Wednesday, February 23, 2011

మద్యంతో అనారోగ్యము,Alcoholism ill-health


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మద్యంతో అనారోగ్యము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే నిద్రపట్టక సతమతమయ్యే కొందరు పడుకునేముందు మద్యం తాగటాన్నీ అలవాటు చేసుకుంటుంటారు. కానీ ఇది నిద్రా సమయాన్ని తగ్గించటమే కాదు, నిద్రాభంగాన్ని కూడా కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తాగగానే నిద్ర పట్టేమాట నిజమే గానీ.. ఇది కొద్దిగంటలు మాత్రమే. ఆ తర్వాత వెంటనే మెలకువ వచ్చేస్తుంది. అలాగే పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు. ఈ దుష్ప్రభావాలు పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే అధికంగా ఉంటున్నట్టూ బయటపడింది. నిద్రపై మద్యం ప్రభావం అనే అంశంపై ఇటీవల మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. 20 ఏళ్ల యువతీ యువకులను ఎంచుకొని ముందురోజు మద్యం కలిపిన చల్లటి పానీయాన్ని తాగించారు. మర్నాడు ఆ పానీయంలో వాసన రావటానికి కేవలం కొన్ని చుక్కల మద్యం కలిపారు. అనంతరం వీరిని పరిశీలించగా.. వాళ్లు మద్యం తాగిన వెంటనే నిద్ర పోయినప్పటికీ ఆ తర్వాత చాలాసార్లు మేల్కొన్నట్టు గుర్తించారు. మగవారి కన్నా స్త్రీలు 19 నిమిషాల సేపు తక్కువ నిద్రపోయారు. కలత నిద్ర సమయం 4 శాతం పెరిగింది కూడా.



మద్యపానము వల్ల నష్టాలు అవగాహన,Alcohol habit and ill-health awareness



  • image : Courtesy with Eenadu news paper

ఒకప్పుడు తాగటం పెద్ద తప్పు. ఇప్పుడు అదే పెద్ద ఫ్యాషన్‌! కాలమాన పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు. దాంతో పాటు మన అలవాట్లూ మారిపోయి ఉండొచ్చు. కానీ మద్యం వల్ల సంప్రాప్తించే నష్టాలుగానీ.. శారీరకంగా మానసికంగా సామాజికంగా అది చేసే చేటుగానీ ఏమాత్రం మారలేదు.. మారదు కూడా! ఎందుకంటే మద్యం మనిషికి శత్రువు. మన ఆరోగ్యానికి శత్రువు. మన శరీరంలోని చాలా అవయవాలకు శత్రువు. ముందు మద్యం మనం తాగుతున్నామనుకుంటాం. కానీ ఒక దశకు చేరిన తర్వాత అది మనల్ని మింగేయటం ఆరంభిస్తుంది. ఒళ్లంతా కబళించటం మొదలుపెడుతుంది. ఈ అవగాహన పెరిగితే.. కొందరైనా మద్యానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారన్న ఆశ.


ఇటీవలే 'మద్యం'పై వైద్యపరంగా ఓ విస్తృతమైన అధ్యయనం జరిగింది. మద్యానికి బానిసలైన వేలాది మందిని పరిశీలిస్తే- సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే వీరిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. శారీరక రుగ్మతలు, జబ్బులన్నింటినీ వేరు చేసి చూస్తే.. చివరికి వీరిలో మరణానికి 'మద్యం' అతి ముఖ్యకారణంగా నిలుస్తోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాల్లో 4%, అన్ని జబ్బుల్లో 5%.. కేవలం ఆల్కహాల్‌ వల్ల సంప్రాప్తిస్తున్నవే. దీన్నిబట్టి అర్థమయ్యేదేమంటే- ఎంత తక్కువ తాగితే అంత మంచిదని! కానీ మన దేశంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

