Saturday, October 23, 2010

ఎండోమెట్రియాసిస్‌ , Endometriosis



  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEipDMAGnVDsWPbaFI_vgZoue3zXpB2pe4tSu8wakaMNKGSGob0UQjvj7MukBjN_HxlehrMnT9lguuk0qRTv7VWdAC_klcq6bgs1VMB03MsjZD95PHZGkik4ypHzJfl8C7SZVSQK8tzilYME/s1600/Cervix.jpg

ఎందుకొస్తుందో ఇదమిత్థమైన కారణం తెలీదు. నియంత్రించటం కష్టం. నివారించటం మరీ కష్టం. అందుకే ఎండోమెట్రియాసిస్‌ ఎంతోమంది బాధితుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తాజాగా ఓ అధ్యయనం గుర్తించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 15-49 ఏళ్ల మధ్య వయసు స్త్రీలలో దాదాపు 17.6 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. చాలామంది ఈ వ్యాధి లక్షణాలైన పొత్తికడుపులో నొప్పి వంటి బాధలు అనుభవిస్తూనే ఉంటారుగానీ నిర్ధారణ పరీక్షలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. లేకుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాలు ఆరంభమైన తర్వాత సగటున 11 ఏళ్లకుగానీ వీరు చికిత్స కోసం ముందుకు రావటం లేదని, అన్నేళ్లపాటు మౌనంగానే బాధలు అనుభవిస్తున్నారని గుర్తించారు.

గర్భాశయం లోపల.. పిండం కుదురుకోవటానికి వీలుగా ఎండోమెట్రియం పొర నెలనెలా పెరుగుతూ ఉంటుంది. గర్భాశయం లోపల వైపుననే పరిమితమవ్వాల్సిన ఈ పొర కొందరిలో వెలుపలి వైపు, చుట్టుపక్కల కూడా పెరుగుతూ పొత్తికడుపులో తీవ్ర అసౌకర్యం, నొప్పి తెచ్చిపెడుతుంటుంది. ఇదే ఈ సమస్యకు మూలం. దీనివల్ల స్త్రీలలో సంతాన రాహిత్యమూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకు ఇంతపెద్ద శాపంగా పరిణమిస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించినపూర్వాపరాలు, చికిత్సా మార్గాలు అంతగా తెలియవు. పైగా ఇది నెలసరి రుతుక్రమం, నొప్పి, లైంగిక సమస్యల వంటివాటితో ముడిపడినదైనందున చాలామంది స్త్రీలు దీని గురించి బయటకు చెప్పుకోవటానికి కూడా వెనకాడుతున్నారు. అందుకే అమెరికాలో 'ఎండోమెట్రియోసిస్‌ ఫౌండేషన్‌' దీనిపై పరిశోధనల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోంది.

ఎండోమెట్రియోసిస్‌పై ఇటీవల తాజాగా రెండు పరిశోధనలు జరిగాయి. అమెరికాలోని ఒక ఔషధ సంస్థ ఎనిమిది దేశాలకు చెందిన 21,746 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో సుమారు 10% మందిలో ఎండోమెట్రియోసిస్‌ ఉన్నట్టు తేలింది. ఇక రెండోది.. ప్రపంచ ఎండోమెట్రియోసిస్‌ పరిశోధన సంస్థ సహకారంతో చేసిన గ్లోబల్‌ హెల్త్‌ స్టడీ ఆఫ్‌ వుమెన్స్‌ హెల్త్‌ (జీఎస్‌డబ్ల్యూహెచ్‌) అధ్యయనం. ఇందులో పది దేశాల నుంచి ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు గల 1,405 మందిని పరిశీలించారు. వీరిలో 62% మంది సగటున 23 ఏళ్ల వయసులోనే వ్యాధి సంబంధిత లక్షణాలు కనబడటం ప్రారంభించాయని వెల్లడైంది. చాలామంది లక్షణాలు కనిపించిన మూడేళ్ల తర్వాత గానీ వైద్యుల సలహా తీసుకోవటం లేదు. వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం మరో ఎనిమిదేళ్లు జాప్యం అవుతోంది. అంటే దాదాపు 11 ఏళ్ల పాటు తమకు తెలియకుండానే దీనితో బాధపడుతున్నారని అర్థమవుతోంది. ఎండోమెట్రియోసిస్‌ కారణంగా బాధల తీవ్రత కూడా ఎక్కువే. కండరాలు పట్టేయటం, నెలసరి సమయంలోనూ మధ్యలోనూ తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, రతిలో బాధ, మూత్రాశయం మీద ఒత్తిడి, మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి వంటివాటితో చాలామంది సతమతమవుతున్నారు. చికిత్సలో వైద్యులు నొప్పి నివారణ మందులు ఇస్తున్నా పెద్దగా ఫలితం కనబడటం లేదు. ఆపరేషన్‌తో మంచి ఫలితాలుంటున్నప్పటికీ అది వైద్యుల నైపుణ్యంతో సహా ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటోంది.

