Saturday, April 30, 2011

డయాబెటిక్‌ ఫుట్‌ , Diabetic Foot



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డయాబెటిక్‌ ఫుట్(Diabetic Foot)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మధుమేహం ఉన్నప్పుడు పాదాలను గాజుకాయలా చూసుకోవాలి. కానీ చాలా మంది 'నాకెందుకు వస్తుందిలే'.. 'ఇన్నేళ్ల నుంచీ నాకు ఏ ఇబ్బందీలేదు.. ఇక ముందూ రాదు' అన్న ధీమాతో ఉంటారు. నిర్లక్ష్యం చేస్తారు. అంటే చేజేతులారా సమస్యను కొనితెచ్చుకోవటమే. ఒక సారి పుండుపడితే మానదు. కాబట్టి నాకే సమస్యా రాదన్న ధోరణి వదిలిపెట్టాలి. పాదాల సమస్య వచ్చే అవకాశముందని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యల్లో 50 శాతం చేతులారా కొని తెచ్చుకుంటున్నవేననీ, జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లు తీసేయడమనేది సగానికి సగం తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి తరచూ క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం ఎంత అవసరమో నిత్యం కాళ్లను పరిశీలించుకోవటం, సంరక్షణ చర్యలు తీసుకోవటం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి.

పదేళ్లకంటే ఎక్కువ కాలం మధుమేహం ఉన్నవారిలో సహజంగానే కాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా కాళ్లలోని నాడులు (నరాలు), తర్వాత కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. వీటికితోడు శరీరంలో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. ఈ మూడింటి ఫలితమే.. పాదాల సమస్యలు. వీటిని ఇంగ్లీషులో డయాబెటిక్‌ ఫుట్‌ అంటారు.

ఏం జరుగుతుంది?

కాళ్లలో నరాలు దెబ్బతినడం వల్ల పాదాలకు స్పర్శజ్ఞానం తగ్గుతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా చెబుతుంటారు. దూదిమీద స్తున్నట్టుందనీ,
ఇసుక మీద నడుస్తున్నట్టుందనీ, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని చెబుతుంటారు. రాత్రిపూట నిద్రలో కాళ్లు మంట మంటగా అనిపిస్తుండడం దీని ముఖ్య లక్షణం.

కాలి చెప్పు జారిపోతుండడం, గుండు సూదులు గుచ్చినట్లుండడం, తిమ్మిర్లు ఎక్కటం, చీమలు పాకుతున్నట్టు అనిపించడం. ఇవన్నీ పాదాల సమస్యలున్న వారు తరచూ
చెప్పేవే. మధుమేహ బాధితుల్లో నరాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు... నరం మీదుండే 'మైలిన్‌' అనే పూత, నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే 'యాక్సోప్లాజమ్‌' పదార్థం పోవడం. దీని వల్లే సంకేతాలకు అంతరాయం ఏర్పడుతుంది. నరాలు పనిచేయడానికి శక్తి అవసరం. అందుకు ప్రతీ నరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలుంటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల నాడులు సమర్థవంతంగా పనిచేయవు. ఫలితంగా కాళ్లకు స్పర్శ తగ్గుతుంది. ఇక దెబ్బ తగిలినా సరే దాని తీవ్రతా, బాధా రోగికి తెలియదు. దీంతో అశ్రద్ధ చేస్తారు. పదేళ్లకు పైబడి మధుమేహం ఉంటే (నియంత్రణలో ఉన్నా సరే) రక్తంలో కొవ్వు పదార్థం, చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు సన్నబడతాయి. దీనికి తోడు రక్తనాళాల గోడలకు కొవ్వు పేరుకుని, కాళ్లకు రక్తప్రసారం తగ్గుతుంది.

దీర్ఘకాలంపాటు రక్తంలో ఉండిపోయే చక్కెర వివిధ నాళాలతో, కణజాలంతో చర్యజరిపి, వాటిని దెబ్బతీస్తుంది. దీన్ని అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ప్రోడక్ట్స్‌ అంటారు. వీటికి తోడు
రక్తాన్ని పంపింగ్‌ చేసే గుండెకు కాళ్లు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి కాళ్లకు అందే పరిమాణం తగ్గుతుంది. ఇవన్నీ కలిసి సమస్యను జటిలం చేస్తాయి.