దేశంలో మద్యం వినియోగం ఏటా 30% శాతం పెరుగుతోందని గొప్పగా చెప్పుకొంటున్నాం. 2015 నాటికి దేశంలో 1,900 కోట్ల లీటర్ల మద్యం వినియోగమవుతుందని, ఈ మద్యం మార్కెట్‌ 1.4 లక్షల కోట్లకు చేరుతుందని ఘనంగా లెక్కలేస్తున్నాం. సామాజిక అలవాట్లు, కట్టుబాట్లు మారిపోతూ మద్యం ప్రభావం నానాటికీ పెరిగిపోతుండటం ఏ ముప్పులకు దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు మితంగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు మంచిదన్న ప్రచారంతో దీన్నో సాకుగా తీసుకుని మందు గ్లాసు పట్టుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. కానీ మద్యం కొద్దిగా ఎక్కువైనా.. ఏ కొంచెం మితిమీరినా ఆరోగ్యం సంపూర్ణంగా దెబ్బతింటుంది. లివర్‌ ఒక్కటే కాదు.. శరీరంలోని దాదాపు అన్ని అవయవాలూ పడకేస్తాయి.. మనల్ని ముంచేస్తాయి!

  • కాలేయం (లివర్‌)
మద్యం తాగితే లివర్‌ చెడిపోతుందన్నది ఇప్పుడు చాలామందికి తెలిసిన విషయమే. కానీ దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియటం చాలా ముఖ్యం. మద్యం కారణంగా వచ్చే దీర్ఘకాలిక లివర్‌ వ్యాధిలో ప్రధానంగా నాలుగు దశలున్నాయి. వీటిలో సర్వసాధారణమైనది, కాలేయాన్ని ఓ మోస్తరుగా దెబ్బతీసేది- కొవ్వు పట్టటం! దీన్నే 'ఫ్యాటీ లివర్‌' అంటారు. ఈ సమస్యను అల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా తేలిగ్గానే గుర్తించొచ్చు. ఈ దశలో మద్యం మానేస్తే దెబ్బతిన్న లివర్‌ పూర్తి ఆరోగ్యంగా కోలుకునేలా కూడా చూడొచ్చు. ఈ దశలో కూడా ఇంకా తాగుతూనే ఉంటే.. దీర్ఘకాలిక వ్యాధులైన హెపటైటిస్‌, లివర్‌ సిరోసిస్‌ వంటివాటికి దారి తీస్తుంది. సిరోసిస్‌ అంటే- మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిపడిపోయి బుడిపెలు బుడిపెలుగా తయారై.. మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. ఇవే కాదు, పరిస్థితి లివర్‌ క్యాన్సర్‌కూ దారితియ్యచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది- లివర్‌ ఈ స్థితికి చేరితే ఇక ఎన్ని చికిత్సలు చేసినా అది కోలుకుని ఆరోగ్యంగా తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఈ లివర్‌ సిరోసిస్‌ కారణంగా పేగుల్లో రక్తస్రావం, పొట్టలో నీరు చేరటం (జలోదరం), కామెర్లు, మతి భ్రమణం వంటి సమస్యలూ ఎక్కువవుతాయి. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. అందుకే 'ఫ్యాటీ లివర్‌' సమస్య వచ్చిన తర్వాత కూడా ఇంకా తాగటమన్నది చాలా ప్రమాదకరమని గుర్తించాలి.

** మద్యానికి బానిసలైన ప్రతి 10 మందిలో కనీసం ఇద్దరికి ఎంతోకొంత లివర్‌ దెబ్బతినే ఉంటోంది.
** మద్యం మూలంగా లివర్‌ దెబ్బతినే రిస్కు స్త్రీలలో ఎక్కువ. అలాగే బరువెక్కువ ఉన్నవారు, స్థూలకాయుల్లో ఎక్కువ.
** మిగతా సమయాల్లో కంటే మద్యాన్ని కేవలం భోజన సమయంలో మాత్రమే తాగితే లివర్‌ దెబ్బతినే రిస్కు కొంత తక్కువని గుర్తించారు.