ఎండోమెట్రియోసిస్‌ మనం వూహించినదానికంటే ఎక్కువగానే దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తోందని వెల్లడించటం ఈ అధ్యయనాల ప్రత్యేకత. 50% మంది బాధితుల్లో లైంగిక జీవితం, 36% మందిలో లైంగిక, కుటుంబ సంబంధాలు, సంతాన సామర్థ్యం దెబ్బతింటున్నాయి. మూడింట ఒకరు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు నొప్పి, ఇబ్బందులు, వైద్యుల దగ్గరకు వెళ్లటం వంటి వాటివల్ల ఎంతోమంది ఉద్యోగిణులు వారంలో 10 పని గంటలు నష్టపోతున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగానూ ఎండోమెట్రియోసిస్‌ ప్రభావం చూపుతున్నందున దీనిపై తక్షణం దృష్టి సారించటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యాధిని గుర్తించగలిగితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో చాలావరకూ ఇబ్బందులను తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎండోమెట్రియోసిస్‌ / డా|| పి.బాలాంబ -రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ (గైనకాలజీ)-ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌-హైదరాబాద్‌ .

నొప్పి. నొప్పి. నొప్పి. ఎండోమెట్రియోసిస్‌ను ఒక్క ముక్కలో చెప్పమంటే బాధితులు ఇంతకు మించి వర్ణించలేరు. నెలసరిలో నొప్పి. దానికి ముందు నొప్పి. ఆ తర్వాతా నొప్పి. ముదిరిన కొద్దీ రోజంతా నొప్పి. నెలంతా.. నిరంతరం.. అంతూదరీ లేని నొప్పి. ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఎండోమెట్రియోసిస్‌. గుర్తించటం తేలిక కాదు. గుర్తించినా పూర్తిగా నయం కాదు. చికిత్స అంత సులభం కాదు. యుక్తవయస్సు ఆడపిల్లల నుంచి మధ్య వయసు స్త్రీల వరకూ ఎంతోమంది అనుభవిస్తున్న ఈ తీవ్ర వేదనకు అంతులేదు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. చికిత్సల్లోనూ కొంత పురోగతి వస్తోంది. ముఖ్యంగా ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. దీనిపై ఎంత అవగాహన పెంచుకుంటే అంత మంచిది.

యంత్రం చక్కగా పనిచేస్తుండాలంటే ఎక్కడ ఉండాల్సిన బోల్టు, ఎక్కడ ఉండాల్సిన నట్టు అక్కడుండాలి. అవి వూడి యంత్రంలో పడిపోయినా.. జారి వేర్వేరు చోట్ల ఇరుక్కుపోయినా ఇక ఆ యంత్రం పరిస్థితి అయోమయమే. అష్టకష్టాలూ తప్పవు. సరిగ్గా స్త్రీశరీరంలో ఎండోమెట్రియం పొర పరిస్థితీ ఇంతే!