ముందే ఎలా గుర్తిస్తాం ?

కాళ్లలో రక్తప్రసారం తగ్గుతోందా? అన్న విషయాన్ని ముందే గుర్తించొచ్చు. దీనికి చీలమండల దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ, మోచేతి కీలు దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ
కొలవాలి. చేతుల్లో ఉండే రక్తపోటు కంటే కాళ్లలో ఉండే రక్తపోటు తగ్గకూడదు. దీన్ని కోలవడానికి 'డాప్లర్‌' అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. దీంతో రక్తనాళాల్లోని పీడనం, రక్తం వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది లేకపోతే డాక్టర్ల దగ్గరుండే సాధారణ రక్తపోటు మిషన్ల సహాయంతో కూడా కొలవచ్చు. ఏటా డాప్లర్‌ పరీక్ష చేయించుకుంటూ, రక్తప్రసారం

తగ్గుతున్న విషయాన్ని ముందే గుర్తిస్తే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి, నివారణ చర్యలు తీసుకోవచ్చు. డయాబెటిస్‌ రోగుల
శరీరంపై పుండు పడి, త్వరగా మానకుంటే అది నయమ్యే వరకూ ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడం మేలు. దీంతో గాయం త్వరగా మానుతుంది. గాయమైనప్పుడు విశ్రాంతి
కోసం కదలకుండా ఉండాలి. కాబట్టి శరీరంలో షుగర్‌ స్థాయి పెరుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తగిన మోతాదులో ఇన్సులిన్‌ తీసుకోవడం మేలు. పుండు మానిన తర్వాత పరిస్థితిని బట్టి డాక్టరు సలహా మేరకు కొందరు మళ్లీ బిళ్లలు వాడొచ్చు.

ప్రత్యేక చెప్పుల అవసరం ఏమిటి?

మధుమేహం దీర్ఘకాలం ఉన్నప్పుడు పాదాలపైన చర్మం ఉల్లిపొరలా, పల్చగా తయారవుతుంది. పైగా కాళ్లకు స్పర్శ సరిగ్గా తెలియదు. కాబట్టి పాదానికి రక్షణ అవసరం. సాధారణ చెప్పులు ఈ పనిని సమర్థవంతంగా చేయలేవు. మధుమేహ బాధితుల కోసం ఎటువంటి పాదరక్షలు నిజమైన రక్షణను ఇస్తాయనే అంశంపై పరిశోధనలు జరిగాయి. ప్రత్యేక మెటిరీయల్‌తో తయారు చేసిన చెప్పులు మధుమేహ రోగులకు ఎంతో తోడ్పడతాయిని వెల్లడైంది.