  • జీర్ణాశయం
ఎంత తాగితే జీర్ణ వ్యవస్థలో చికాకు అంత ఎక్కువవుతుంది. కొద్దిగా తాగినా.. అదిపెట్టే చికాకుతో జీర్ణాశయం ఆమ్లాన్ని (ఆసిడ్‌) ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనితో ఆమ్లం పైకి ఎగదన్నటమే (రిఫ్లెక్స్‌/అసిడిటీ)సమస్యలే కాదు.. జీర్ణాశయం పూత (గ్యాస్త్ట్రెటిస్‌) కూడా రావచ్చు. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు.. మరీ ఎక్కువగా తాగేవారిలో జీర్ణాశయంలో రక్తస్రావం కూడా అవ్వచ్చు. మద్యానికి బానిసై ఏళ్లపాటు తాగుతుండే వారిలో ఇది జీర్ణాశయం క్యాన్సర్‌కు కూడా దారితియ్యచ్చు. మద్యం తాగేవారిలో పేగుల్లో పుండ్లు (అల్సర్లు)పడే అవకాశమూ ఎక్కువే.బాగా తాగినప్పుడు వాంతి సాధారణమేగానీ.. వీటితోనూ తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరిగా స్పృహలో లేనప్పుడు వాంతి అయితే.. పొలమారినట్లే ఆ పదార్థం ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోవచ్చు. దగ్గుతో దాన్ని బయటకు తెప్పించలేకపోతే పరిస్థితి మరణానికి కూడా దారి తీస్తుంది. బలవంతంగా తోసుకొచ్చే వాంతులతో గొంతు చిట్లి రక్తం రావచ్చు. కొన్నిసార్లు అదీ తీవ్ర సమస్యలకు దారితియ్యచ్చు.

  • క్యాన్సర్లు
మితిమీరిన మద్యం.. లివర్‌ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌.. ఇలా చాలా క్యాన్సర్లకు ఇదే మూలం. ముఖ్యంగా నోరు, జీర్ణ అవయవాల్లో సంప్రాప్తించే క్యాన్సర్లకు- పొగ తర్వాత ఇదే అతి ముఖ్య కారణం. ఇక మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 20% వరకూ క్యాన్సర్ల రూపంలో సంప్రాప్తిస్తున్నవే. పట్టణ ప్రాంతాల్లో స్త్రీలు, యువతుల్లో మద్యం అలవాటు పెరుగుతోంది, దీనితో పాటే రొమ్ము క్యాన్సర్‌ కేసులూ పెరుగుతుండటం గమనించాల్సిన అంశం. ఇప్పటికే హెపటైటిస్‌-బి, సి వంటివి ఉన్నవారు మద్యం తీసుకుంటుంటే వారిలో లివర్‌ క్యాన్సర్‌ ముప్పు మరీ పెరుగుతోంది. ఒంట్లో ఈ వైరస్‌లున్న ప్రతి ఐదుగురిలో ఒకరు క్రమేపీ సిరోసిస్‌, లివర్‌ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. ఇక రోజూ తాగే ప్రతి రెండు యూనిట్ల మద్యంతో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు 8% వరకూ పెరుగుతోందని అధ్యయనాల్లో గుర్తించారు.

  • క్లోమం (పాంక్రియాస్‌)
క్లోమం అనేది మన జీర్ణప్రక్రియకు అత్యంత కీలకమైన ఎంజైములను, రక్తంలో గ్లూకోజును నియంత్రించేందుకు అవసరమైన హార్మోన్లను స్రవించే ముఖ్యమైన గ్రంథి. చాలామందికి ఇది ప్రాణాంతక సమస్యలను తెచ్చిపెట్టే వరకూ కూడా.. అసలు మన శరీరంలో ఇలాంటి గ్రంథి ఒకటి ఉందన్న విషయం కూడా తెలియదు. అతిగా మద్యం తాగటం వల్లఈ క్లోమ గ్రంథి వాచిపోయి.. ఇందులోని కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది, దీన్నే 'పాంక్రియాటైటిస్‌' అంటారు. ఇది ఉన్నట్టుండి ఉద్ధృతంగా (అక్యూట్‌) రావచ్చు, లేదంటే క్లోమం ఎప్పుడూ వాచే ఉండి.. దీర్ఘకాలికం (క్రానిక్‌)గా కూడా వేధించొచ్చు. ఇది ఉద్ధృతంగా (అక్యూట్‌) వచ్చినప్పుడు కొంతమందిలో కీలక అవయవాలు విఫలమైపోవటం, క్లోమం క్షీణించిపోవటం (నెక్రోసిస్‌), దాని మీద చీముగడ్డలు(ఆబ్సెస్‌),
నీటితిత్తులు(సిస్ట్‌లు) రావటం వంటి తీవ్రస్థాయి ప్రమాదాలూ ముంచుకొస్తాయి. కొద్దిమందిలో ఎన్ని చికిత్సలు చేసినా సమస్య ప్రాణాంతకంగా కూడా తయారవుతుంటుంది. మరికొందరిలో ఈ ఉద్ధృతమైన వాపు తరచూ వస్తూ.. దీర్ఘకాలిక వ్యాధిగా కూడా తయారవచ్చు. దీనివల్ల భరించరాని తీవ్రమైన కడుపునొప్పి, కొవ్వులు జీర్ణం కాకపోవటం, బరువు తగ్గిపోవటం, విరేచనాల వంటి బాధలు వేధిస్తాయి. ఈ సమస్యలు దీర్ఘకాలం ఉండేవారిలో క్లోమానికి క్యాన్సర్‌ కూడా రావచ్చు. ఇన్ని సమస్యలకు మితిమీరిన మద్యం కారణం కావచ్చన్న విషయం మర్చిపోకూడదు.