స్త్రీగర్భాశయం లోపల ఉండే అద్భుత నిర్మాణం ఎండోమెట్రియం పొర!

నెలనెలా హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ.. గర్భాశయం గోడలకు ఆనుకుని.. ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే.. చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే.. ఇది విడివడి.. రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. రుతుక్రమంలో భాగంగా మళ్లీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెలనెలా, నిరంతరాయంగా జరుగుతుండే సహజసిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర.. గర్భాశయం లోపలే కాదు... దాని బయట కూడా పొత్తికడుపులో అక్కడక్కడ, ఇతరత్రా చోట్ల పెరుగుతూ.. నొప్పితో తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుంది. దీని పేరే ఎండోమెట్రియోసిస్‌! దీని ప్రధాన లక్షణం నొప్పి. ఎందుకు వస్తుందో ఇప్పటి వరకూ కచ్చితమైన అవగాహన లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్త్రీలు దీనితోనిత్యం నరకం అనుభవిస్తున్నారు.

  • [Dysmenorrhoea.jpg]
ఎందుకొస్తుంది?
గర్భాశయం లోపలే ఉండాల్సిన ఎండోమెట్రియం పొర.. దాని వెలుపలకు ఎందుకు వస్తుందో... ఇతరత్రా అవయవాలపై ఎందుకు అతుక్కుని ఉంటుందో కచ్చితంగా తెలియదు. దీనికి ఎన్నో సిద్ధాంతాలున్నాయి.
* వెనక్కి మళ్లే సమస్య: బహిష్టు సమయంలో వెలువడే స్రావం ఫలోపియన్‌ ట్యూబుల ద్వారా కొంత వెనక్కి వెళ్లి, (రెట్రోగ్రేడ్‌ మెన్‌స్ట్రుయేషన్‌) పొత్తికడుపులో చేరచ్చు. అందులోని ఎండోమెట్రియల్‌ కణజాలం పొత్తికడుపులోని పొరలపై చేరి అక్కడే అతుక్కుని పెరుగుతుండొచ్చన్నది ఒక సిద్ధాంతం. ఇలా వెనక్కివెళ్లటానికి గర్భాశయంలో నిర్మాణ లోపాల నుంచి అవరోధాల వరకూ ఎన్నో అంశాలు కారణం కావచ్చు. రుతుస్రావం బయటకు వచ్చే మార్గం సరిగా లేక లోపలే గూడు కట్టుకుపోయి అది ఫలోపియన్‌ ట్యూబుల ద్వారా వెనక్కు వెళ్లి అక్కడ అతుక్కుని ఎండోమెట్రియంగా మారొచ్చు. ఇది కూడా ఎండోమెట్రియోసిస్‌కు దారి తీయొచ్చు. అలాగే గర్భాశయం తయారయ్యేటప్పుడే అక్కడి పొరల్లో తెలత్తే లోపాల వల్ల (మెటాప్లేసియా) కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చన్నది మరో అవగాహన. ఎండోమెట్రియం పొర దగ్గర్నుంచి వెళ్లే రక్త/లింఫ్‌ నాళాలు ఎండోమెట్రియం కణజాలాన్ని మోసుకెళ్లి ఇతరత్రా భాగాల్లోకి వ్యాప్తి చేయటం, ఎండోమెట్రియం పొర బహిష్టు సమయంలో బయటకు వచ్చి పరిసర భాగాలకు అతుక్కోవటం, షిగెల్లా తరహా సూక్ష్మక్రిముల కారణంగా కూడా ఎండోమెట్రియోసిస్‌ వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం భావిస్తున్నారు.

