Friday, August 19, 2011

డాక్టర్లు-రోగుల సత్సంబంధాలు , Doctor patient Relationship



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డాక్టర్లు-రోగుల సత్సంబంధాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



--రోగులు వైద్యులను ఎంతో ఉన్నతంగా భావిం చుకుంటూ ఉంటారు. తమకు సంబంధించిన ఆరోగ్య సమస్యలనే కాకుండా, కుటుంబ పరమైన సమస్యలు తమకు చికిత్స చేస్తున్న వైద్యుడితో చర్చించి, తగిన సలహాలు, సూచనలు కోరుకునే వారు. ఫలితంగా ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో వైద్యులు కూడా ఆయా కుటుంబాలలో ఒక వ్యక్తిగా ఉండి, వారికి కావలసిన మనోబలాన్ని చేకూరుస్తూ, తగిన సలహాలు అందించేవాడు.

అయితే వైద్యరంగంలో వస్తున్న అధునాతన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వైద్యులు ఒక ప్రత్యేక రంగంలో నైపుణ్యం సాధించడం మొదలైంది. దీనితో రోగి శరీరాన్ని మొత్తంగా కాక, ఒక అవయవానికి సంబంధించిన వ్యాధులకు మాత్రమే చికిత్స చేసే సూపర్‌ స్పెషలిస్టులు రూపొందుతున్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు - ఇలా ఏ అవయవానికి సంబంధించిన వ్యాధులకు ఆయా రంగాలలో నిష్ణాతులైనవారు చికిత్స చేస్తున్నారు. ఫలితంగా రోగిని ఒక వ్యక్తిగా పరిశీలించి, పరీక్షించే అవకాశం సన్నగిల్లడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రోగి తన వ్యాధి గురించిన భయాందోళనలతో మానసికంగా కృంగిపోతున్నాడు.

వైద్యుడిపట్ల, చికిత్స పట్ల రోగికి విశ్వాసం ఉండటమనేది చికిత్సలో ఔషధాలలాగే ఎంతో ముఖ్యమైనది. ప్రజల విశ్వాసం కారణంగానే వారికి కలిగే కొన్ని చిన్న చిన్న సమస్యలకు, ముఖ్యంగా ఆందోళన, మంద్రస్థాయిలోని కృంగుబాటు మొదలైన ఆరోగ్య సమస్యలకు ఉత్తమ చికిత్సలు చేసే వ్యక్తులుగా బాబాలు, స్వామీజీలు గుర్తింపు పొందుతున్నారు. అయితే తీవ్రస్థాయిలోని వ్యాధుల విషయంలో ఔషధాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను మూడు రకాలుగా విభజించవచ్చు.

మొదటి రకానికి చెందిన వ్యక్తి తన అనారోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ డాక్టర్‌ భుజస్కంధాలపైనే పెట్టి నిశ్చింతగా ఉంటాడు. ఇటువంటి వారు తాము చెప్పేదంతా డాక్టర్‌ పూర్తిగా వినాలనీ, తమపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపించాలనీ భావిస్తారు. టెస్టుల పేరిట ఎక్కువ డబ్బు ఖర్చు చేయించకూడదని అనుకుంటారు. తాము ఏం చేయాలనే విషయం డాక్టరే చెప్పాలని వారు భావిస్తారు.

రెండవ రకానికి చెందిన వారు డాక్టర్‌తో తమ అనారోగ్యాన్ని గురించి చర్చించాలనుకుంటారు. డాక్టర్‌ తమ అనారోగ్యం గురించి వివరించాలని భావిస్తారు. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. తమ వ్యాధికి సంబంధించిన చికిత్సలేమిటి? నివారణ పద్ధతులు ఏమిటనే విషయాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకుంటారు. తదనుగుణంగా చికిత్స తీసుకుంటారు.


మూడవ రకానికి చెందిన వారు తమకు ఏది కావాలో ముందే నిర్ణయించుకుని ఆ ప్రకారంగా డాక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఫలానా మందులు రాయమని, ఫలానా టెస్టులు చేయించమని అడుగుతారు. అంతే తప్ప డాక్టర్‌ చెప్పే విషయాలను వినరు. ఆసుపత్రులకో, క్లినిక్‌లకో వెళ్లే రోగులను పరిశీలిస్తే వారు ఏ రకానికి చెందిన వ్యక్తులనేది తెలిసిపోతుంది.