  • ఎంత తాగితే ఎక్కువ?
మద్యం ఎన్నో ఆరోగ్య, సామాజిక సమస్యలకు మూలం కాబట్టి ఎవరైనా అస్సలు మద్యం తాగకపోవటం ఉత్తమం. మరీ తప్పనిసరి అయితే- శుద్ధ ఆల్కహాల్‌ రోజుకు 3 యూనిట్లకు మించకుండా తాగాలి. ఇదేమిటో వివరంగా చూద్దాం. 10 మిల్లీ లీటర్లు లేదా 8 గ్రాముల శుద్ధ ఆల్కహాల్‌ను ఒక 'ఆల్కహాల్‌ యూనిట్‌'గా పరిగణిస్తారు. ఇది విస్కీ అయితే 25 మి.లీ., బీర్‌ అయితే ఒక పింట్‌లో మూడో వంతు, రెడ్‌వైన్‌ అయితే ఒక గ్లాసులో (175 ఎంఎల్‌) సగానికి సమానం. అంటే విస్కీ 75 మి.లీ., లేదా బీర్‌ అయితే ఒక పింట్‌ (సుమారు అరలీటరు), లేదా రెడ్‌వైన్‌ ఒకటిన్నర గ్లాసు మించకుండా చూసుకోవాలి. అంతకు మించితే మద్యానికి సంబంధించిన తీవ్రస్థాయి సమస్యలను వేగంగా రమ్మని చేజేతులారా ఆహ్వానిస్తున్నట్టే!

  • ప్రశాంతత.. ఓ భ్రమ!
చాలామంది తాగితే 'హాయిగా' ఉంటుందని, ఆందోళనలన్నీ తగ్గిపోతాయనీ, ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంటుందని, బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుందనీ.. ఇలా రకరకాల కారణాలతో తాగుతుంటారు. ఇక్కడ మర్చిపోతున్న అంశమేమంటే- ఎక్కువగా తాగేవారిలో వ్యసనాలే కాదు, మానసిక
సమస్యలు, వ్యాధులు కూడా ఎక్కువే. దీర్ఘకాలం మద్యం తాగటం వల్ల మెదడులోని రసాయనాల్లో మార్పులు వస్తాయి. అతిగా తాగేవారిలో ఆందోళన, కుంగుబాటు చాలా ఎక్కువ. ఆత్మహత్య భావనలు, తమకు తాము హాని చేసుకోవటం వంటివీ ఎక్కువే. కొన్ని వారాల పాటు మితిమీరి తాగుతుంటే మానసిక భ్రాంతులు, ఎవరో మనకు హాని చేయబోతున్నారన్న భ్రమల వంటివి (సైకోసిస్‌) పెరుగుతాయి. అతిగా తాగే అలవాటున్న వారు ఒక్కసారిగా మానేసినా.. తీవ్రస్థాయి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. మద్యం వల్ల జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా మెదడు 18, 19 ఏళ్ల వరకూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ వయసులో మద్యానికి బానిసైతే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