ఇలా కారణాలేమైనా.. అంతిమంగా ఈ పొర గర్భాశయంలోనే కాకుండా పొత్తికడుపులో ఎక్కడ అతుక్కుని ఉన్నా.. అక్కడే నెలనెలా శరీరంలోని స్త్రీహార్మోన్లతో ప్రేరణ పొందుతుంటుంది. ఫలితంగా దీని నుంచి అక్కడే రక్తస్రావం అవుతుంటుంది. గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర నుంచి వచ్చే స్రావాలు సహజ మార్గం ద్వారా రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తాయిగానీ.. ఇతరత్రా ప్రాంతాల్లో పెరిగే ఈ పొర నుంచి వచ్చే స్రావాలు బయటకు పోయే మార్గం లేక పొత్తికడుపులోనే చేరిపోయి.. పేరుకుపోతూ.. రకరకాల సమస్యలు సృష్టించటం మొదలుపెడతాయి. ఎండోమెట్రియోసిస్‌ బాధలకు ఇదే మూలం. ఈ సమస్య వంశపారపర్యంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకూ ఉండే అవకాశం ఎక్కువ.

లక్షణాలేమిటి?
* నెలసరి నొప్పి: సాధారణంగా చాలామందిలో నెలసరి తొలిరోజున ఎంతోకొంత నొప్పి ఉంటుంది. ఇది కొన్ని గంటల తర్వాత తగ్గిపోతుంది. దీన్ని 'ప్రైమరీ డిస్‌మెనోరియా' అంటారు. అయితే ఎండోమెట్రియోసిస్‌ బాధితుల్లో నెలసరికి రెండు మూడు రోజుల ముందు నుంచే నొప్పి ఆరంభమవుతుంది. అదీ చాలా తీవ్రంగా. కొందరిలో ఇది భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. రుతుస్రావం అవుతున్న రోజుల్లోనే కాదు, ఆగిన తర్వాత కూడా రెండు మూడు రోజులు ఈ నొప్పి ఉంటుంది. క్రమేపీ ఎండోమెట్రియాసిస్‌ ముదిరినకొద్దీ ఈ నొప్పి మరింత తీవ్రమవుతూ.. చివరకు నెలంతా, నిరంతరం వేధిస్తుంటుంది.
* సంభోగంలో నొప్పి: సంభోగంలో నొప్పి మరో ముఖ్య లక్షణం. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్‌ తీవ్రమైతే అండాశయాల్లో పెద్దపెద్ద తిత్తుల వంటివి ఏర్పడతాయి. వీటినే 'చాక్లెట్‌ సిస్ట్‌'లంటారు. ఇవి పొత్తికడుపులో కొందికి జారి స్థిరపడతాయి. దీంతో సంభోగం సమయంలో నొప్పి మరింత తీవ్రతరంగా ఉంటుంది. దీంతో కొందరు సంభోగం పట్ల విముఖత కూడా పెంచుకుంటారు.
* సంతాన రాహిత్యం: నొప్పితో పాటు ఎండోమెట్రియోసిస్‌తో మరో ముఖ్య సమస్య పిల్లలు పుట్టకపోవటం. వీరికి పిల్లలు పుట్టటం కష్టం. వీరిలో కృత్రిమ గర్భధారణ చికిత్సలతోనూ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి.
* మూత్ర విసర్జనలో నొప్పి: మూత్రాశయం సమీపంలోని పొరల్లో ఎండోమెట్రియాసిస్‌ ఏర్పడితే మూత్ర విసర్జన సమయంలోనూ నొప్పి రావొచ్చు. అరుదుగా కొందరికి నెలసరి సమయంలో మూత్రంలో రక్తం కూడా పడొచ్చు.
* మల విసర్జనలో నొప్పి: కొందరిలో మలద్వారం, గర్భాశయం మధ్య ఎండోమెట్రియోసిస్‌ పొర పెరుగుతుంటుంది. వీరికి నెలసరి సమయంలో మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీంతో మల విసర్జన అంటే భయపడటం ఆరంభిస్తారు, ఇది మలబద్ధకానికి దారితీస్తుంది.
* దీర్ఘకాలిక నొప్పి: కొందరికి పొత్తికడుపులో నొప్పి నెలసరి సమయంలోనే కాదు.. ఎప్పుడూ వేధిస్తుంటుంది. నెలసరి ఆరంభం కావటానికి ముందు రోజుల్లో గర్భాశయం, ట్యూబుల భాగాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఆ భాగాలన్నీ ఉబ్బుతాయి. దీంతో పెరిటోనియం సాగి నొప్పికి దారి తీస్తుంది. ఇక నెలసరి సమయంలో లోపల్లోపలే రక్తస్రావం కావటం వల్ల నొప్పి. నెలసరి తర్వాత అక్కడ రక్తం గూడు కడుతుంది. అందులోని సీరమ్‌ వంటి ద్రవస్రావాలు ఒంట్లో కలిసిపోయినా లోపల గూడుకట్టుకున్న రక్తం అలాగే అట్టకట్టినట్టు ఉండిపోతుంది. మళ్లీ నెలసరి వచ్చినప్పుడు ఇది మరికాస్త పెరుగుతుంది. అండాశయాల్లో అయితే అది గూడుకట్టుకుని 'చాక్లెట్‌ సిస్ట్‌'లా తయారవుతాయి. మిగతా చోట్ల అలా కాదు కాబట్టి అక్కడ రక్తస్రావం అయినప్పుడల్లా క్రమేపీ పెరుగుతూ చాక్లెట్‌ రంగులో 'బ్రౌన్‌ స్పాట్స్‌'గా ఏర్పడతాయి. నెలనెలా రక్తస్రావమవుతూ చుట్టుపక్కల ఉండే కణజాలం, పేగులు, కొవ్వుపొర(ఒమెంటమ్‌) వంటివన్నీ వచ్చి అక్కడ అతుక్కుపోతుంటాయి. దీంతో అవన్నీ అతుక్కుపోయి పేగుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఇలా గర్భాశయం, అండాశయాలు, పెద్దపేగు, మూత్రాశయం.. ఇలా కింద అవయవాలన్నీ అతుక్కుపోయినప్పుడు.. పొత్తికడుపు మొత్తం గడ్డకట్టినట్టుగా.. పరిస్థితి 'ఫ్రోజెన్‌ పెల్విస్‌'కు దారి తీస్తుంది. అన్నీ అతుక్కుపోయి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది.అందుకే ఎండోమెట్రియోసిస్‌ను ముందుగానే గుర్తించి పరిస్థితి ముదరకుండా.. ఇటువంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవటం అవసరం.

