Thursday, June 24, 2010

కంప్యూటర్ అవశేషాలు (Waste) అనారోగ్యము , Computer Waste & ill-health







e - (కంప్యూటర్ ) వేస్ట్‌ను ఏం చేద్దాం ?

పెరుగుతున్న విజ్ఞానంతో పాటు మనిషి అవసరాలు తీర్చేందుకు కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, టీవిలు, ప్రిజ్‌లు, మైక్రోవేవ్‌ ఒవెన్లు పుట్టుకొచ్చాయి. వీటి సర్వీస్‌ పూర్తవడంతో వాటిని వేస్జేజీగా జమకట్టి అమ్మేస్తుంటాం. కానీ పనికిరాని ఈ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్ని అమ్మేసి మనం చేతులు దులుపుకున్నా తయారీ సమయంలో వీటిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాలు ధ్వంసం చేయడానికి వీలులేకుండా పోతున్నాయి. వీటినే ‘ఈ-వేస్టు ‌’గా అంటారు. ఈవేస్ట్‌లో నిక్షిప్తమై ఉన్న రసాయనపదార్థాలు మనిషి ఆరోగ్యానికి కీడు చేయడంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా హాని కలిగిస్తున్నాయి. ఫలితంగా వీటి ప్రభావం మనతో పాటు రాబోయే తరాల వారికి కూడా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలో ప్రతి సంవత్సరం 200 నుం డి 500 లక్షల టన్నుల ఈవేస్ట్‌ ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే వ్యర్థ భాగంలో ఐదు శాతాన్ని ఆక్రమిస్తుంది. యూ రోపియన్‌ దేశాలు విడుదల చేసే ఈ వేస్ట్‌ నిష్పత్తి ప్రతి సంవత్సరం 35 శాతం పెరుగుతోందని గ్రీన్‌పీస్‌ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంటర్నేషనల్‌ సింపోజియమ్‌ ఆన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ రిపోర్టు ప్రకారం చైనాలో ప్రతియేటా 7 కోట్ల మొ బైల్‌ ఫోన్లు, 3.3 కోట్ల టీవీలు, 44 లక్షల కంప్యూటర్లు పనికిరాని వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయట.
వదిలించుకుంటున్నాయి...
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఈ-వ్యర్థాల్ని భూమిలో పాతకుండా, కాస్త ఖరె్చైనా రిసైక్లింగ్‌ చేయాలని ఆయా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నాయి. కొన్ని దేశాలు తెలివిగా తమ దేశాల్లో పేరుకుపోయిన ఈవేస్ట్‌ను ఆసియా, ఆఫ్రికా వంటి పేదదేశాలకు కారుచౌకగా అమ్మేసి చేతులు దులుపుకుంటున్నాయి.

యూరోపియన్‌ దేశాల్లో యేటా విడుదలయ్యే 77లక్షల టన్నుల ఈవేస్ట్‌లో దాదాపు 66 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను అక్రమంగా చైనా, భారత్‌, ఆఫ్రికా దేశాలకు రవాణా చేస్తున్నాయి. 2005లో అమెరికాలో ఈవేస్ట్‌గా సేకరించిన కంప్యూటర్లలో 10 శాతం, టీవీల్లో 14 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు తరలించారు. మిగిలిన వాటిని నైజీరియా వంటి పేద దేశాలకు అక్రమంగా తరలిస్తున్నాయి. మెరికా నుండి ప్రతి నెలా కనీసం లక్ష కంప్యూటర్లు ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి.

ప్రమాదభరితంగా రీసైక్లింగ్‌....
ధనిక దేశాలు రీసైక్లింగ్‌ పద్ధతులకు అవలంబించాల్సిన నిర్దుష్ట పద్ధతులు, నియమాలను తుంగలో తొక్కుతున్నాయి. దీనికి పేదరికం, నిరుద్యోగం తోడవడంతో వేలాది కార్మికులు ఉపాధి లభిస్తుందనే ఆశతో ప్రాణాలకు తెగించి రీసైక్లింగ్‌ పరిశ్రమల్లో పనికి చేరుతున్నారు.యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ పోగ్రాం అందించిన నివేదిక ప్రకారం రీసైక్టింగ్‌ యూనిట్లలో విషతుల్య డైఆక్సీన్‌ శాతం పరిమితికి మించి 37-133 శాతం ఉన్నట్లు నిర్ధారించింది.