  • వూబకాయం
మద్యం ద్వారా చాలా క్యాలరీల శక్తి అదనంగా వస్తుంది, కానీ ఇది అనారోగ్య హేతువు! పోషకాహారం ద్వారా వచ్చే శక్తికి పోషకవిలువ ఉంటుందిగానీ దీనికి అదేం ఉండదు. అందుకే ఈ రకంగా వచ్చే శక్తిని 'ఎంప్టీ క్యాలరీస్‌' అంటారు. రెండోది- ఓ మోస్తరుగా తాగేవారు సగటున నెలకు 2,000 వరకూ అదనంగా క్యాలరీలను తీసుకుంటారని అంచనా. వైన్‌, బీరు వంటివన్నీ కూడా దాదాపు పిండి పదార్థాలు, చక్కెరలను పులియబెట్టటం ద్వారా తయారయ్యేవే. చక్కెరలు ఎక్కువ కాబట్టి వీటి ద్వారా క్యాలరీలూ ఎక్కువే వస్తాయి. కొన్నింటిలో దాదాపు ఇది కొవ్వులతో సరిసమానంగా కూడా ఉంటుంది. పైగా మద్యంతో పాటేనంజుకోవటానికి చికెన్‌ 65, జీడిపప్పు, వేయించిన చేప ముక్కల్లాంటి కొవ్వులు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ కూడా తినాలనిపిస్తుంది. వీటివల్లా క్యాలరీలు ఎక్కవ వస్తాయి. వీటన్నింటివల్లా వూబకాయం పెరిగిపోవటం తథ్యం. ఎన్ని వ్యాయామాలు చేసినా ఈ క్యాలరీలన్నీ ఖర్చవటం కష్టం, ఫలితంగా వూబకాయం, దానితో పాటే హైబీపీ, మధుమేహం, గుండెజబ్బులు, మోకాళ్లు అరిగిపోవటం వంటివన్నీ తయారవుతాయి.

  • మందులు
మద్యం ప్రభావం మనం తీసుకునే ఇతరత్రా మందుల మీదా ఉంటుంది. ముఖ్యంగా నిద్ర పట్టేందుకు ఇచ్చే డైజీపాం వంటివి, కుంగుబాటు తగ్గేందుకు ఇచ్చే ప్రొజాక్‌/ఫ్లుఆక్సిటిన్‌ వంటివి తీసుకునే వారు మద్యం జోలికి వెళ్లకూడదు. అలాగే మూర్ఛ, మధుమేహం వంటివాటికి దీర్ఘకాలం మందులు తీసుకునేవారు, రక్తం పల్చగా ఉండేందుకు వార్ఫారిన్‌ వంటివి తీసుకునేవారు మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు ఇచ్చే స్టాటిన్స్‌పై మద్యం ప్రభావం ఉంటున్నట్టు గుర్తించారు. అలాగే కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌ తీసుకుంటున్నప్పుడు మద్యం తాగకపోవటం ఉత్తమం. వీటి గురించి వైద్యులతో ముందే చర్చించటం అవసరం.

  • బానిస వ్యసనం
తాగకుండా ఉండలేకపోవటం, ఎంత తాగుతున్నామన్న దానిపై నియంత్రణ కోల్పోవటం.. ఇది మద్యం వ్యసనానికి బానిస అవుతున్నామని చెప్పే సంకేతం! దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇంట్లో వాతావరణం, అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి ఉండే కొన్ని వృత్తులు, లేదా సరదాగా సామాజిక సంబంధాల కోసం (సోషల్‌ డ్రింకింగ్‌) తాగాల్సి వస్తుండటం.. ఇవన్నీ కూడా వ్యసనాన్ని పెంచేవే. దీనికి బానిస కావటం వల్ల జరిగే చేటు: ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్య భావనలు పెరగటం వంటి మానసిక సమస్యల్లో కూరుకోవటంతో పాటు నిద్రలేమి, లైంగిక సామర్థ్యం తగ్గటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటివీ వేధిస్తాయి.