ల్యాప్రోస్కోపీతోనే కచ్చిత నిర్ధారణ
ఎండోమెట్రియం పొర పొత్తికడుపులో రకరకాల చోట్ల పెరుగుతూ నొప్పి వేధిస్తున్నా సాధారణ పరీక్షల ద్వారా దీన్ని కచ్చితంగా నిర్ధారించటం కష్టం. పైగా ఇదే తరహా నొప్పి లక్షణాలు ఇతరత్రా సమస్యల్లోనూ ఉంటాయి. ముఖ్యంగా పొత్తికడుపులో నొప్పి, సంభోగంలో నొప్పి వంటివి కూడా ఇన్ఫెక్షన్లతో రావచ్చు, నాళాల్లో నీరు, చీము వంటివి ఉన్నా నొప్పి రావచ్చు. ఈ అవయవాల్లో ఎక్కడన్నా క్షయ ఉన్నా రావచ్చు. అండాశయాల్లో క్యాన్సర్‌, 'క్రానిక్‌ ఎక్టోపిక్‌' వంటి సమస్యల్లో కూడా ఈ తరహా లక్షణాలే ఉండొచ్చు. కాబట్టి వీటిని సరిగా గుర్తించాల్సి ఉంటుంది. సాధారణంగా లక్షణాల ఆధారంగా బలంగా అనుమానించినా ఎండోమెట్రియాసిస్‌కు కచ్చితమైన నిర్ధారణ మాత్రం- ల్యాప్రోస్కోపీ విధానంలో పొట్టలోకి కెమేరా గొట్టాన్ని పంపి.. లోపల అవయవాలను టీవీ తెరపై క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా మాత్రమే సాధ్యం. ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో చాక్లెట్‌ సిస్ట్‌ల వంటివి కొంత వరకూ గుర్తించే అవకాశం ఉంటుంది.