చాలా మంది తమ సైజు చెప్పులు లేకున్నా కూడా వేసుకుంటారు. చెప్పుల్లో తేడా ఉంటే పెద్దగా పట్టించుకోరు. సర్దుకుపోతారు. దీని వల్ల మామూలు వారికి నష్టం లేదోమోగానీ, 'డయాబెటిక్‌ ఫుట్‌' ఉన్నవాళ్లకు సమస్యే. మధుమేహం ఉన్నవాళ్లు తమకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సున్నితమైన చెప్పులు వాడడమే మంచిది. ఈ
చెప్పులు..పాదం మీద ఒకచోటే ఒత్తిడి పడకుండా అన్ని వైపులా సమానంగా పడేలా తయారు చేస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ చెప్పుల్లో మూడు భాగాలుంటాయి. కింద- తేలికైన, దృఢమైన పియు (పాలియురెథేన్‌) సోల్‌ వాడుతున్నారు. దీని వల్ల మేకులు, ముళ్ల వంటివి దిగే అవకాశం లేదు. రెండోది- మన పాదం చెప్పుకు ఆనుకునే
కింది భాగంలో మైక్రోసెల్‌ పాలిమర్‌, మైక్రోసెల్‌ రబ్బర్‌ 'ఇన్‌సర్ట్‌' పెడుతున్నారు. దీని వల్ల పాదంపై ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఈ ఇన్‌స్టర్‌ను మామూలు చెప్పుల్లో పెట్టుకుంటారు. కానీ అది స్లిప్‌ అయిపోతుంది. మూడోది- లెదర్‌గానీ, కుట్లుగానీ పాదానికి తగలకుండా పైనంతా 'క్రాస్‌లింక్‌ పాలిమర్‌ షీట్‌'తో లైనింగ్‌ ఇస్తున్నారు. దీంతో పాదానికి పైనా, కిందా కూడా ఎక్కడా రాపిడి, గరుకుదనం తగలవు. మన అరికాళ్లల్లో ఒకపక్క గొయ్యిలా ఉండే ప్రాంతం ఉంటుంది కదా.. దానికి సపోర్టుగా కింది నుంచి ఉబ్బెత్తుగా 'ఆర్చ్‌' ఇస్తున్నాం. దీనివల్ల మడమ మీద ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న చాలా మంది వృద్ధుల్లో తరచూ కాళ్లు కొద్దిగా వాస్తుంటాయి. అలాంటప్పుడు చెప్పులు నొక్కుకుపోయి, పుళ్లు పడుతుంటాయి. అందుకని చెప్పులు పైన వదులు చేసుకోవడానికి వీలుగా 'వెల్‌క్రో స్ట్రిప్స్‌' ఇస్తున్నారు. వీటి సైజు పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. ఈ చెప్పులతో వాకింగ్‌ చేయవచ్చు. ఒక వేళ పుండుపడితే ఆ పుండు చెప్పుకు తగలకుండా, ఆ ప్రాంతంలో మెత్తటి 'సిలిపోస్‌' మెటీరియల్‌ను ఉంచుతున్నారు. ఇది నునుపుగా ఉండి, పుండుపై నేరుగా ఒత్తిడి పడనివ్వదు. డయాబెటిక్‌ చెప్పులు చెమట పీల్చకపోవడమే ఉత్తమం. ఎందుకంటే చెమట పీల్చుకుంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత ఏ చిన్న దెబ్బతగిలినా అది గాయంలో చేరి ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తుంది. అందుకని చెమట పీల్చుకోనివే మంచివి.

పుండుపడకుండా ఏం చేయాలి?

* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

* కాళ్లను, పాదాలను రోజూ రెండు పూట్లా శుభ్రంగా కడుక్కోవాలి. కాలి వేళ్ల మధ్య, అరికాళ్లు కూడా జాగ్రత్తగా కడుక్కోవాలి.

* కడిగిన తర్వాత ఏమాత్రం తేమ లేకుండా తుడుచుకోవాలి. పొడిగా ఉండడానికి పౌడర్‌ రాసుకోవడం మంచిది.

* సాక్స్‌ వేసుకునే వాళ్లయితే నైలాన్‌వి వేసుకోవద్దు. కాటన్‌ మేజోళ్లే వాడాలి.

చెప్పులకూ, పాదానికి మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు వంటివి బయటకు రాకుండా రోజూ పరిశీలించాలి.

* మడమపై ఒత్తిడి పెంచే చెప్పులు వేసుకోవద్దు. మధుమేహ బాధితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను వాడడం మంచిది.

* పాదానికి ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయక, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

* చెప్పులు లేకుండా నడవొద్దు. మట్టి రోడ్లు, పొలాల గట్లు, పంటచేలలో కూడా చెప్పులు వేసుకోవాలి.

* కాలి గోళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కట్‌ చేసుకోవాలి.

*బస్సులు, కార్లలో ఎక్కువసేపు కూర్చుని ప్రయాణం చేయడం వల్ల కాళ్లలో నీరు చేరి ఉబ్బుతాయి. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చుని

ప్రయాణాలు చేయకూడదు.

* రోజూ టబ్బులో గోరువెచ్చని నీళ్లుపోసి, దానిలో 'బిటడిన్‌ సొల్యూషన్‌' కలపాలి. ఆ నీళ్లలో ఇరవై నిమిషాలు కాళ్లు పెట్టుకుని కూర్చుని, తర్వాత పొడిబారేలా

తుడుచుకోవాలి. వేళ్ల మధ్య పౌడర్‌ అద్దాలి. గాయం ఉంటే వదులుగా కట్టుకట్టాలి.