  • ఇంకా ఇంకా...
** అందానికి చేటు: మద్యం తాగే వారి స్వరూప స్వభావాలో్లనూ చాలా మార్పులు వస్తాయి. బాగా అలిసిపోయినట్లుండటం, ముఖం మీద మచ్చల వంటివి వస్తాయి. మద్యం ఒంట్లో ఉన్న నీటిని బయటకు పంపించేస్తుంది, కొన్ని విటమిన్లు, ఖనిజాలు చర్మానికి అందకుండా అడ్డుకుంటుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు, నిర్జీవంగా తయారవుతుంది. చర్మం తేలికగా ఎర్రబారిపోయేలా చేసే 'రొసాసియా' వంటి సమస్యలకూ మద్యంతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
** ఆటలకు దెబ్బ: మద్యం వల్ల క్రీడా సామర్థ్యం తగ్గుతుంది, వ్యాయామం సరిగా చేయలేరు. కాస్త ఎక్కువగా తాగినా యుక్తాయుక్త విచక్షణ పోయి నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది.
** సంతాన నష్టం: స్త్రీపురుషులు ఇరువురిలోనూ కూడా మద్యం సంతాన సామర్థ్యాన్ని, లైంగిక పటుత్వాన్ని తగ్గించేస్తుంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అతిగా మద్యం తాగితే టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గి.. పురుషుల్లో వాంఛలు తగ్గుతాయి, వీర్యం నాణ్యత తగ్గుతుంది. అయితే మద్యం మానేస్తే ఇవన్నీ సర్దుకుంటాయి.
** నిద్ర భగ్నం: నిద్రకున్న ముగ్గురు శత్రువుల్లో మద్యం పెద్ద శత్రువు. కాఫీ/కెఫీన్‌, పొగతో పాటు మద్యం కూడా నిద్రను దెబ్బతీస్తుంది. మద్యం వల్ల ఒంట్లో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. దీనివల్ల మధ్యరాత్రి టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. గుండెల్లో మంట, గురక వంటివీ పెరుగుతాయి.

** ప్రమాదాలకు దారి: పని ఎగ్గొట్టేవారిలో 20%, ఫ్యాక్టరీల వంటి పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల్లో 40% కేవలం మద్యం వల్లేనని గుర్తించారు. ఇక మద్యం కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. మద్యం వల్ల మెదడు చురుకుదనం తిగ్గి, వేగంగా స్పందించే లక్షణం దెబ్బతింటుంది. తలకు మెదడుకు గాయాలయ్యే తీవ్రస్థాయి ప్రమాదాల్లో 15-20% వరకూ కేవలం మద్యం కారణంగానే సంభవిస్తున్నాయి.

** ఇంట్లో చిచ్చు: మద్యం తెచ్చిపెట్టే అతిపెద్దసమస్య.. అందరికీ తెలిసిన సమస్య.. కుటుంబాలు విచ్ఛిన్నం కావటం! సంసారాలు వీధిన పడటం! భార్యల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించే భర్తల్లో 85% మంది మద్యానికి బానిసలైనవారే. మద్యం తగ్గించేలా చూస్తే గృహహింస కేసులు పదోవంతు తగ్గిపోతున్నాయని గుర్తించారు. మద్యం అలవాటు వల్ల అప్పులు పెరిగిపోవటం, పిల్లల చదువులు, ఇంట్లో తిండి వంటి వాటికి కూడా డబ్బుల్లేని దీనస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువ. మద్యం కారణంగా విడాకులకు వెళుతున్న జంటల సంఖ్య చాలా ఎక్కువ.

  • గుండె
ప్రస్తుతం గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజూ కొద్దిగా రెడ్‌వైన్‌ తీసుకుంటే గుండెకు మంచిదని చెబుతుంటే ఎవరికైనా గుండెజబ్బుల నివారణకు ఇదేదో తేలికైన మార్గమే అనిపిస్తుంది. రోజూ మితంగా మద్యం తీసుకోవటం గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు గుర్తించిన మాట నిజమేగానీ వాస్తవానికి ఈ లాభమన్నది కాలక్రమంలో 'ఎంత' తాగుతున్నారన్న దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు మనం తాగే అలవాట్లు, కుటుంబ చరిత్ర, వయస్సు, జన్యుపరమైన అంశాల వంటివీ కీలకమే. ముఖ్యంగా గుర్తించాల్సిందేమంటే- మితి మీరి తాగితే ఇది ప్రత్యక్షంగా గుండె జబ్బుకు ఓ ముఖ్యమైన రిస్కుగా తయారవుతుంది!