  • [Dysmenorrhoea.jpg2.jpg]
చికిత్స ఏమిటి?
లక్షణాలు ఎంత బాధాకరంగా ఉంటాయో చికిత్స కూడా అంత కష్టమని చెప్పక తప్పదు. ప్రధానంగా ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడ అతుక్కుని ఉన్నా.. నెలనెలా హార్మోన్ల ప్రేరణతో అవి పెరుగుతుంటాయి కాబట్టి ప్రధానంగా హార్మోన్లను నిరోధించే దిశగా చికిత్స చేస్తారు.
* మందులు: నొప్పి తగ్గే మందులతో పాటు.. నెలనెలా వచ్చే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ అందుతుంటేనే ఎండోమెట్రియం పెరుగుతుంది కాబట్టి దాన్ని ఆపేందుకు ఆర్నెల్ల పాటు ప్రొజెస్ట్రాన్‌ హార్మోను ఇస్తారు. అంటే నెలసరి రాకుండా చూస్తారు. దాంతో ఎండోమెట్రియం పొరలు కుచించుకుపోతాయి. అయితే ఈ మందులతో లావు కావటం, మానసికంగా కుంగుబాటు, మూడ్‌ మారిపోతుండటం వంటి దుష్ప్రభావాలుంటాయి. డేనజాల్‌ అనే పురుష హార్మోను కూడా ఇచ్చేవారుగానీ దీనితో గడ్డాలుమీసాలు పెరగటం వంటి పురుష లక్షణాలు, దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండటంతో దీన్ని చాలా వరకూ మానేశారు.
* లూప్రైడ్‌: 'గొనడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్లు (జీఎన్‌ఆర్‌హెచ్‌)' కాస్త ఖరీదైన ఇంజక్షన్లు. నెలకొకసారి, లేదా మూడు నెలలకు ఒకసారి ఇస్తే వీటితో తాత్కాలికంగా నెలసరి నిలిచిపోయి, ముట్లుడిగిన దశ వంటిది వస్తుంది. దీనివల్ల ఎండోమెట్రియం బాగా సంకోచిస్తుంది. ఇది మంచిదేగానీ ఈ మందుల వల్ల ఒళ్లంతా వేడి ఆవిర్లు, ఉన్నట్టుండి గుండెదడ, చెమటలు రావటం వంటివి వచ్చి, కొద్దిసేపటి తర్వాత సర్దుకోవటం, కొద్దిగా జుట్టూడటం, హార్మోన్లు లోపిస్తాయి కాబట్టి యోని పొడిబారి సంభోగంలో ఇబ్బంది వంటి ఇబ్బందులుంటాయి. కానీ ఎండోమెట్రియాసిస్‌ను అడ్డుకోవటానికి ఈ దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు.
* ల్యాప్రోస్కోపీ: ఆపరేషన్‌ చేసి ల్యాప్రోస్కోపీ ద్వారా చూస్తూ పొత్తికడుపులో ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ తొలగిస్తారు. దీనిలో 'సర్జికల్‌ అబ్లేషన్‌' అన్నది ముఖ్యమైన ప్రక్రియ. అలాగే అవయవాలు అతుక్కుని ఉంటే వాటిని విడదీస్తారు. ఇలా ల్యాప్రోస్కోపీ చేసినా ఇంకా లోపల ఎక్కడన్నా ముక్కలు మిగిలిపోవచ్చు. అవి తర్వాత మళ్లీ బాధించటం మొదలుపెట్టచ్చు. కాబట్టిమూడు నెలల పాటు జీఎన్‌ఆర్‌హెచ్‌ తరహా ఇంజెక్షన్లు ఇస్తారు. వీటిని కూడా ఆర్నెల్లకు మించి మరీ ఎక్కువకాలం ఇవ్వటం కష్టం. మొత్తానికి వీటితో మంచి ఫలితం ఉంటుంది. చాలామందిలో సంతానం కోసం ఇవన్నీ అవసరం. ల్యాప్రోస్కోపీలో తొలగించిన తర్వాత కొంతకాలం బాగానే ఉండొచ్చుగానీ తర్వాత మళ్లీ బాధలు రావని చెప్పటం మాత్రం కష్టం.

