నారా? మీ ఒంటరితనానికి ఇదో కారణం అయి ఉండవచ్చు.

మీరు ఎక్కడకు వెళ్లినా! అందరూ మీ పట్ల మంచిగా నడుచుకోవాలనీ, మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించి గౌరవించాలనీ, తమతమ అభిప్రాయాలను, సానుభూతినీ, ప్రశంసనూ మీకు అందజేయాలని ఆశిస్తూ మీరు గొప్ప ఒంటరితనానికి గురైనారని తేల్చి చెప్పవచ్చు. అయితే ఈ ప్రపంచం కఠినమైనదనీ, అంత తేలిగ్గా ఎవరినీ ఆకాశానికి ఎత్తుతూ పొగడదనీ మీరు గ్రహించాలి. చాలామంది ఏ చిన్న విమర్శకైనా విపరీతంగా ఫీలైపోయి తమలో తాము తాబేళ్లుగా ముడుచుకుపోతుంటారు. ఈ సమాజంలో ఎన్నో రకాల మనస్తత్వాలుగల మనుషులు కోకొల్లలుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మునుషులు తమ తమ దైనందిన కార్యక్రమాలలో బీజీగా ఉంటారు. వారి వారి సమస్యలతో సతమతమవుతుంటారు. అంతమాత్రాన వారు మిమ్మల్ని గౌరవించటం లేదని భావిస్తే అది మీ తప్పు.

వాస్తవాన్ని అంగీకరించడం గురైన మనస్తత్వానికి నిదర్శనం. వాస్తవాన్ని గ్రహించి ప్రవర్తించేవారికి ఒంటరితనం పెద్ద సమస్యేకాదు. ఎవరైనా బాగా దగ్గరివారు లేదా బాగా ప్రేమించేవారో పోయారనుకోండి. అప్పుడు మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. పెద్ద వయస్సు తమ జీవిత భాగస్వామిని కోల్పోయినవారు తము అందరిలో నుండి వేరు చేయబడ్డామని, ఎవరూ తమను అర్థం చేసుకునేవారు లేరని, తమపట్ల ఎవరూ సానుభూతి చూపించటంలేదని, విపరీతమైన భావనకు గురై ఒంటరిగా కుమిలిపోతుంటారు. మిమ్మల్ని మీరు ఇష్టపడటం కంటే ఇతరుల్ని మీరు ఇష్టపడటం ప్రారంభించండి. ఇతరులు ఇష్టపడే దానిని ఆసక్తితో చేస్తే మీ కిష్టమైన అభిరుచులతో వారిని మెప్పిస్తూ ఇతరులతో కలసి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మీ ఒంటరితనం కూడా ఒక వరంగా పరిణమించి, మీలో గొప్ప భావుకత్వం వుంటే మంచి కవిగానో, రచయితగానో, మిమర్శకుడిగానో రాణించవచ్చు.

ఒంటరితనం పోవాలంటే
ఎటుచూసినా జనం. కానీ, అంత మందిలోనూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులు చెబుతున్న సూచనలు...
* వృద్ధాశ్రమాలూ అనాథ శరణాలయాలను సందర్శించి అక్కడి వారితో మాట కలపండి. శక్తిమేరకు సాయం చేయండి.
* నలుగురిలో ఉన్నపుడు మాట్లాడటం కన్నా వినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. మాటతీరు సౌమ్యంగా ఉండేలా చూసుకోండి. విమర్శలు, వ్యంగ్యాలతో స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది.
* సంగీతం, ఆటలు, స్టాంపుల సేకరణ... ఇలా ఏదో ఒక కొత్త అలవాటుకు సమయం కేటాయించండి. స్ఫూర్తినిచ్చే సూక్తులు, జోకులు, కవితలు లాంటివి సేకరించండి.
* మంచి పుస్తకాలు విలువైన స్నేహితులు. ఒంటరితనాన్ని దూరంచేసే సాధనాల్లో పుస్తక పఠనం ఒకటి. రచన కూడా ఒంటరితనానికి విరుగుడు.
  • ================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.