పొగతాగటం, వ్యాయామం చెయ్యకపోవటంలాగానే మద్యం మితి మీరి తాగటం కూడా గుండె జబ్బులకు దారి తీసే అంశమని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. చాలాకాలం విపరీతంగా తాగితే ఆరోగ్యవంతుల్లో ఉన్నట్టుండి గుండె లయ చెడిపోయే (హాలిడే హార్ట్‌) ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస ఇబ్బందులు, బీపీలో మార్పులు రావటంతో పాటు గుండెపోటు, హఠాన్మరణం ముప్పు కూడా పెరుగుతుంది. ఆల్కహాల్‌ రక్తంలో హోమోసిస్టీన్‌ అనే పదార్థం స్థాయులను ప్రభావితం చేస్తుంది, అది పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చే రిస్కూ పెరుగుతుంది.

  • వ్యసనం - విముక్తి
** ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా మద్యం కళ్ల ముందు లేకుండా చూసుకోండి. కనబడకుండా ఉంటే మనసును తొలచకుండా ఉంటుంది.

** భోజనం మానకండి. అది మద్యానికి తలుపులు తెరుస్తుంది.

** మద్యానికి బానిసలమయ్యామనీ, దాని ముందు అశక్తులమైపోయామనీ నిస్సహాయంగా ఆలోచించటంగానీ, మాట్లాడటంగానీ చెయ్యద్దు. మీ

అనుమతి, అంగీకారం లేకుండా మద్యం మీ గొంతు దిగే అవకాశమే లేదని మర్చిపోవద్దు.

** మానలేమని ముందే నిర్ణయానికి రావద్దు. ప్రయత్నం మానొద్దు.

** ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రోజూ వ్యాయామం చెయ్యండి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఎంత వ్యాయామం చేస్తే.. ఆల్కహాల్‌ తాగాలన్న కాంక్ష అంతగా తగ్గిపోతుంటుంది.

** చక్కెరలు, తీపి పదార్థాలు బాగా తగ్గించెయ్యండి. వాటి మీద కాంక్ష పెరిగితే మనసు మద్యం మీదకు మళ్లటం పెరుగుతుంది.

** మంచినీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఎంత గొప్ప మేలు చేస్తుందో మరువద్దు. రోజూ కనీసం ఐదు పెద్ద గ్లాసులైనా నీళ్లు తాగాలి.

** మద్యం వల్ల జీవితంలో ఎదురైన ఇబ్బందులు, కష్టనష్టాలు, దయనీయ ఘట్టాలను గుర్తుకు తెచ్చుకోండి.
** మీ జీవితం నుంచి మద్యాన్ని తుడిచిపెట్టేస్తే.. మీలోని నిజమైన మనిషి, ఆ స్ఫూర్తి మరింతగా ప్రకాశించే అవకాశం ఉంటుంది. మద్యం మానేస్తే మీలో దాగున్న ప్రేమ, ప్రతిభ, చతురత వంటివన్నీ బయటపడతాయి.

**ఆల్కహాల్‌ వ్యసనాన్ని పోగొట్టటంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందినవారు సైకియాట్రిస్ట్‌లు. వ్యసనాన్ని వదిలించటానికి చాలా రకాల విధానాలున్నాయి. కాబట్టి మద్యం నుంచి బయటపడేందుకు సైకియాట్రిస్ట్‌ల సహాయం తీసుకోవటానికి సంకోచించవద్దు.

** మద్యంతో పోరాడి బయటపడిన, పడుతున్నవారంతా కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సహకార సంస్థ 'ఆల్కహాలిక్స్‌ ఎనానిమస్‌.' దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దీని విభాగాలున్నాయి. మద్యం మానెయ్యాలని అనుకుంటున్న వారందరికీ ఇందులో సభ్యత్వం ఇస్తారు. స్థానిక విభాగాన్ని సంప్రదించటం లక్ష్య సాధన దిశగా గొప్ప ముందడుగు అవుతుంది.
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.