గర్భం వస్తే నెమ్మదిస్తుంది
గర్భం వచ్చినప్పుడు ఎండోమెట్రియోసిస్‌ బాగా తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలో ఒంట్లో బోలెడు హార్మోన్లు చురుకుగా ఉంటాయి, నెలసరి కూడా ఉండదు కాబట్టి ఈ సమయంలో నొప్పి బాధలు ఉండవు. ఎండోమెట్రియాసిస్‌ కూడా బాగా తగ్గుతుంది, ప్రసవానంతరం నెలసరి మొదలైన తర్వాత కొంత ఉండొచ్చు గానీ మొత్తానికి చాలామందిలో అంత తీవ్రంగా ఉండకపోవచ్చు.

హిస్ట్రెక్టమీ
నిరంతరం నొప్పి, బాధల మూలంగా విసిగిపోయి చాలామంది గర్భసంచీ తొలగించే హిస్ట్రెక్టమీ ఆపరేషన్‌ చేయమంటుంటారుగానీ దాన్ని తొలగించటంలో కూడా చాలా సమస్యలుంటాయి. యుక్తవయస్సులోనే అండాశయాలు తొలగిస్తే హార్మోన్ల లోపం రావటం, బయటి నుంచి హార్మోన్లు ఇస్తే ఎక్కడన్నా మిగిలిపోయిన ఎండోమెట్రియం పొర మళ్లీ పెరగటం వంటి బాధలు ఉంటాయి. ఇప్పటికే పిల్లలుండి, మధ్యవయసులో ఉన్న వారికి గర్భసంచీ తొలగించే ఆపరేషన్‌ గురించి ఆలోచించవచ్చు.