శ్వాససంబంధ వ్యాధులు, హృద్రోగ సమస్యలతో వేలాది కార్మికులు అకాల మరణం చెందుతున్నారని యూఎన్‌ఈపీ అధ్యయనంలో తేలింది. మనదేశం లో నూ ఈవేస్ట్‌ను రిసైక్లింగ్‌ చేసే ప రిశ్రమల్లో పెద్ద ఎత్తున కంప్యూటర్‌ మానిటర్లు, కేబు ళ్లు, ప్రింట్‌ కార్ట్‌రిజ్‌లు, సీడీలు, విద్యుత్‌బల్బులు, ట్యూబ్‌లైట్లను భస్మం చేస్తుంటారు. ఫలితంగా ప్రమాదకారకమైన లెడ్‌(సీసం) వ్యర్థా లు కార్మికుల ఆరోగ్యాన్ని హరించడంతో పాటు పర్యావరణాన్ని మరింత కలుషితయం చేస్తున్నాయి.
-----------------------------------------------------------------------------------
ఎలా ధ్వంసం చేయాలంటే....
సాధారణంగా ఈవేస్ట్‌ను నాలుగు దశల్లో భస్మీపటలం చేస్తారు.
లాండ్‌పిల్‌:
ఇది సాధారణంగా అందరూ అవలంబించే పద్ధతి. కానీ ఈ పక్రియలో విషపూరిత రసాయనాలు, పదార్థాలు భూమిలో కలిసి జలవాయువుల్ని కలుషితం చేస్తున్నాయి. అమెరికన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ అందజేసిన లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే 2005లో 46 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను భూమిలో పాతిపెట్టారు. యూరోపియన్‌ దేశాల్లో ఈవేస్ట్‌ను నేలలో పాతిపెట్టడం చట్టరీత్యా నేరం.

ఫైర్‌ (కాల్చడం) :
ఈ పక్రియలో సేకరించిన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్ని నిర్దేశించిన ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. కానీ ఈ పద్ధతి వల్ల భారీ మోతాదులో సీసం, కాడ్మియం, డైఆక్సీన్‌ వంటి హానికారక రసాయనాలు వెలువడి గాలిని కలుషితయం చేస్తాయి.

రీయూజ్‌:
పరికరాల జీవన ప్రమాణాన్ని పెంచి మళ్లీ వాటిని వినియోగించడాన్నే రియూజ్‌ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ వేస్ట్‌ను దిగుమతి చేసుకునే ఉద్యేశ్యం కూడా ఇదే. తక్కువ ఖర్చులో విలువైన సామాగ్రిని పేద ప్రజలకు అందించాలనే బృహత్తర లక్ష్యం దీని వెనుకుంది. కానీ వీటి జీవితకాలం బహుస్వల్పం కావడం వల్ల వాటిని దిగుమతి చేసుకున్న దేశాలు పర్యావరణ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాయి.

రీసైక్లింగ్‌:
ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించిన ముడిపదార్ధాల్ని జాగ్రత్తగా సేకరించి కొత్త వాటిలో ఉపయోగించే పక్రియే రిసైక్లింగ్‌. కానీ ఈ పక్రియలో పనిచేసే కార్మికులకు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురౌతాయి. చుట్టుపక్కల ప్రాంతాలు పర్యావరణ పరంగా కలుషితం అవుతాయి.

