Tuesday, March 30, 2010

ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు , Amniotic Fluid More and less




ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు... హెచ్చరికలే

అమ్మకడుపులో తొమ్మిదినెలలు.. ఈ సమయంలో గర్భస్థ శిశువులో ఎన్నెన్నో మార్పులు. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనే తల్లులు కొన్ని సందర్భాల్లో కలవరపడుతుంటారు కూడా.

శిశువు ఎదుగుదలలో.. సౌకర్యాన్నందించడంలో కీలకం ఉమ్మనీరు. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయికన్నా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సాధారణంగా అయితే.. గర్భం ధరించినప్పటి నుంచీ ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఇది 30 ఎం.ఎల్‌.. ఆ తరవాత అంటే తొమ్మిదో నెలకు ఇది వెయ్యి ఎం.ఎల్‌వరకు చేరవచ్చు. గర్భస్థశిశువు ఇందులో కదలడమే కాదు అప్పుడప్పుడు స్వీకరించడం.. మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం కూడా బిడ్డ ఎదుగుదలలో భాగమే.

ఉమ్మనీరు చేసే మేలు..
బిడ్డ గర్భంలో సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డ చుట్టూ సమాన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.. వేడి తగ్గినప్పుడు ఉమ్మనీరు రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. బయటి నుంచి శిశువుకు గాయాలు కాకుండా కాపాడే బాధ్యత కూడా ఉమ్మనీరుదే.

తగ్గినా, పెరిగినా ప్రమాదమే...
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఎలా తలెత్తుతాయో చూద్దాం..

ఓలిగోహైడ్రామ్నియోస్‌: ఉమ్మనీరు ఉండాల్సిందానికన్నా తక్కువగా ఉండటాన్నే ఇలా పరిగణిస్తారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని మూత్రం ద్వారా విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి బాగా తగ్గిపోతుంది. అలాగే శిశువులో మూత్రం తయారు కాకపోయినా, విసర్జించిన మూత్రం ఉమ్మనీరు ఉన్న సంచిలోకి చేరకపోయినా, మూత్రనాళం ఏర్పడకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మనీటికి కారణమైన పొరలు రాసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వవచ్చు. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, గర్భస్థ శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్నిరకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం.. (వైద్యులు చెప్పిన తేదీ దాటి రెండు వారాలు గడిచినా ప్రసవం కాకపోవడం..) వంటి కారణాల వల్ల కూడా ఉమ్మనీరు స్థాయి బాగా తగ్గిపోతుంది.

పాలీహైడ్రామ్నియోస్‌: గర్భంలో బిడ్డ చుట్టూ ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉండటాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా పరిగణిస్తారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అసలు స్వీకరించకపోయినా.. శిశువు ఉదర సంబంధ పేగు (గ్యాస్ట్రోఇంటస్త్టెనల్‌ ట్రాక్‌) మూసుకుపోవడం వల్లకూడా ఇలా జరుగుతుంది. సహజ ప్రక్రియలో శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలేదంటే.. అందుకు ఉదరం, మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు.. మరికొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉండటం, తల్లికి జెస్టేషినల్‌ డయాబిటీస్‌.. వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో కారణాలు విశ్లేషణకు అందకపోవచ్చు.

ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, సమస్యలు: నెలలు నిండకుండానే నొప్పులు రావొచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ (ప్లాసెంటా) వేరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ(మాల్‌ప్రెజెంటేషన్‌) స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ.

ఇలా తెలుసుకోవచ్చు...
ఉమ్మనీరు పెరుగుతోందా.. తగ్గుతోందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చక్కటి పరిష్కారం. అలాగే బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డాప్లర్‌ ఫ్లో స్టడీలతో బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. కాస్త అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే పండంటి పాపాయిని ఆహ్వానించవచ్చు.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.