మొత్తమ్మీద..
* ఓ మోస్తరు నొప్పి ఉన్న వారికి గర్భనిరోధక మాత్రలు, హార్మోన్‌ చికిత్సలతో చాలా వరకూ నియంత్రించవచ్చు.
* నొప్పి కాస్త ఎక్కువగా ఉంటే ల్యాప్రోస్కోపీ చేసి నిర్ధారించి, ఆ ఎండోమెట్రియం పొరలన్నింటినీ సాధ్యమైనంత వరకూ తొలగిస్తారు. అతుక్కున్న అవయవాలను విడదీస్తారు. ఆపరేషన్‌ తర్వాత కొంతకాలం 'జీఎన్‌ఆర్‌హెచ్‌' ఇంజక్షన్లు, మందులు ఇస్తారు. మళ్లీ వస్తే ఇదే చికిత్స మళ్లీ చెయ్యాల్సి ఉంటుంది.
* ఇప్పటికే పిల్లలుండి, మధ్యవయసులో ఉంటే బాధల తీవ్రతను బట్టి గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్‌ గురించి కూడా ఆలోచించవచ్చు.
* ల్యాప్రోస్కోపీలో అవయవాలను విడదీసే సమయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే గర్భాశయం మలాశయం, మూత్రాశయం వంటివాటికి అతుక్కుపోయి ఉంటే విడదీయటానికి చేసే ప్రయత్నంలో వాటికి రంధ్రాలు పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ల్యాప్రోస్కోపీలో కొన్నిసార్లు అన్నింటినీ విడదీయటం కూడా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వీటి గురించి కౌన్సెలింగ్‌ ముఖ్యం.
* లేటు వయసు పెళ్లిళ్లు, గర్భాలను వాయిదా వేయటం, ఒకటి రెండు గర్భాలే ధరించటం.. వీటన్నింటి వల్లా ఏళ్ల తరబడి నెలనెలా నిరంతరాయంగా నెలసరి వస్తూనే ఉండటం వల్ల వీరిలో ఎండోమెట్రియాసిస్‌ ముప్పు పెరుగుతోంది.
* కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారు ముందు నుంచే జాగ్రత్తపడటం, పెళ్లి కాగానే గర్భం ధరించటం వంటి చర్యలు ఉపయోగపడతాయి.
* ముందే గుర్తిస్తే దీన్ని చాలా వరకూ నివారించుకునే అవకాశం ఉంటుంది. లక్షణాలుంటే త్వరగా వైద్యులను సంప్రదించటం, వాళ్లు ల్యాప్రోస్కోపీ వంటివి చేస్తామంటే అంగీకరించటం ముఖ్యం.
* క్యాన్సర్‌ లాగానే ఎండోమెట్రియోసిస్‌ కూడా చుట్టుపక్కల ఉండే ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. అంతమాత్రాన ఇది క్యాన్సర్‌ కాదు. అందుకే దీనిని 'బినైన్‌ డిసీజ్‌ విచ్‌ స్ప్రెడ్స్‌ లైక్‌ క్యాన్సర్‌' అని అంటుంటారు.
* చాలామంది ఎండోమెట్రియోసిస్‌, చాక్లెట్‌ సిస్ట్‌ల వంటివన్నీ మధ్యవయసు వారిలోనే వస్తాయని భావిస్తుంటారుగానీ ఇటీవలి కాలంలో ఇవి యుక్తవయసు ఆడపిల్లల్లోనూ ఎక్కువగానే కనబడుతున్నాయి.
ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు అందరిలోనూ కనిపించాలనేం లేదు. ఎండోమెట్రియం పొర బయటపెరుగుతున్నా ఇందుకు సంబంధించిన బాధలు కొంతమందిలోనే కనిపిస్తాయి. సిజేరియన్‌ కోసం పొత్తికడుపు తెరిచినప్పుడు చాలామందిలో గర్భాశయం వెనక, చుట్టుపక్కల ఎండోమెట్రియం పొరలు అతుక్కుని కనిపిస్తుంటాయి. కానీ వారికి నొప్పి వంటి బాధలుండవు, పిల్లలు బాగానే పుడతారు. కానీ మరికొందరిలో ఏ కొంచెం ఎండోమెట్రియం పొర బయట పెరుగుతున్నా నొప్పి, తదితర లక్షణాలు ఉంటాయి. వీరికి గర్భధారణ సమస్యలు కూడా ఉండొచ్చు.
ఎడినోమయోసిస్‌
ఎండోమెట్రియం పొర గర్భాశయం గోడల్లోకి వెళ్లి.. అక్కడ ఉండిపోతే తీవ్రమైన బాధలు మొదలవుతాయి. దీనికి చికిత్స చేయటం చాలా కష్టం. నిరంతరం తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతో ఎంతోమంది గర్భాశయమే వద్దనే స్థితికి చేరుకుంటారు. వీరికి కృత్రిమ గర్భధారణ పద్ధతులతోనూ పిల్లలు కలగటం కష్టం. ల్యాప్రోస్కోపీలో దీన్ని తొలగించవచ్చుగానీ గోడల్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా తొలగించటం సాధ్యం కాదు. వీరికి ఇప్పటికే పిల్లలు ఉంటే ఒక వయసు వచ్చాక గర్భాశయాన్ని తొలగించొచ్చు. పిల్లలు లేకపోతే మాత్రం చికిత్స కష్టంగా మారుతుంది. వీరికి కొత్తగా 'మిరీనా' అని హార్మోన్లుండే 'కాపర్‌ టీ' వంటిది అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమరిస్తే ఐదేళ్ల పాటు లోపలే ఉండి హార్మోన్లు విడుదల చేస్తూ ఎడినోమయోసిస్‌ కొంత తగ్గేలా చేస్తుంది. ఆ తర్వాత పిల్లల కోసం ప్రయత్నం చెయ్యచ్చు.

  • source : Eenadu sukhibhava 26/04/2011


  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.