మన దేశంలో:
ఆర్థికంగా శీఘ్రగతిన అబివృద్ధి చెందుతోన్న మన దేశంలో సగటున ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం ప్రతియేటా పెరుగుతోంది. ఫలితంగా ఈవేస్ట్‌ పరిమాణం కాస్తా వృద్ధి చెందింది. కానీ ఇప్పటి వరకు వీటిని పర్యావరణానికి హాని కలిగించకుండా ధ్వంసం చేయడానికి సరైన వ్యవస్థగానీ, నిపుణులు గానీ మనదేశంలో లేకపోవడం గమనార్హం. 2008లో భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈవేస్ట్‌ను ధ్వంసం చేయడానికి కొత్తగా దిశానిర్దేశాల్ని జారీచేసింది. అయినా ఇప్పటి వరకు ఇవి కార్యరూపం దాల్చలేదు.

కంప్యూటర్ల పాత్ర...
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈవేస్ట్‌లో అధికభాగం కంప్యూటర్ల నుండి వస్తుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. గ్రీన్‌పీస్‌ లెక్కల ప్రకారం 2006నాటికి కంప్యూటర్లు 57.35 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. టోక్యో (జపాన్‌)లోని ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కంప్యూటర్‌లో ఉపయోగించే చిన్న చిప్‌ను ధ్వంసం చేస్తే కలిగే పర్యావరణహాని ఒక కారును ధ్వసం చేసినపుడు వచ్చిన కాలుష్యానికి సమానమట. రెండు గ్రాముల బరువుండే కంప్యూటర్‌ చిప్‌ను తయారు చేయడానికి 1.6 కిలో ఇంధనం, 72గ్రాముల రసాయనాలు అవసరమౌతాయి.

మనిషి శరీరంపై కంప్యూటర్‌ పరికరాల దుష్ర్పభావం...
మానిటర్‌: ఇందులో ఉండే క్యాథోడ్‌ రే ట్యూబ్‌లో 4-8పౌండ్ల లెడ్‌ ఉంటుంది. ఇది మానిటర్‌ అద్దానికి రేడియేషన్‌ కిరణాల్ని పంపడంతో అవి నేరుగా మనకి వచ్చి తాకుతాయి. మానిటర్‌ అద్దానికి వాడే బేరియం, ఫాస్ఫేట్‌ వంటి రసాయనాలు విషతుల్యాలే.

కంప్యూటర్‌ ఛేసిస్‌:
లోహంతో తయారు చేసే కంప్యూటర్‌ బాడీలు వాతావరణ ప్రభావానికి లోనవకుండా ఉండేందుకు హెక్సావాలెంట్‌ క్రోమియం అనే విషపూరిత రసాయనంతో పూత పూస్తారు.

కేబుల్స్‌, వైర్లు:
వీటి తయారీకి పి.వి.సి, పి.బి.డి.ఇ (పాలీ బ్రోమినేటెడ్‌ డిఫెన్లీథర్స్‌) పదార్థాల్ని వాడుతారు.

సర్క్యూట్లు, బోర్డులు:
సర్క్యూట్ల తయారీలో లెడ్‌ తీగలు, సెమికండక్టర్లు, చిప్స్‌ వాడితే, బోర్డు తయారికి బెరీలియాన్ని వాడుతారు. వీటిపై పూతకోసం మెర్క్యురీ వాడుతారు. సెమికండక్టర్లు, రెసిస్టర్లలో కాడ్మియం వాడుతారు.

మానవ శరీరంపై దుష్ర్పభావాలు...

లెడ్‌ (సీసం):
మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలను అడ్డుకుటుంది.

బేరియం:
మెదడు వ్యాపు వ్యాధికి దారితీస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. గుండె, కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

హెక్సావాలెంట్‌ క్రోమియం:
డి.ఎన్‌.ఎ వ్యవస్థను నాశనం చేస్తుంది.

ఫాస్ఫరస్‌:
జ్ఞాపకశక్తి నశిస్తుంది.

బెరీలియం:
క్యాన్సర్‌ వ్యాధికి దారితీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది.

మెర్క్యురీ:
మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం, మహిళల్లో పిల్లల్ని కనే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.

పి.బి.డి.ఇ:
పిండం ఎదుగుదలను అడ్డుకుంటుంది.

  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.