కొంతమంది డాక్టర్‌ తమను పిలిచే వరకూ మౌనంగా ఒక చోట కూర్చుంటారు. అక్కడ ఉన్న పేపర్‌నో, మ్యాగజైన్‌నో చదువుకుంటూ ఉంటారు. లేదా అక్కడ గోడలపై ఉన్న పోస్టర్లను, ఛార్ట్‌లను చూస్తూ గడుపుతారు. కొంతమంది చాలా అసహనంగా కనిపిస్తారు. వాళ్లు తాము ఎంతో ప్రాముఖ్యతగలిగిన వ్యక్తులమని, తమకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరీక్షించి పంపేయాలనీ ఆశిస్తారు. తమకు తెలిసిన ఉన్నత హోదా కలిగిన వ్యక్తుల పేర్లు ఉటంకిస్తూ, తమ గొప్పదనాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు. డాక్టరు మరొక రోగితో మాట్లాడుతున్నారన్నా కొంచెం సేపు కూడా వేచి ఉండటానికి ఇష్టపడరు. కొంతమంది తమ సమస్యకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలూ, సూచనలు డాక్టర్లు చెప్పినప్పుడు సరే అంటూ తలూపుతారు. తిరిగి తమకు ఏవేవో అనుమానాలు న్నాయంటూ మాటిమాటికీ డాక్టర్లకు ఫోన్‌ చేస్తుంటారు. అనుమానాలు తీర్చుకోవడం మంచిదే అయినా, ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే, ఉదయంనుంచి సాయంత్రం వరకూ ఇటువంటి రోగులకు సమాధానాలు చెబుతూ ఉండటం వలన ఇతర రోగులపై శ్రద్ధ చూపడం, వారికి న్యాయం చేయడం కష్టమవుతుంది.

ఇలా అనేక రకాల వ్యక్తులు తమ ఆరోగ్య పరి రక్షణ కోసం ఆసుపత్రులకు, క్లినిక్‌లకు వస్తున్నప్పుడు అసలు డాక్టర్లకు, రోగులకు మధ్య సంబంధాల ప్రాముఖ్యత ఏమిటనే మౌలిక ప్రశ్న ఉదయిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ డాక్టర్‌ అనే వ్యక్తి ఆ చుట్టుప్రక్కల కుటుంబాల వారికందరకూ ఒక మార్గదర్శిగా, సలహాదారుగా, కుటుంబంలోని వ్యక్తిగా మసలుకునేవాడు. ఆయా కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా తప్పని సరిగా హాజరయ్యేవాడు. ఆయా కుటుంబాల సభ్యులందరినీ పేరుపేరునా గుర్తిస్తూ, వారి ఆరోగ్య విషయాలే కాక, వారి పూర్వీకుల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తెలుసుకునేవాడు. కేవలం చికిత్స చేసే ఒక 'వృత్తిదారుగా కాకుండా, ఇతరత్రా కూడా ఆయా కుటుంబ సభ్యుల మంచిచెడూ కూడా చూసే వ్యక్తిగా డాక్టర్‌ను భావించేవారు.

ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్క అవయవం కోసం ఒక్కొక్క డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డాక్టర్లు, రోగుల మధ్య సంబంధాలు వ్యాధులు, ఔషధాలకు మాత్రమే పరిమితమైపోయింది. దీనితో రోగికి డాక్టర్‌పై విశ్వాసం సన్నగిల్లడం, వరుసగా డాక్టర్లను మారుస్తూ రావడం జరుగుతోంది. ఇది రోగి మనస్సుపై ఎంతో ప్రభావం చూపి చివరకు డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులకు దారి తీస్తోంది. డాక్టర్లు రోగుల మధ్య సత్సంబంధాలు ఉండటం, డాక్టర్లపై విశ్వాసం, నమ్మకం కలగడమనేవి చికిత్సలో ముఖ్యమైన అంశాలు. మానసిక వ్యాధిగ్రస్తుల విషయంలో ఇది మరీ ప్రధానమైనది.

  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.