పుండుపడితే ఏం చేయాలి?

* డయాబెటిక్‌ ఫుట్‌ సమస్య ఉన్నవారికి కాలి మీద పుండు పడితే... పాదానికి విశ్రాంతి కల్పించాలి. చాలా మంది పుండు పడిన తర్వాత మధుమేహాన్ని

తగ్గించుకునేందుకు వ్యాయామం పేరిట సరైన చెప్పులు లేకుండా నడక ప్రారంభిస్తారు. అలా చేస్తే పుండు మరింత పెరిగి పెద్దది అవుతుంది.

* కాలి రక్తనాళాలు దెబ్బతిని, రక్తప్రసారం సరిగా ఉండదు. కాబట్టి నోటి ద్వారా, లేదా ఇంజక్షన్‌ ద్వారా తీసుకునే మందు గాయం వరకు చేరుతుందో లేదో అనుమానమే !

కాబట్టి కాలికి విశ్రాంతిచ్చి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.

* గాయాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. 'సెలైన్‌'తో కడగడం ఉత్తమం. లేకపోతే మరగకాచి, చల్లార్చిన గోరువెచ్చటి నీటిలో చాలా కొద్దిగా (0.9 శాతం) ఉప్పు కలిపి దాంతో కడగవచ్చు. ఈ నీళ్లలో ద్రావకాలేవీ కలపకూడదు.

* కడిగిన తర్వాత తేమ లేకుండా దూదితో అద్దాలి. దానిపైన ఏదైనా పౌడర్‌ చల్లితే చెమట పీల్చుకుంటుంది. తేమ మిగిలిపోతే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

* కట్టు కొద్దిగా వదులుగా కట్టాలి. పుండుకు ఎండ తగలనిస్తే త్వరగా మానే అవకాశాలుంటాయి. దుమ్ము పడకుండా, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* రోజూ డాక్టరు దగ్గరకు వెళ్లడం కష్టం కాబట్టి. ఎవరికి వారే కట్టు కట్టుకోవటం నేర్చుకోవాలి. తరచూ డాక్టర్‌కు చూపించడం అవసరం.

* పుండ్ల విషయంలో సాధారణ ఆరోగ్యవంతులకు చేసే చికిత్స వేరు. మధుమేహం ఉన్న వారికి చేసే చికిత్స వేరు.

* గాయంపై స్పిరిట్‌ వేయకూడదు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కూడా వేయకూడదు. అంతగా వేయాల్సి వస్తే బాగా పల్చన చేసి వేయాలి.

* కొంత మంది బోరిక్‌ యాసిడ్‌, టార్టారిక్‌ యాసిడ్‌ పౌడర్‌ను గ్లిజరిన్‌తో కలిపి పేస్టులా చేసి పుండుమీద కట్టుకడతారు. దీని వల్ల పుండు ఆరోగ్యవంతమైన కణజాలంతో, ఎర్రగా తయారవుతుంది గానీ, ఆ మర్నాటికే అది నల్లగా డెడ్‌ టిష్యుగా మారిపోతుంది. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది.

* చీము ఉన్నా నొక్కటానికీ, సూదితో గుచ్చటానికీ, 'కట్‌' చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఇన్‌ఫెక్షన్‌ పైపైకి వ్యాపిస్తూ గాయం మోకాలికి పాకుతుంది. పాదాన్ని, కాలును పైపైకి తొలుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక గ్యాంగ్రీన్‌ ఏర్పడిందంటే సమస్య మరీ తీవ్రం. కాబట్టి మరీ అవసరమైతే రక్తప్రసారానికీ మరో మార్గం ఏర్పాటు చేసి అప్పుడు కట్‌ చేయాలి.

* పుండు మానిన తర్వాత మళ్లీ కొత్త పుండు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పుండు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని వదలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని మూసివేయడం ద్వారా కూడా దాన్ని నియంత్రించొచ్చు. దీన్ని టోటల్‌ కాస్‌ థెరపీ అంటారు. దీని వల్ల నడవడానికి వీలుండదు. కాలిపై బరువు, ఒత్తిడి పడదు. పుండు త్వరగా మానుతుంది.
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.